Powerful Naga Temples In India: ఆధ్యాత్మిక యాత్రకు అనుకూలమైన మాసం శ్రావణం. శివుడికి ప్రీతికరమైన ఈ నెలలో చాలా మంది భక్తులు జ్యోతిర్లింగాలు లేదా ప్రసిద్ధ శివాలయాలకు వెళ్తుంటారు. కానీ నాగదేవతల ఆలయాలకు వెళ్లేవారి సంఖ్య చాలా తక్కువ. హిందువులు నాగులను దేవతలుగా పూజిస్తారు. పైగా వాసుకీ అనే సర్పాన్ని శివుడి తన మెడలో అభరణంగా ధరిస్తాడని చెబుతారు. అంటే ఈ శ్రావణ మాసంలో నాగులను పూజించడం కూడా శుభప్రదంగా భావిస్తారు. అయితే నాగదేవతలకు సంబంధించిన ఆలయాలు గురించి తక్కువ మందికే తెలుసు. ఈ క్రమంలో మన దేశంలోని ఐదు శక్తివంతమైన నాగాలయాలు గురించి తెలుసుకుందాం.
మన్నార్సాల శ్రీ నాగరాజ ఆలయం-కేరళ
నాగదేవత ఆలయాల్లో ముందుగా చెప్పుకోదగ్గ ఆలయం మన్నార్సాల శ్రీ నాగరాజ ఆలయం. ఇది కేరళలోని హరిపాడు అటవీ ప్రాంతంలో నెలకొని ఉంది. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే..ఇక్కడ పూజారిగా ఓ మహిళ ఉంటుంది. ఈ కోవెలలో 30,000 కంటే ఎక్కువ సర్ప విగ్రహాలు ఉన్నాయి. ప్రకృతి ఒడిలో ఉన్న ఈ శక్తివంతమైన ఆలయాన్ని శ్రావణ మాసంలో సందర్శించడం వల్ల పిల్లలు లేని వారికి సంతానప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు.
కుక్కే సుబ్రమణ్య దేవాలయం-కర్ణాటక
దక్షిణ కన్నడలోని పశ్చిమ కనుమలలో కుక్కే సుబ్రమణ్య ఆలయం ఉంది. ఈ గుడిలో సర్పాల అధిపతిగా భావించే సుబ్రమణ్య స్వామి నెలకొని ఉంటాడు. ముఖ్యంగా భక్తులు శ్రావణ మాసంలో పూర్వీకుల శాపాల నుండి విముక్తి పొందేందుకు ఈ ఆలయానికి వస్తారు.
నాగచంద్రేశ్వరాలయం-మధ్యప్రదేశ్
ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వర్ ఆలయ సముదాయంలోని మూడవ అంతస్తులో నాగచంద్రేశ్వర్ ఆలయం ఉంది. ఈ గుడి ఏడాదికొకసారి శవనాగ్య సమయంలో నాగ పంచమి నాడు మాత్రమే తెరుచుకుంటుంది. ఐదు పడగల సర్పం నీడలో శివపార్వతులు కూర్చుని ఉన్న విగ్రహం ఉంటుంది. ఈ ఆలయాన్ని సందర్శించడం శుభప్రదంగా భావిస్తారు.
నాగ మందిర్- జమ్మూ మరియు కాశ్మీర్
దేశంలోని శక్తివంతమైన నాగదేవత ఆలయాల్లో జమ్మూ కాశ్మీర్ లోని నాగ మందిర్ కూడా ఒకటి. ఈ గుడి పట్నిటాప్‌లోని పచ్చని కొండల నడుమ పైన్ అడవుల్లో నెలకొని ఉంది. ఇది 600 ఏళ్ల నాటి ఆలయం. సంతానం కోసం, ఇంట్లోని దుష్టశక్తుల నుంచి రక్షణ కోసం భక్తులు ఈ ఆలయానికి వస్తారు.
నాగ వాసుకి ఆలయం-ఉత్తరప్రదేశ్
యూపీ ప్రయాగ్‌రాజ్‌లోని దారాగంజ్‌లో గంగా నది ఒడ్డున శక్తివంతమైన నాగవాసుకి ఆలయం ఉంది. కాలసర్ప దోషంతో బాధపడుతున్నవారు నివారణ కోసం ఇక్కడకు వస్తారు. పురాణాల ప్రకారం, దేవ నాగు అయిన వాసుకి ఈ ప్రదేశంలోనే నివశించినట్లు చెబుతారు.


