Saturday, November 23, 2024
HomeదైవంNellore: శేషతల్పశయన … తల్పగిరి రంగనాథ

Nellore: శేషతల్పశయన … తల్పగిరి రంగనాథ

మహావిష్ణువు ఆలయాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగినవి రంగనాథ స్వామి ఆలయాలు. వైష్ణవులు తమ జీవితంలో ఒక్కసారైనా.. శ్రీరంగంలోని శ్రీరంగనాథుడి ఆలయాన్ని దర్శించాలని అనుకుంటారు. అలాంటి విశిష్ట ఆలయం నెల్లూరులో కూడా ఉంది. దక్షిణ శ్రీరంగంగా భాసిల్లుతున్న ఈ ఆలయం తల్పగిరి రంగనాథ స్వామివారి సన్నిధానం. స్కాంద పురాణంలో తల్పగిరి రంగనాథ స్వామి ఆలయ ప్రస్తావన ఉంది. ఆదిశేషువు కొండగా ఏర్పడి, ఆ కొండపై శ్రీమన్నారాయణుడు వెలసిన క్షేత్రమే తల్పగిరి అంటారు. దేవతల విన్నపంతో తల్పగిరిని భూమట్టానికి సరిచేసి శ్రీరంగనాథుడిగా మహావిష్ణువు ఇక్కడ వెలిసిన పుణ్యక్షేత్రం. 7వ శతాబ్దంలో పల్లవరాజులు నిర్మించిన ఈ దేవాలయానికి పన్నెండో శతాబ్దంలో రాజా మహేంద్రవర్మ మెరుగులద్దారు. శేషతల్పంపై పయనించిన శ్రీరంగనాథుడిని తల్పగిరి రంగనాథుడుగా భక్తులు కొలుస్తున్నారు. నెల్లూరు పట్టణం లో ఉన్న పురాతన దేవాలయాలలో శ్రీ రంగనాథ స్వామి ఆలయం ఒకటి. పల్లవ రాజుల కాలంలో అంటే 7-8 శతాబ్దాల కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. కానీ 12 వ శతాబ్దంలో, రాజా మహేంద్ర వర్మ ఆధ్వర్యంలో పూర్తి ఆలయ నిర్మాణం జరిగినట్లు ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తున్నది. స్కాంద పురాణం వైష్ణవ సంహితలో కూడా ఈ ఆలయ ప్రస్తావన ఉంది. దానిని బట్టి ఈ ఆలయం ఎంత పురాతనమైనదో చెప్పవచ్చు. ఇక్కడి రంగనాథుడు శేషతల్పము మీద పవళించి ఉన్నందున ఈ ఆలయం శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంగా ప్రాచుర్యం పొందింది. ఈ ఆలయానికి ప్రధాన ఆకర్షణ ఆలయం తూరపు దిశలో ఉన్న 70 అడుగుల ఎత్తుతో నిర్మించిన రాజగోపురం.ఏడు అంతస్ధులు ఉన్న ఈ రాజగోపురం పైన దాదాపు పది అడుగుల ఎత్తువున్న కలశాలను ప్రతిష్టించారు. అయితే ప్రధానాలయం మాత్రం పశ్చిమాభి ముఖంగా ఉంటుంది. ఆలయం పశ్చిమ వైపున పెన్నానది ప్రవహిస్తూ అత్యంత సుందరమైన వాతావరణంతో నిండి ఉంటుంది. భక్తులను ప్రధాన ఆలయంలోనికి దక్షిణ ద్వారం ద్వారా మాత్రమే అనుమతిస్తారు. అయితే ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా వెళ్లి స్వామి వారిని దర్శించుకోవచ్చు. ప్రతి సంవత్సరం మార్చి, ఏప్రిల్ నెలల్లో ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. బ్రహ్మాండ, స్కాంద పురాణాలలో మహత్తర క్షేత్రంగా కీర్తించబడిన నెల్లూరు సీమలోని రాయి రప్పలకు సైతం రసజ్ఞత ఉందనడం అతిశయోక్తి కాదు. ‘కవిబ్రహ్మ’ తిక్కన సోమయాజి, ‘ప్రబంధ పరమేశ్వరుడు’ చదలవాడ ఎర్రాప్రెగడ వంటి మహాకవులు జన్మించిన పవిత్రసీమ నెల్లూరు సీమ

