Navaratri 2025:భారతీయ సంప్రదాయాల్లో దసరా నవరాత్రి అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటిగా భావిస్తారు. ఈ పండుగలో తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవి వివిధ రూపాలను ఆరాధిస్తారు. ప్రతి సంవత్సరం భక్తులు తమ సామర్థ్యానికి తగ్గట్టుగా వ్రతాలు పాటించి, పూజలు నిర్వహిస్తూ అమ్మవారిని స్మరించుకుంటారు. 2025 సంవత్సరానికి నవరాత్రి సెప్టెంబర్ 22వ తేదీన ప్రారంభమై అక్టోబర్ 2న విజయదశమితో ముగియనుంది. ఈ పండుగలో కేవలం పూజలు మాత్రమే కాకుండా ఇంటిని శుభ్రంగా ఉంచడం, అనవసరమైన వస్తువులను తొలగించడం కూడా ముఖ్యమని నమ్మకం ఉంది.
ఇంటిని శుభ్రపరచడం..
భక్తుల విశ్వాసం ప్రకారం, నవరాత్రి సమయంలో ఇంటిని శుభ్రపరచడం ద్వారా దుర్గాదేవి అనుగ్రహం లభిస్తుందని చెబుతారు. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులు ఇంట్లో ఉంటే అవి శాంతి, సంపదకు అడ్డంకి అవుతాయని భావిస్తారు. అందుకే ఈ పండుగ రోజుల్లో ఆ వస్తువులను తొలగించడం సుభప్రదంగా పరిగణిస్తారు.
విరిగిపోయిన దేవతా విగ్రహాలు
మొదటగా, విరిగిపోయిన దేవతా విగ్రహాలు లేదా చిరిగిన చిత్రపటాలను ఇంట్లో ఉంచడం అనుకూలం కాదని అంటారు. అటువంటి విగ్రహాలు ఇంట్లో ఉంటే శక్తి స్థిరంగా ఉండదని, కొత్త విగ్రహాలు లేదా కొత్త చిత్రపటాలను ఉంచడం మంచిదని విశ్వాసం ఉంది. అమ్మవారి ఆశీస్సులు పొందాలంటే వీటిని తప్పకుండా మార్చడం అవసరమని పెద్దలు చెబుతారు.
పాతబడిన, చిరిగిన దుస్తులను
అలాగే పాతబడిన, చిరిగిన దుస్తులను ఇంట్లో నిల్వచేయడం కూడా శుభప్రదం కాదని భావిస్తారు. వాస్తు ప్రకారం కూడా ఇది ప్రతికూలతకు కారణమవుతుందని చెబుతారు. అలాంటి దుస్తులను ఉపయోగించలేని స్థితిలో ఉంటే అవసరమైన వారికి దానం చేయడం మంచిదని సూచన ఉంది. దీని ద్వారా ఇంట్లో కొత్త ఆరంభాలకు స్థలం కలుగుతుందని విశ్వాసం.
గడువు ముగిసిన ఆహార పదార్థాలు
వంటగది, మందుల పెట్టెలో గడువు ముగిసిన ఆహార పదార్థాలు లేదా మందులు ఉండకూడదు. అవి ఆరోగ్యానికి హానికరమే కాకుండా ప్రతికూల శక్తిని కూడా ఆకర్షిస్తాయని పెద్దలు అంటారు. నవరాత్రి సమయంలో ముఖ్యంగా కొత్త పదార్థాలు మాత్రమే ఉపయోగించాలనే ఆచారం ఉంది.
పనిచేయని గడియారాలు, వాచీలు
పనిచేయని గడియారాలు, వాచీలు ఇంట్లో ఉండటం జీవనంలో స్థబ్ధతను కలిగిస్తుందని చెబుతారు. వాస్తు ప్రకారం అవి కాలయాపన, నిలకడలేని పరిస్థితులకు కారణమవుతాయని నమ్మకం ఉంది. అందువల్ల ఇంట్లో ఉన్న గడియారాలు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో పరిశీలించి, దెబ్బతిన్నవి తొలగించడం శ్రేయస్కరం.
Also Read: http://Navaratrulu: నవరాత్రుల్లో అమ్మవారి కృపను పొందేందుకు ఏమి చేయాలంటే..!
దెబ్బతిన్న పాత్రలు, తుప్పు పట్టిన వస్తువులు
దెబ్బతిన్న పాత్రలు, తుప్పు పట్టిన వస్తువులు కూడా నవరాత్రి సమయంలో ఉపయోగించరాదని అంటారు. అలాంటి వస్తువులు ఇంట్లో శాంతి తగ్గిస్తాయని భావిస్తారు. వాటి స్థానంలో శుభ్రమైన పాత్రలను ఉపయోగించడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుందని విశ్వాసం.
పదునైన వస్తువులను
పదునైన వస్తువులను ఇంట్లో తెరిచి ఉంచకూడదని పెద్దలు తరతరాలుగా చెబుతున్నారు. కత్తులు, కత్తెరలు వంటి వస్తువులు బయట ఉండటం వల్ల ప్రతికూలతలు పెరుగుతాయని, ఇంట్లో గొడవలు పెరగవచ్చని నమ్మకం ఉంది. అందువల్ల అలాంటి వస్తువులను ఎల్లప్పుడూ సురక్షితంగా మూతపెట్టడం మంచిదని చెబుతారు.
చిందరవందరగా ఉన్న వస్తువులు..
ఇంకా ఒక ముఖ్యమైన అంశం ఇంట్లో చిందరవందరగా ఉన్న వస్తువులు. వాడని వస్తువుల గుట్టలు, అనవసరమైన దుస్తులు, బూట్లు వంటి వాటిని ఒకే చోట పోగు చేయడం ఇంటి శక్తిని అడ్డుకుంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. నవరాత్రి రోజుల్లో ఇలాంటివి తొలగించి ఇంటిని శుభ్రంగా ఉంచితే సానుకూల శక్తి ప్రవేశిస్తుందని విశ్వాసం.


