రాష్ట్రంలో ప్రసిద్ధి పొందిన నవనారసింహ క్షేత్రాల్లో ఒకటైన సింహాచల శ్రీ వరాహ స్వామి అధ్యాత్మిక క్షేత్రాన్ని కూటమి ప్రభుత్వం మరింత అభివృద్ధి చేస్తోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సోమవారం విశాఖ పర్యటనలో భాగంగా మంత్రి కందుల దుర్గేష్ ప్రసిద్ధ సింహాచలం క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ స్కీం (Pilgrimage Rejuvenation and Spiritual Augmentation Drive) ద్వారా చేపడుతున్న ఆలయ అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఏపీ పర్యాటకాభివృద్ధికి, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం నుండి మంచి సపోర్ట్ ఉందని తెలుపుతూ పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడవద్దని కాంట్రాక్టర్లకు, అధికారులకు సూచించారు.సకాలంలో ఆలయ అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.నాణ్యత విషయంలో పొరపాట్లు దొర్లితే సహించేది లేదని హెచ్చరించారు. ఏప్రిల్ చివర్లో జరిగే చందనోత్సవం కార్యక్రమానికి క్యూ లైన్ పనులు, టాయిలెట్స్, బాత్ రూమ్స్ తదితర పనులు పూర్తి చేయగలిగితే భక్తుల తాకిడిని నియంత్రించవచ్చన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. మే నాటికి పనులు పూర్తి చేసి భక్తులకు పూర్తిగా వినియోగంలోకి తీసుకురావాలని తెలిపారు.

గతంలో సింహాచలం దర్శనానికి వచ్చే భక్తులు కేవలం దర్శనం మాత్రమే చూసుకొని వెనుదిరిగేవారన్నారు. చుట్టు ప్రక్కల ప్రాంతాలను చూసేందుకు అవసరమైన వసతులు ఉండేవి కావన్నారు. ప్రస్తుతం సింహాచలంకు వచ్చే భక్తులు దర్శనంతో పాటు నాలుగైదు రోజులు ఉండి చుట్టు ప్రక్కల ప్రదేశాలను చూసే విధంగా టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేసి హోటల్స్, ఇతర మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు.

విశాఖలో బీచ్, అడ్వెంచర్, ఎకో, క్రూయిజ్ టూరిజం ప్రక్రియలను పర్యాటకులు అనుభవించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.లంబసింగిలో మంచి రిసార్ట్స్ లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. బొర్రా గుహలను మరింత అభివృద్ధి చేస్తున్నామన్నారు. పదుల సంఖ్యలో థీమాటిక్ అప్రోచ్ లతో ముందుకు వెళ్తున్నామన్నారు. ప్రస్తుతమున్న ప్రసాద్ స్కీంలో క్యూ కాంప్లెక్స్, ఫెసిలిటేషన్ సెంటర్ ద్వారా బట్టలు మార్చుకునే గదులు,స్నానాలు చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. వసతి కల్పన ఇందులో పొందుపరచలేదన్నారు.
భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు అవసరమైన కెప్టేరియా ఉందన్నారు. భవిష్యత్ లో వేరే స్కీం లో వసతి సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రసాద్ స్కీం నిధుల విషయంలో ప్రభుత్వాల మార్పుతో, పనుల ప్రదేశాల మార్పు వల్ల కొంత జాప్యం జరిగిందన్నారు. నిధుల రాక కోసం పనులు పూర్తి చేసినట్లుగా యుటిలైజేషన్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. నిధుల విడుదలకు ఏ ఇబ్బంది లేదన్నారు. దశలవారీగా నిధులు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి స్వయంగా చెప్పినట్లుగా మంత్రి దుర్గేష్ వెల్లడించారు. భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందన్నారు.

ప్రసాద్ స్కీం ద్వారా అన్నవరంలో అభివృద్ధి కార్యక్రమాలు
ప్రసాద్ స్కీం క్రింద అన్నవరం పుణ్యక్షేత్రంలో కూడా పనులు జరుగుతున్నాయని మంత్రి దుర్గేష్ వివరించారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి, అంకిత భావాన్ని చూసి కేంద్ర ప్రభుత్వం పెద్దఎత్తున సపోర్ట్ చేసేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు.ఏప్రిల్ నుండి నాలుగైదు ప్రధాన కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం సహకారంతో చేపట్టనున్నామన్నారు.
పర్యాటక రంగం అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది
కేంద్ర ప్రభుత్వ సహకారంతో రూ.99 కోట్లతో అఖండ గోదావరి, రూ.77 కోట్లతో గండికోట ప్రాజెక్టులను చేపట్టామన్నారు. ఇప్పటికే అఖండగోదావరి ప్రాజెక్టులకు టెండర్లు పూర్తయ్యాయన్నారు. గండికోటకు టెండర్ల ప్రక్రియ ప్రారంభమైన విషయం వెల్లడించారు. త్వరితగతిన ఆయా ప్రాజెక్టుల పూర్తికి చర్యలు తీసుకుంటామన్నారు.

ఇటీవల విశాఖపట్నంలో రీజినల్ ఇన్వెస్టర్ సమ్మిట్ నిర్వహించామని మంత్రి దుర్గేష్ గుర్తుచేశారు. పీపీపీ విధానంలో పర్యాటకాభివృద్ధి చేస్తున్నామన్నారు. పర్యాటక రంగంలో చాలా మంది ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారని గుర్తుచేశారు. 8 ఎంవోయూలు సైతం కుదుర్చుకున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని బీచ్ లకు బ్లూఫ్లాగ్ సర్టిఫికేషన్ వచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. పర్యాటక రంగం అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. పర్యాటక రంగ అభివృద్ధి విషయంలో అధికారులు, కాంట్రాక్టర్లు సైతం మంచి స్ఫూర్తితో పనిచేయాలన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఇటీవల ఢిల్లీలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కలిసినప్పుడు ఏపీకి మరిన్ని ప్రాజెక్టులు కేటాయించేందుకు సుముఖత వ్యక్తం చేశారని గుర్తుచేశారు. రాష్ట్రానికి మంచి విజనరీ నాయకులు సీఎంగా, డిప్యూటీ సీఎంలుగా ఉన్నారని కేంద్రం నుండి ఎప్పుడూ ఏ సపోర్ట్ కావాలన్నా అందించేందుకు ముందుకు వస్తామని తెలిపినట్లు మంత్రి వివరించారు.

అంతకుముందు వేదమంత్రోచ్ఛరణల మధ్య మంత్రి కందుల దుర్గేష్ సింహాచలం శ్రీ వరాహ స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి దర్శనం చేసుకున్నారు.ఈ క్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు,అధికారులు మంత్రి దుర్గేష్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారి కప్పస్తంభం ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత మంత్రి దుర్గేష్ కు ఆశీర్వచనం చేసి స్వామి వారి తీర్థ ప్రసాదం అందజేశారు. అదే విధంగా ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటాన్ని మంత్రి దుర్గేష్ కు అందజేశారు