- Advertisement -

పూర్వం ఈ ప్రాంతమంతా దట్టమైన అరణ్యంలా ఉండేది. ఇక్కడ సింహాలు ఎక్కువగా ఉండేవని, ఈ ప్రాంతంలో ఏనుగులు సింహాల కారణంగా మరణిస్తుండేవని కథనాలున్నాయి. తమిళులు ఉసరిక చెట్టును నెల్లీ’ అని అంటారు. కనుకనే ఈ ఊరు నెల్లూరుగా తమిళ రాజులు పిలిచారని ఓ కథనం కూడ ప్రచారంలో ఉంది. పెన్నా నదీ నీటితో సారవంతమైన ఈ ప్రదేశంలో ‘నడ్లు విరివిగా పండుతాయి కనుక, కొంతకాలం ఈ ప్రాంతాన్ని పరిపాలించిన చోళ, పాండ్య రాజులు నెల్లూరు’గా పిలుచుకున్నారని మరో కథనం. తల్పగిరి రంగనాథుడు పూర్వాభిముఖుడై కాకుండా, పశ్చిమాభి ముఖుడై ఉండటం ఈ ఆలయ విశేషం. దీని వెనుక ఓ ఆసక్తికరమైన పురాణ విశేషం ఉందని అంటారు.
పురాణ కథనం
వైకుంఠవాసియైన శ్రీమన్నారాయణుడు ఓసారి రమా దేవితో భూలోకంలో విహరించి భక్తులను అలరించాలనుకున్నాడు. వెంటనే ఆదిశేషుని పిలిచి భూలోకంలో తూర్పు సముద్రానికి ఆమడదూరంలో క్రీడాశైలం కావలసిందిగా ఆజ్ఞాపించాడు. తదనంతరం కొండ రూపం ధరించిన ఆదిశేషుడు సత్యలోకం వరకు పెరిగిపోయాడు. ఫలితంగా భూలోకవాసులు యజ్ఞయాగాద్యనుష్ఠానం లేకుండానే స్వర్గలోకానికి వెళ్ళసాగారు. భూలోకంలో యజ్ఞయాగా దులు ఎవరూ చేయకపోవడం వల్ల, తమకు హవిర్భాగాలు ముట్టడం లేదని దేవతలు బ్రహ్మతో మొరపెట్టుకున్నారు. బ్రహ్మ, నారాయణుని ప్రార్థించగా, గరుడ వాహనం పై తరలివచ్చిన నారాయణుడు ఆ కొండను తన పాదంతో స్పృశించినంత మాత్రానికే ఆ కొండ అణగిపోయింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆదిశేషునితో, ఫణిరాజా! ఈ కొండ నీ పేరుతో సమస్త, పద్మనాభం, తల్పగిరి అనే పేర్లతో పిలుస్తారు. పక్కనున్న పెన్నాతీరాన కాశ్యపముని తపస్సు చేస్తాడు. తదాదిగా కల్పాంతం వరకు నేనిక్కడే ఉంటానని పలికాడు. కొంతకాలం తర్వాత నారదుని ఉపదేశానుసారం కాశ్యపముని ఇక్కడకు వచ్చి, ద్వాదశాక్షర మంత్రాన్ని జపిస్తూ పౌండరీకమనే యాగం చేసాడు. ఏకాదశ క్రతువు పూర్తయిన తర్వాత నారాయణుని ప్రార్థించి, “స్వామీ! ఈ తల్పగిరి యందే శేషశాయివై భక్తులను అనుగ్రహించమని వేడుకున్నారు. దీంతో , స్మామి పశ్చిమాభిముఖుడై, ఆదిశేషుని పై పవళించి తల్పగిరి శ్రీ రంగనాథస్వామిగా భక్తుల పాలిట కల్పతరువై భాసిస్తున్నారని పురాణ కథనం ప్రచారంలో ఉంది.
