శ్రీకాళహస్తి( Srikalahasthi) దేవస్థానంలో శివరాత్రి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. శివభక్తుల నినాదాలతో శ్రీకాళహస్తీశ్వర దేవాలయ ప్రాంగణం మార్మోగింది. వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివార్లను దర్శించుకుంటున్నారు.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తీశ్వర స్వామికి ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. వీరితో పాటు శ్రీకాళహస్తి శాసన సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా ఎస్పీ విష్ణు వర్ధన్ రాజు, రెవిన్యూ డివిజన్ అధికారి భాను ప్రకాష్ రెడ్డి తదితరులు ఉన్నారు.
పట్టు వస్త్ర సమర్పణ అనంతరం మంత్రి ఆనం, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు ఆలయ అర్చకులు మంత్రి ఆనం, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి స్వాగతం పలికారు. పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం అర్చకులు వీరికి ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఆలయంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆలయా అధికారులకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచించారు. ఇంకా ఆలయంలో జరుగుతున్న పలు సేవ కార్యక్రమాలను గురించి అడిగి తెలుసుకున్నారు.