కృతయుగంలో వృద్ధ రామలింగేశ్వరుడు, త్రేతా యుగంలో శ్రీ సీతారాముల వారిచే ప్రతిష్టించబడ్డ సైకత లింగం, శ్రీ ఆంజనేయ స్వామిచే ప్రతిష్టించబడ్డ కాశీ లింగం, ద్వాపర యుగంలో పాండవులచే ప్రతిష్టించబడ్డ ధర్మ, భీమ, పార్థ లింగాలు..ఇవి ఇక్కడి హైలైట్స్. ఇలా యుగయుగాల చరిత్ర గలిగిన ప్రసిద్ధ శైవ క్షేత్రంగా శ్రీ గురుజాల రామలింగేశ్వర స్వామి దేవస్థానం అలరారుతోంది.

తుంగభద్ర తీరంలో
ఈ క్షేత్రం కర్నూలు జిల్లా, నందవరం మండల పరిధిలోని గురజాల గ్రామంలో తుంగభద్రా నదీ తీరాన కలదు. మహా శివరాత్రి సందర్భంగా శ్రీ గురుజాల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో స్వస్తిశ్రీ క్రోధి నామ సంవత్సర మాఘ బహుళ త్రయోదశి ఫిబ్రవరి 26 బుధవారం నుండి పాల్గుణ మాసం శుక్ల విదియ మార్చి 1 శనివారం వరకు వైభవోపేతముగా మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్లు దేవాదాయ శాఖ కార్యనిర్వాహణాధికారి రాంప్రసాద్, ఆలయ అర్చకులు హంపయ్య స్వామి ఆలయ కార్యనిర్వాహకులు తెలిపారు.
శ్రీ గురుజాల రామలింగేశ్వర స్వామి దేవాలయం దక్షిణ భారత దేశంలో ప్రసిద్ధ శైవ క్షేత్రాలలో ఒకటి. పంచలింగ క్షేత్రంగా, శ్రీ రామలింగేశ్వర స్వామి క్షేత్రముగా ఈ క్షేత్రం ప్రసిద్ధిగాంచింది.
శివరాత్రికి ప్రత్యేక పూజలు
ఫిబ్రవరి 26 బుధవారం (మహాశివరాత్రి) రోజున స్వామి వారికి శత రుద్రాభిషేకం, శక్తి స్వరూపిణి శ్రీ పర్వతవర్ధనీ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రాత్రి 12-00 గంటలకు లింగోద్భవ సమయాన క్షీరాభిషేకము, రుద్రాభిషేకము, రాత్రి 2-00 గంటలకు శ్రీ పర్వతవర్ధనీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవము తదనంతరం ప్రభోత్సవము జరుగును. ప్రతిరోజూ అన్నదానం, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

దేవాలయ విశిష్టతలు
త్రేతా యుగంలో శ్రీ రామ, రావణ యుద్ధంలో శ్రీరాముల వారి చేతిలో బ్రాహ్మణుడైన రావణబ్రహ్మ మరణించడంతో బ్రాహ్మణ హత్య దోష నివారణకై రామేశ్వరం నుండి అయోధ్య వరకు శివలింగ ప్రతిష్ట చేసి పూజలు నిర్వహించిన ఎడల బ్రాహ్మణ హత్య దోష నివారణ జరుగుతుందని తెలియజేయడంతో శ్రీ సీతా రాములవారు రామేశ్వరం నుండి శివలింగ ప్రతిష్టలు చేస్తూ వస్తున్న క్రమంలో అప్పటి దండకారణ్యమైనటువంటి గురజాల పరిసర ప్రాంతంలో తుంగభద్ర నది తీరాన శివలింగాలు ప్రతిష్టాపన చేయాలని నిశ్చయించి శ్రీరామ భక్తుడైన హనుమంతునికి కాశి క్షేత్రం నుండి శివలింగం తీసుకురావాల్సిందిగా హనుమంతున్ని శ్రీరాముడు ఆదేశించగా హనుమంతుడు కాశీ లింగాన్ని అనుకున్న సమయంలో తేవలేకపోవడంతో శ్రీ సీతారాముల వారి అక్కడ ఉన్న తుంగభద్ర నది తీరాన ఇసుకతో వారే వారి చేతులతో ఇసుక లింగాన్ని తయారు చేసి వారు నిశ్చయించిన సమయానికి ప్రతిష్టించినట్టు స్థల పురాణం చెబుతోంది. అందుకే ఈ క్షేత్రానికి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంగా ప్రసిద్ధిగాంచింది.