చోళుల కాలంలో నెల్లూరు, వారికి ఉత్తర సరిహద్దుగా ఉండేది. చోళరాజ్యం ఉత్తరాన నెల్లూరు నుంచి తిరుచినాపల్లి వరకు, పడమట కూర్గు వరకు, దక్షిణాన కావేరీ నదీ తీరం లోని శ్రీరంగనాథుని దివ్యక్షేత్రం వరకు వ్యాపించి ఉండేది. ఈ విధంగా చోళ రాజ్యానికి దక్షిణాన శ్రీరంగనాథుని దివ్యక్షేత్రం , ఉత్తరాన శ్రీ తల్పగిరి రంగనాథ క్షేత్రం ఉండటం విశేషం. ఆ కాలం నుంచే ముక్కోటికి శ్రీరంగం దర్శించుకునే భక్తులు ముందుగా తల్పగిరి రంగనాథస్వామి ద్వారసందర్శనం చేసుకుని వెళ్ళడం పరిపాటైంది. 7వ శతాబ్దంలో ఉగ్రసేనుడనే పల్లవరాజు ఈ క్షేత్రాభివృద్ధికి కృషి చేసినట్లు తెలుస్తోంది. ఆలయంలోని శాసనాలను బట్టి మూడవ కుళోత్తుంగ చోళుని కాలంలో (క్రీ.శ. 1109 ప్రాంతం) ఈ ఆలయానికి విరివిగా దానధర్మాలు చేసినట్లు తెలుస్తోంది. తిమ్మసిద్ధిరాజు ‘తామరమడుగు’ అనే గ్రామాన్ని స్వామి ఆలయానికి ఇచ్చినట్లు, ఈయనే విరకాడు (ఇప్పటి తిరుకానిపల్లె) అనే గ్రామాన్ని స్వామివారికి సమర్పించుకున్నట్లు వేరొక శాసనం ద్వారా తెలుస్తోంది. చోళరాజ్యాన్ని కూల్చి పాండ్యరాజ్యం స్థాపించిన సుందర పాండ్యన్, స్వామివారి ఉత్సవ కైంకర్యాల నిమిత్తం కొన్నిగ్రామాలను దానమిచ్చి, ఈ దేవాలయంలో వీరాభిషేకం – చేసుకొన్నట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. అలాగే మూడవమనుమసిద్ధి (క్రీ.శ. 1291 – 1316) కూడ ఈ దేవాలయాభివృద్ధికి ఇతోథిక సేవ చేసాడు. 15వ శతాబ్దంలో రెండవ హరిహరరాయలు స్వామికి మంటపం కట్టించగా, అనంతరం రెడ్డిరాజులు కూడా అనేక దానాలు చేసారు. అనంతర కాలంలో మహమ్మదీయ దండయాత్రల సమయంలో స్వామి విగ్రహాలు అపహరించబడగా, కంటె కుటుంబం లోని సర్దారులు ప్రాణాలకు తెగించి ఉదయగిరి నవాబుల వద్ద ఉన్న విగ్రహాలను తెచ్చి ప్రతిష్ఠించారని చెప్పబడుతోంది. ఇంకా కాకతీయ సామ్రాజ్య సామంతులు, కేరళ యాదవ చక్ర నారాయణులు, రవివర్మ కూడ స్వామిని సేవించుకున్న వారే! తరువాత క్రీ.శ. 1770లో వెంకాజీ పంతులు అనే భక్తుడు పురజనుల సహాయ సహకారాలతో ఆలయ జీర్ణోద్ధరణ కావించారు. ఇంకా ఈ ఆలయాభివృద్ధికి కృషిచేసినవారిలో అల్లూరు వేంకటరమణదాసు, యరగుడిపాటి వెంకటాచలం పంతులు ముఖ్యులు.
