Nagula Chavithi 2025 Date and Significance: పాములను పూజించడం హిందూ సంస్కృతిలో భాగం. తెలుగు లోగిళ్లు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో నాగుల చవితి ఒకటి. ఈ పండుగను కార్తీక మాసంలో జరుపుకుంటారు. ప్రకృతి మరియు జంతువుల పట్ల గౌరవ సూచికంగా ఈ వేడుకను చేసుకుంటారు. ప్రతి ఏటా కార్తీక శుద్ధ చతుర్థి తిథి నాడు నాగుల చవితి పండుగను జరుపుకుంటారు. ఈ సంవత్సరం నాగుల చవితి ఎప్పుడు, శుభముహూర్తం, పూజా విధానం తెలుసుకుందాం.
నాగుల చవితి తేదీ, శుభ ముహూర్తం
ఈ ఏడాది నాగుల చవితి అక్టోబర్ 25న జరుపుకోనున్నారు. తిథి అక్టోబర్ 25, 2025 తెల్లవారుజామున 01:19 గంటలకు ప్రారంభమై.. అక్టోబర్ 26 తెల్లవారుజామున 03:48 గంటలకు ముగుస్తుంది. పూజ ముహూర్తం ఉదయం 08:59 గంటల నుండి 10:25 వరకు ఉంటుంది. రాహు కాలం మధ్యాహ్నాం 01:16 గంటల నుండి 02:42 వరకు ఉంటుంది. అదే రోజు యమగండం మార్నింగ్ 06:07 గంటల నుండి 07:33 వరకు ఉంటుంది.
నాగుల చవితి పూజా విధానం
నాగుల చవితి నాడు భక్తులు పుట్టలో ఆవు పాలతోపాటు గుడ్లను వేస్తారు. చలిమిడిని నైవేద్యంగా నాగదేవతకు సమర్పిస్తారు. అంతేకాకుండా పుట్ట దగ్గర టపాసులు కూడా కాలుస్తారు. నిండు నూరేళ్లు సౌభాగ్యం కోసం, సంతానప్రాప్తి కోసం మహిళలు సర్పపూజ చేస్తారు. నాగుల చవితి నాడు నాగదేవతను పూజించడం వల్ల ‘రాహువు’ గ్రహం యొక్క దుష్ప్రభావాలను తగ్గించుకోవచ్చు. ఆ తల్లి దయతో మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది.
Also Read: Rama Ekadashi 2025 -2025లో రామ ఏకాదశి ఎప్పుడు? ఈరోజున శ్రీకృష్ణుడిని ఎందుకు పూజిస్తారు?
ఈ పండుగ రైతులకే ఎందుకు ప్రత్యేకం?
శీతాకాలంలో పాములు తమ గుంటల నుండి బయటకు వచ్చి పంటలను నాశనం చేసే ఎలుకలను తింటాయి. అంతేకాకుండా పాములు మంచినీటిలో హానికరమైన సూక్ష్మజీవులను కూడా చంపుతాయి. పంటలకు నేలను సారవంతం చేయడంలో కీలక పాత్ర పోషించే పాములకు కృతజ్ఞతను తెలియజేయడానికి నాగుల చవితి వేడుకను జరుపుకుంటారు.
పురాణాల్లో నాగుల ప్రస్తావన
నాగులకు తల్లి కద్రువ. మహావిష్ణువుకు శయ్యగా మారిన పాము ఆదిశేషువు. పరమశివుడు మెడలో ఉండేది వాసుకీ. ఇది క్షీర సాగరమథనంలో దేవతలకు, రాక్షసులకు సహాయపడింది. అర్జునుడు మనవడైన పరీక్షిత్తును కాటువేసింది తక్షకుడు. నాగజాతిని నాశనం చేయాలని జనమేజయుడు చేసిన సర్పయాగాన్ని ఆపివేసింది ఆస్తీకుడు అనే నాగరాజు.
Also Read: Chhath Puja 2025 -ఛట్ పూజ పండుగ ఎప్పుడు? దీనిని ఎలా జరుపుకోవాలి?


