Mobile Charging VS Vastu: మన రోజువారీ జీవితంలో మొబైల్ ఫోన్ ఒక విడదీయరాని భాగమైపోయింది. తిండి ,నిద్ర అయినా లేకుండా ఉంటున్నారు కానీ..మొబైల్ లేకుండా మాత్రం ఉండడం లేదు.ఉదయం లేచిన క్షణం నుంచి రాత్రి నిద్రపోయే సమయం వరకు ప్రతి ఒక్కరూ చేతిలో ఫోన్ పెట్టుకుని ఉంటారు. ఈ కాలంలో స్మార్ట్ ఫోన్ లేకుండా ఒక రోజు కూడా గడపటం కష్టమనే చెప్పాలి. అయితే ఫోన్ వాడకం ఎంత ముఖ్యమో, దానిని ఏ దిశలో ఛార్జింగ్ పెడతామన్నది కూడా అంతే ముఖ్యమని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
దిశల ప్రాముఖ్యత…
ఇంటి నిర్మాణం, గదుల అమరిక, వస్తువుల స్థానం మొదలైన వాటిలో వాస్తు శాస్త్రం అనుసరించటం సాధారణ విషయం. కానీ అదే విధంగా ప్రతిరోజూ ఉపయోగించే ఎలక్ట్రానిక్ పరికరాల విషయంలోనూ దిశల ప్రాముఖ్యత ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మొబైల్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు సరైన దిశ ఎంచుకోవాలని అంటున్నారు. దిశ తప్పితే శారీరకంగా, మానసికంగా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని వారు సూచిస్తున్నారు.
అనుకూలమైన దిశ ఆగ్నేయం..
వాస్తు ప్రకారం ఎలక్ట్రానిక్ వస్తువులకు అత్యంత అనుకూలమైన దిశ ఆగ్నేయం. ఈ దిశలో పరికరాలు పెట్టినప్పుడు శక్తి సానుకూలంగా ప్రవహిస్తుందని, మనకు అవసరమైన సమతుల్యత లభిస్తుందని పండితులు చెబుతారు. అందువల్ల మొబైల్ ఫోన్‌ను ఆగ్నేయ దిశలో ఛార్జింగ్ పెట్టడం మంచిదని సూచిస్తున్నారు. ఇది మనకు మానసిక ప్రశాంతతతో పాటు పనుల మీద ఏకాగ్రత పెరగడానికి సహాయపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఎలక్ట్రానిక్ పరికరాలు ఏవైనా…
ఇది మొబైల్ ఫోన్‌కే పరిమితం కాదు. ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్, ఇయర్ బర్డ్స్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఏవైనా ఉన్నా వాటిని కూడా అదే దిశలో ఉంచడం మంచిదని చెబుతున్నారు. రోజువారీగా పని చేసే సమయంలో మనం సాంకేతిక పరికరాలపై ఆధారపడుతున్నందున, వాటిని సరైన దిశలో ఉంచడం ద్వారా మానసిక స్థితి స్థిరంగా ఉండి పనులు సజావుగా సాగుతాయని అంటున్నారు.
ఫోన్ ఛార్జింగ్ విషయంలో కొన్ని చిన్న తప్పులు కూడా సమస్యలకు దారి తీసే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదాహరణకు పడకగదిలో తల దగ్గరగా ఫోన్ ఛార్జింగ్ పెట్టడం ఆరోగ్యానికి అనుకూలం కాదని చెబుతున్నారు. ఎందుకంటే ఆ విధంగా ఉంచితే రాత్రిపూట నిద్రలో అంతరాయం కలగడం, మానసిక అలసట పెరగడం జరగవచ్చు. అందుకే ఫోన్‌ను మంచం వద్ద కాకుండా దూరంగా ఉంచి ఛార్జింగ్ పెట్టడం మంచిదని సూచన ఇస్తున్నారు.
Also Read: https://teluguprabha.net/devotional-news/venus-transit-to-impact-gold-silver-and-commodity-prices/
ఎలక్ట్రానిక్ పరికరాలు శక్తివంతమైన తరంగాలను ఉత్పత్తి చేస్తాయి. అవి సరైన దిశలో లేనప్పుడు ఇంటి వాతావరణం అస్థిరంగా మారుతుందని నమ్మకం ఉంది. ఒకవేళ పరికరాలను వాయవ్య దిశలో ఉంచితే ప్రతికూల ప్రభావం కలగవచ్చని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. ఆగ్నేయం మాత్రం అత్యంత అనుకూలంగా పండితులు,వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
ఇంకా ఒక విషయం గమనించాల్సింది ఏమిటంటే, ఎలక్ట్రానిక్ వస్తువులను ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఉంచడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు. అవి క్రమబద్ధంగా, వాస్తు సూచించిన స్థలాల్లో ఉంటే ఇంట్లో సానుకూల శక్తి పెరిగి కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత కూడా మెరుగవుతుందని వారు అంటున్నారు.