విచిత్ర సంఘటన
పంతులుగారి కాలంలో ఓ విచిత్ర సంఘటన జరిగింది. 1845లో తెన్గలై వైష్ణవ గురు పీఠాధిపతి శ్రీ వానమామలై నెల్లూరుకు వచ్చి చిత్రకూటంలో బస చేశారు. శ్రీ రంగనాథాలయం తిరుపతి దివ్యదేశాలైన 108లోను ఒకటి కాదనే కారణంతో ఆయన స్వామిని కొన్ని రోజులవరకుదర్శించుకోలేదు. ఒకనాటి వేకువజామున స్వామి, జియ్యర్ కలలో బ్రాహ్మణరూపంలో కనిపించి, “నేను పనికిరాలేదే, నీకు నా ఇల్లుఎలా పనికి వచ్చింది?” అంటూ బెత్తంతోనాలుగు వడ్డించేసరికి, ఆయన వెంటనే పినాకినీ నదికి పరుగెత్తి స్నానం చేసి శ్రీరంగనాథుని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆనాటి నుంచి తెన్గలై వైష్ణవ పీఠానికి ఈ క్షేత్రం 109వ తిరుపతి దివ్యదేశంగా పేరొందింది.
ఆలయ విశేషాలు
చతురస్రాకార ఆలయ ప్రాంగణంలో మధ్యభాగాన శ్రీస్వామివారి ఆలయం పశ్చిమాభిముఖంగా ఉంది. గాలి గోపురం తూర్పు ముఖమై పట్టణాన్ని చూస్తున్నట్లుగా, స్వామి పశ్చిమాభిముఖుడై పెన్నానదిని చూస్తున్నట్లుంటారు. స్వామి ఆదిశేషుని పై పవళించి శ్రీ ,భూదేవిల సపర్యలందుకొంటూ ఒక చేతిని తలకింద పెట్టుకుని ఉన్నట్లు కన్పిస్తాడు. రంగనాథుని ఆలయానికి నైరుతి భాగంలో శ్రీరంగనాయకి తాయారు సన్నిధి ఉంది. ఆలయానికి వాయువ్య దిక్కున ఉన్న గోదాదేవి సన్నిధి ప్రాజ్ముఖంగా ఉంది. ఈ సన్నిధిలో నూరుకాళ్ళ మంటపం,దానికి తూర్పున వాహనశాఖ, ఆళ్వార్ సన్నిధి, తాయార్ల సన్నిధి, ఆప్రక్కనే అలంకార మంటపం, అద్దాల మంటపం ఉన్నాయి. శ్రీరంగనాథస్వామికి, తాయార్లకు, ఆండాళ్ కు, ఆళ్వా రులకు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాస ,సంవత్సరోత్సవాలు, బ్రహ్మోత్సవం అతివైభవంగా జరుగుతాయి. ఏడాదిలో స్వామికి 250 ఉత్సవాల జరుగుతాయట! ఇవికాక, మాస తిరు నక్షత్రంలో ప్రత్యేక తిరుమంజనాలు, ఆరగింపులు, ఉత్సవాలు జరుగుతాయి. రంగనాథస్వామికి పంచపర్వాలు, శ్రీతాయార్లకు శుక్రవారం గజోత్సవాలు జరుపుతారు. పగల , ముక్కోటి, బ్రహ్మోత్సవం, ఉడైవార్ల ఉత్సవం, మనవాళ మహాముని ఉత్సవం వీటిలో ముఖ్యమైనవి. ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుక్ల దశమి నుంచి బహుళ పంచమి వరకు స్వామికి పద కొండు రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అలాగే స్వామివారికి పాంచరత్రాగమానుగుణ్యంగా నిత్య కైంకర్యార్చ నాదులు జరుగుతున్నాయి. ఈ క్షేత్రం చెన్నై – కోల్ కత్తా గ్రాండ్ ట్రంక్ రోడ్డులో, రైలు మార్గంలో ఉంది. యుగాంతం
