Karthika masam rules: కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనది. ఈ మాసంలో హిందువులు రకరకాల పూజలు, వ్రతాలు చేస్తుంటారు. కార్తీక మాసంలో చేసే చిన్నపాటి పూజలు, దానాలు గొప్ప ఫలితాన్ని ఇస్తాయని భక్తుల నమ్మకం. అంతటి పవిత్రత, మహిమ గల ఈ మాసంలో చేసే పూజలు, వ్రతాలు ఫలించాలంటే ముఖ్యమైన కొన్ని నియమాలను తప్పక పాటించాలి. ఆ నియమాలు ఇవే!
పవిత్ర స్నానం: సూర్యోదయానికి ముందు నిద్రలేచి తలస్నానం చేయడం ఉత్తమం. వీలైతే పుణ్య నదులలో స్నానం చేయడం అత్యంత శుభప్రదం. ఇలా చేస్తే పాపాలు తొలగిపోయి.. ఆరోగ్యం, శక్తి లభిస్తాయని విశ్వాసం.
దీపారాధన: కార్తీక మాసంలో దీపారాధన అత్యంత ప్రధానమైనది. సూర్యోదయానికి ముందు విష్ణుమూర్తికి, సాయంత్రం వేళలో శివుడికి ఆలయాలు లేదా ఇంట్లో, తులసి కోట ముందు దీపం పెట్టాలి. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించటం వల్ల పుణ్యం వస్తుంది, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.
ఉపవాసం: ఈ మాసంలో ఉపవాసం పాటిస్తే శరీరం, మనసు శుద్ధి అవుతాయి. కార్తీక సోమవారాలు లేదా పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే మంచిది. ఉపవాసం రోజున రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేయాలి. పండ్లు, పాలు వంటివి తీసుకోవాలి.
దానం: ఈ మాసంలో దానం చేయడం ఎంతో మంచిది. శక్తి కొలది పేదవారికి, ఆలయాల్లో దీపాలు, వస్త్రాలు, బెల్లం, నెయ్యి, ఉప్పు వంటివి దానం చేయడం వలన పూజాఫలాన్ని సంపూర్ణంగా పొందవచ్చు. మనసుని దైవంపై నిమగ్నం చేసి ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఈ నియమాలు పాటించటం వలన శాంతి, సౌభాగ్యం కలుగుతాయి. మనం కోరుకున్న ఫలితాన్ని పొందవచ్చు.


