Navaratri-Navadurga: భారతదేశంలో ప్రతి సంవత్సరం జరిగే ముఖ్యమైన ఆధ్యాత్మిక వేడుకల్లో నవరాత్రి ఒకటి. తొమ్మిది రోజులు జరిగే ఈ పండుగలో దుర్గాదేవి తొమ్మిది అవతారాలను ప్రత్యేకంగా పూజిస్తారు. ప్రతిరోజూ అమ్మవారిని ఒక రూపంలో ఆరాధిస్తూ, ఆ రూపానికి తగిన వస్త్రాలు, నైవేద్యాలు సమర్పిస్తారు. నవరాత్రి పూజా విధానాలు ప్రధానంగా రెండు సాంప్రదాయాల ప్రకారం ఉంటాయి. ఒకటి పురాణాల్లో వివరించిన విధానం కాగా, మరొకటి శాస్త్రాల ఆధారంగా జరిగే పూజా సంప్రదాయం. దేవీ మహాత్మ్యం, దేవీ కవచం వంటి గ్రంథాల్లో ఈ రూపాల ప్రాముఖ్యత స్పష్టంగా వివరించబడింది.
దుర్గామాత విభిన్న రూపాల్లో..
2025 సంవత్సరంలో దేవీ నవరాత్రులు సెప్టెంబర్ 22న ప్రారంభమై అక్టోబర్ 2న విజయదశమితో ముగుస్తాయి. ఈ తొమ్మిది రోజులలో దుర్గామాత విభిన్న రూపాల్లో దర్శనమిస్తూ భక్తులకు శక్తి, జ్ఞానం, ధైర్యం, శాంతి వంటి అనేక అనుగ్రహాలను అందిస్తుందని విశ్వసిస్తారు. దుర్గాదేవి రూపాలను గమనిస్తే ఒక స్త్రీ జీవితం చిన్ననాటి నుంచి మోక్షం వరకు అనుభవించే దశలను ప్రతిబింబిస్తుందని పండితులు చెబుతారు.
శైలపుత్రి రూపాన్ని..
మొదటి రోజు అమ్మవారి శైలపుత్రి రూపాన్ని ఆరాధిస్తారు. శైల అంటే పర్వతం, పుత్రి అంటే కుమార్తె. ఈ అవతారంలో ఆమె పర్వత రాజు కుమార్తెగా పుట్టిందని నమ్మకం ఉంది. ఆమెను హిమపుత్రికగా కూడా పిలుస్తారు. పార్వతీదేవి అవతారంగా భావించే శైలపుత్రి భక్తులకు శక్తి, విశ్వాసం, అచంచల భక్తిని ప్రసాదిస్తుంది.
బ్రహ్మచారిణి రూపాన్ని..
రెండవ రోజున బ్రహ్మచారిణి రూపాన్ని పూజిస్తారు. ఈ రూపంలో అమ్మవారు తపస్సు, నియమ నిష్ఠలకు ప్రతీక. కఠోర ధ్యానం చేసి శివుడిని పొందిన రూపంగా భావిస్తారు. చేతిలో జపమాల, కమండలం పట్టుకొని పాదరక్షలు లేకుండా నడుస్తున్న రూపంలో దర్శనమిస్తుంది. ఆమె భక్తులకు జ్ఞానం, శాంతి, ఆధ్యాత్మిక ప్రగతిని ప్రసాదిస్తుంది.
చంద్రఘంట రూపం
మూడవ రోజున చంద్రఘంట రూపానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. నుదిటిపై అర్ధచంద్రుని వలె కనిపించే గంట ఆకారంతో ఈ అవతారానికి చంద్రఘంట అనే పేరు వచ్చింది. ఈ రూపం చెడును నశింపజేస్తుందని, దుష్టశక్తుల నుండి రక్షణ ఇస్తుందని నమ్ముతారు. సింహంపై స్వారీ చేస్తూ పది చేతులతో దర్శనమిచ్చే చంద్రఘంట రూపంలో ఒకవైపు శాంతి, మరోవైపు యుద్ధ శక్తి ప్రతిబింబిస్తాయి. ఆమెను పూజించడం వలన భయం తొలగి ధైర్యం పెరుగుతుందని విశ్వాసం.