పాండవులు స్థాపించిన ఐదు లింగాలు
అనంతరం కాశీ లింగంతో వచ్చిన శ్రీరామ భక్తులైన హనుమంతుడు నేను తెచ్చిన లింగాన్ని కూడా ప్రతి ష్టించాలని శ్రీరాముల వారిని కోరినందుకు కాశీ లింగాన్ని కూడా ప్రతిష్టించారు. ద్వాపర యుగంలో పాండవులు అరణ్యవాసంలో అరణ్యంలో జీవనాన్ని సాగిస్తూ వస్తున్న క్రమంలో వారు అరణ్యవాసం నిర్విఘ్నంగా జరగాలని కోరుకుంటూ శ్రీ గురజాల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో పాండవులు ధర్మరాజు, అర్జునుడు, భీముడు ఒక్కొక్క లింగాన్ని ప్రతిష్టించినట్టు ఆ విగ్రహాలనే ధర్మ, పార్థ, భీమ లింగాలుగా నేడు పూజలందుకుంటున్నాయి.

ప్రసిద్ధ శైవక్షేత్రంగా
ఈ క్షేత్రానికి మహాశివరాత్రి, కార్తీక మాసంతో పాటు ప్రతి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రత్యేకమైన పర్వదినాల్లో శ్రీ గురుజాల రామలింగేశ్వర స్వామి దర్శనానికి లక్షలాదిమంది భక్తులు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రం నుండి భక్తులు వస్తుంటారు. శ్రీ గురజాల రామలింగేశ్వర స్వామి కొలిచిన వారికి కొంగు బంగారమని ఇక్కడికి వచ్చే భక్తులు విశ్వసిస్తారు. శ్రీ గురజాల రామలింగేశ్వర స్వామి దేవాలయ మహా శివరాత్రి ఉత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకూడదని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపిఎస్ ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు డిఎస్పి ఉపేంద్ర బాబు పరివేక్షణలో గ్రామీణ సీఐ మధుసూదన్ రావ్, ఎస్ఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియంత్రణ, భద్రత ఏర్పాట్లు పై ప్రత్యేక దృష్టి సారించి భక్తులకు ఎటువంటి ఆటంకం కలుసుకున్న అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు నందవరం ఎస్సై శ్రీనివాసులు తెలిపారు.

రోడ్డు రవాణా సౌకర్యం
శ్రీ గురజాల రామలింగేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు మూడు బస్సు మార్గంలో గురజాల గ్రామం చేరుకోవచ్చు. 1. కర్నూల్ టూ ఎమ్మిగనూరు అరవై తొమ్మిది కిలోమీటర్లు, ఎమ్మిగనూరు టు గురజాల ఇరవై నాలుగు కిలోమీటర్లు 2. కర్నూల్ వయా సుంకేసుల ప్రాజెక్టు మీదుగా గురజాల 55 కిలోటర్లు, 3. మంత్రాలయం వయా నాగలదిన్నె మీదుగా గురజాల ఇరవై కిలోమీటర్లు ఈ మార్గాల ద్వారా శ్రీ రామలింగేశ్వర స్వామి క్షేత్ర దర్శనానికి వచ్చి భక్తులు గురజాల గ్రామం చేరుకోవచ్చు.