నేల ఈనిందా.. ఆకాశం చిల్లులు పడిందా అన్న చందంగా తిరుచానూరు పద్మాసరోవరం భక్త జన సంద్రంగా మారింది. అమ్మవారి పుష్కరిణిలో పవిత్ర పుణ్య స్నానాలు ఆచరించిన భక్త జనం భక్తితన్మయుక్తంతో తడిసి ముద్దయ్యారు. శ్రీ పద్మావతి అమ్మవారు అవతరించిన పంచమి తిథి శుక్లపక్షం ని పురస్కరించుకుని కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శుక్రవారం పంచమీ తీర్థం(చక్రస్నానం) అశేష భక్తజనవాహిని మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 7 నుండి 8 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు పల్లకిలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. అనంతరం అమ్మవారికి ఆస్థానం నిర్వహించి ఉత్సవర్లను ఊరేగింపుగా పంచమీ తీర్థ మండపానికి వేంచేపు చేశారు.
అమ్మవారికి శ్రీవారి కానుక
శ్రీ పద్మావతి అమ్మవారి పంచమి తీర్థం సందర్బంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారు కానుకలు పంపారు. రూ.1.11 కోట్ల విలువ చేసే 3 కేజీల బరువు గల బంగారు పాండియన్ కిరీటం, డైమండ్ నక్లెస్, రెండు డైమండ్ గాజులు, డైమండ్ కమ్మల జత, బంగారు గజలక్ష్మి పథకం సారెతో పాటు తిరుపతి పురవీధులలో ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి అలంకరించారు.
శోభాయమానంగా సిరుల తల్లి స్నపనతిరుమంజనం
కంకణబట్టర్
శ్రీ శ్రీనివాసచార్యులు ఆధ్వర్యంలో పంచమి తీర్థ మండపంలో అమ్మవారికి, చక్రత్తాళ్వార్‌కు ఉదయం 10 నుండి 11.45 గంటల వరకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంలతో విశేష అభిషేకం చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి అలంకరించిన పూలమాలలు, కిరీటాలు భక్తులకు కనువిందు చేశాయి. వడ్ల గింజలు, పసుపు గడ్డలు, వట్టి వేరు, నల్ల ద్రాక్ష , రోజ్ పెడల్స్, తులసి మాలలు అలంకరించిన తీరు భక్తులను నైనానందం చేశాయి. తమిళనాడులోని తిరుపూర్‌కు చెందిన దాతలు ఈ మాలలను విరాళంగా అందించారు.
ఆకట్టుకున్న ఫలపుష్పం మండపం
పంచమి తీర్థం సందర్భంగా పంచమి మండపం వద్ద ఏర్పాటు చేసిన ఫలపుష్ప మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆస్ట్రేలియా ఆరంజ్, తామర పూలు, రోజాలు, లిల్లీలు, 25 వేల కట్ ఫ్లవర్స్, 1.5 టన్నుల సాంప్రదాయ పుష్పాలతో గార్డెన్ సిబ్బంది అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు.ఉదయం 12.15 నుండి 12.20 గంటల మధ్య పంచమి తీర్థం(చక్రస్నానం) ఘట్టం అట్టహాసంగా జరిగింది. చక్రత్తాళ్వార్‌తో పాటు పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తజనం పద్మ పుష్కరిణిలో గోవింద నామ స్మరణలు చేస్తూ పుణ్యస్నానాలు ఆచరించారు.
రాత్రి 7.30 గంటలకు బంగారు తిరుచ్చి వాహనంలో అమ్మవారి ఉత్సవర్లను ఊరేగించారు. అనంతరం రాత్రి 10 నుండి 11 గంటల వరకు అమ్మవారి బ్రహ్మోత్సవాలను శాస్త్రోక్తంగా ధ్వజావరోహణంతో విజయవంతంగా ముగించారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యర్ స్వామి, టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు, ఈవో శ్రీ జె.శ్యామలరావు దంపతులు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, చంద్రగిరి ఎంఎల్‌ఏ పులివర్తి నాని, టిటిడి పాలకమండలి సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి, శాంతా రామ్, నన్నపనేని సదాశివరావు, ఎస్. నరేష్ కుమార్, జేఈవోలు వీరబ్రహ్మం, గౌతమి, సివిఎస్‌వో శ్రీధర్, ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఏవీఎస్వో సతీష్ కుమార్, ఏఈఓ దేవరాజులు, ఆలయ అర్చకులు బాబు స్వామి, సూపరింటెండెంట్ రమేష్, శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు చలపతి, సుభాష్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
డిసెంబరు 7న పుష్పయాగం
డిసెంబరు 7వ తేదీ శనివారం సాయంత్రం 5 నుండి రాత్రి 8 గంటల వరకు ఆలయంలో పుష్పయాగం వైభవంగా జరుగనుంది.