కూష్మాండ రూపాన్ని..
నాలుగవ రోజు కూష్మాండ రూపాన్ని పూజిస్తారు. ఈ రూపం విశ్వ సృష్టికి మూలమైన ఆది శక్తిగా భావించబడుతుంది. చిరునవ్వుతో సృష్టికి జీవం, శక్తిని ఇచ్చిన రూపమని కథలు చెబుతాయి. ఈ అవతారాన్ని పూజించే వారు ఆరోగ్యం, సంపద, సంతోషం పొందుతారని భక్తులు విశ్వసిస్తారు.
స్కందమాతకు..
ఐదవ రోజున స్కందమాతకు పూజలు జరుగుతాయి. స్కందుడు లేదా కార్తికేయుడు కుమారుడిగా ఉన్న ఈ అవతారం మాతృత్వానికి ప్రతీక. సింహంపై కూర్చుని తన కుమారుడిని ఒడిలో ఎత్తుకుని దర్శనమిచ్చే ఈ రూపం ప్రేమ, రక్షణ, కుటుంబ సౌభ్రాతృత్వానికి చిహ్నం. స్కందమాతను ఆరాధించడం ద్వారా భక్తుల కుటుంబాలలో శాంతి, శ్రేయస్సు కలుగుతుందని అంటారు.
కాత్యాయని రూపాన్ని..
ఆరవ రోజు కాత్యాయని రూపాన్ని పూజిస్తారు. పురాణాల ప్రకారం కాత్యాయన మహర్షి చేసిన తపస్సుతో సంతృప్తిచెందిన దేవతలు ఆయన కుమార్తెగా అవతరించిందని కథనం ఉంది. ఆమెను యోధ దేవతగా భావిస్తారు. కాత్యాయని భక్తులకు శక్తి, ధైర్యం అందించి చెడుపై విజయం సాధించేందుకు స్ఫూర్తినిస్తుంది. వివాహయోగం కలుగకపోయిన అమ్మాయిలు ఆమెను ఆరాధిస్తే వివాహ బంధం కలుగుతుందని విశ్వాసం ఉంది.
దుర్గాదేవి కాళరాత్రి రూపాన్ని..
ఏడవ రోజు దుర్గాదేవి కాళరాత్రి రూపాన్ని పూజిస్తారు. ఇది అమ్మవారి అత్యంత ఉగ్ర స్వరూపం. నల్లని శరీర వర్ణం, గోరక్షణకు అంకితమైన రూపంతో దుష్టశక్తులను నశింపజేసే శక్తి కలిగిన అవతారం. కాళరాత్రిని ఆరాధించడం వలన భయాలు తొలగిపోతాయని, చెడు శక్తుల నుండి రక్షణ లభిస్తుందని భక్తులు నమ్ముతారు.
మహాగౌరి రూపం..
ఎనిమిదవ రోజు మహాగౌరి రూపం పూజిస్తారు. తెల్లని వర్ణంతో, స్వచ్ఛతకు ప్రతీకగా నిలిచే ఈ రూపం ప్రశాంతత, కరుణను సూచిస్తుంది. ఎద్దుపై స్వారీ చేస్తూ త్రిశూలం, డమరుకం ధరించిన మహాగౌరి జీవనయాత్ర చివరి దశను సూచిస్తుందని పండితులు చెబుతారు. భక్తులకు ఆమె ఆరోగ్యం, ఆయురారోగ్యం, సంపూర్ణ శ్రేయస్సును ప్రసాదిస్తుందని నమ్ముతారు.
సిద్ధిదాత్రి రూపాన్ని..
తొమ్మిదవ రోజు సిద్ధిదాత్రి రూపాన్ని పూజిస్తారు. ఈ అవతారం దివ్యశక్తులకూ మూలం. అన్ని సిద్ధులను ప్రసాదించగల రూపంగా భావిస్తారు. శివుడే కూడా సిద్ధిదాత్రిని ఆరాధించి తన శక్తులను పొందాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ రూపాన్ని ఆరాధించే వారు జ్ఞానం, ఆధ్యాత్మిక అభివృద్ధి, కోరికల నెరవేర్పు వంటి అనుగ్రహాలను పొందుతారని విశ్వాసం.