12వ శతాబ్దానికి చెందిన ఈ దేవాలయం మొదట శ్రీ వైకుంఠంగా ప్రాచుర్యంలో ఉండేది. 17 శతాబ్దం తర్వాత శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయానికి సంబంధించిన గాలి గోపురం 7 అంతస్తులుగా ఉంటుంది. దీని ఎత్తు 95 అడుగులు ఉంటుంది. గాలిగోపురం ప్రత్యేకత గురించి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ప్రస్తావన ఉంది అంటారు. రంగనాథుడి ఆలయం గాలిగోపురంపై కాకి వాలి.. పెన్నా నది నీటిని తాగితే.. కలియుగాంతం జరుగుతుందని అంటారు. అంటే అంత ఎత్తుకి పెన్నా నది నీరు వస్తే అప్పుడు జల ప్రళయం తప్పదని సంకేతం. అయితే దీని గురించి చారిత్రక ఆధారాలు లేవు కానీ.. గతంలో వరదల సమయంలో శయన స్థితిలో ఉన్న రంగనాథుడి ఆలయం గొంతు వరకు నీరు వచ్చినట్టు ఆధారాలున్నాయి. ఆ తర్వాత ఇటీవల కాలంలో కూడా రంగనాథుడి ఆలయ ప్రాంగణంలోకి పెన్నమ్మ నీరు వచ్చి చేరింది. కానీ ధూప దీప నైవేద్యాలకు ఎప్పుడూ ఆటంకం లేదని అంటారు.
12వ శతాబ్దంలో రాజరాజ నరేంద్రుడు, కుళోత్తుంగ చోళుడు ఆలయాన్ని అభివృద్ధి చేశారని చారిత్రక ఆధారాలున్నాయి. తిక్కన సోమయాజి ఇక్కడే మహాభారతాన్ని ఆంధ్రీకరించారని చెబుతారు. పెన్నా నది తీరంలో ఆయన ఈ కార్యాన్ని పూర్తి చేశారని చెబుతారు.
అద్దాల మండపం
ఈ దేవాలయంలో చెప్పుకోదగ్గ మరో విశేషం అద్దాల మండపం. అద్దాల మండపంలో పలు చిత్రాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. మండపం మధ్యలో ఉన్న శ్రీకృష్ణుడి చిత్రపటం మనం ఎటునుంచి చూసినా మనల్నే చూస్తున్నట్టు ఉంటుంది. వటపత్ర శాయి రూరంలో ఉండే చిన్ని కృష్ణయ్య చిత్రాన్ని అంత అద్భుతంగా చిత్రీకరించారు. మహ్మదీయుల పాలనలో దాడులు జరుగుతాయనే ఉద్దేశంతో మూల విరాట్‌కి సున్నపు పూత పూశారని, ఇప్పటికీ దాన్ని మనం చూడొచ్చని అంటారు పూజారులు. రంగనాథుడి శయన రూప దర్శనంతోనే సకల పాపాలు హరించుకుపోతాయని చెబుతారు. రంగనాథుడి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. నెల్లూరు వచ్చే పర్యాటకులు చేసుకునే తొలి దర్శనం రంగనాథుడిదే కావడం విశేషం. దక్షిణాదిన రంగనాథ స్వామి ఆలయాలు అరుదు. అందులోనూ ఇలా చారిత్రక విశేషాలున్న తల్పగిరి రంగనాథుడి సన్నిధానం దక్షిణ శ్రీరంగంగా ప్రసిద్ధికెక్కింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News