Phalguna Masam 2026 Dates and Significance in Telugu: తెలుగు మాసాల్లో చిట్టచివరిది, ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైనది ఫాల్గుణ మాసం. ఈ ఏడాది ఈ మాసం ఫిబ్రవరి 18న (బుధవారం) ప్రారంభమై.. మార్చి 19న (గురువారం) ముగుస్తుంది. ఈ మాసానికి ఉన్న విశిష్టత, ఈ కాలంలో వచ్చే పండుగలపై ప్రత్యేక కథనం.
అన్ని వ్రతాల పుణ్యం ఈ ఒక్క నెలలోనే..
చైత్రంతో మొదలయ్యే తెలుగు సంవత్సరం ఫాల్గుణంతో ముగుస్తుంది. ఈ మాసాన్ని “సర్వవృత్త సింహావలోకనం” అని కూడా పిలుస్తారు. అంటే ఏడాది పొడవునా చేసే దైవ కార్యాల ఫలితాన్ని ఈ ఒక్క నెలలో భక్తితో సాధించవచ్చునని పండితులు చెబుతుంటారు. ఈ మాసం శివకేశవులు ఇద్దరికీ ఎంతో ప్రీతికరమైనది. ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏంటో తెలుసుకుందాం.
ముఖ్యమైన పండుగలు:
ఫిబ్రవరి 18: ఫాల్గుణ మాసం ప్రారంభం.
ఫిబ్రవరి 27 (శుక్రవారం): ఆమలకీ ఏకాదశి (ఉసిరి చెట్టును పూజించే పవిత్రమైన రోజు).
మార్చి 3 (మంగళవారం): హోలికా దహనం / కామ దహనం.
మార్చి 4 (బుధవారం): హోలీ (రంగుల పండుగ / ఫాల్గుణ పూర్ణిమ).
మార్చి 15 (ఆదివారం): పాపవిమోచనీ ఏకాదశి.
మార్చి 19 (గురువారం): ఫాల్గుణ అమావాస్యతో మాసం ముగింపు (దీని తర్వాత రోజే ఉగాది – కొత్త సంవత్సరం ప్రారంభం).
ఈ మాసం విశిష్టతలు:
పయోవ్రతం: భాగవత పురాణం ప్రకారం, ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుండి ద్వాదశి వరకు 12 రోజుల పాటు ‘పయోవ్రతాన్ని’ ఆచరిస్తే సంతానప్రాప్తి కలుగుతుంది. ఈ వ్రతాన్ని ఆచరించే వారు కేవలం పాలు మాత్రమే ఆహారంగా తీసుకుని విష్ణుమూర్తిని ఆరాధిస్తారు. కశ్యప ప్రజాపతి సూచనతో అదితి ఈ వ్రతాన్ని ఆచరించి, సాక్షాత్తు శ్రీహరిని వామనుడిలా పుత్రుడిగా పొందిందని పురాణ గాథ.
Also Read: Magh Purnima -మాఘ పూర్ణిమ నాడు పూజకు కావాల్సిన సామాగ్రి లిస్ట్ ఇదే!
శివ కేశవుల ఆరాధన: ఉత్తర భారత క్యాలెండర్ ప్రకారం మహాశివరాత్రి ఫాల్గుణంలో వస్తుంది (తెలుగు రాష్ట్రాల్లో మాఘ బహుళ చతుర్దశి). అయితే ఫాల్గుణంలో వచ్చే ఏకాదశులు (విజయ, ఆమలకీ) విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనవి. ఈ నెలలో శివుడిని, విష్ణువును భక్తితో కొలిస్తే గత 11 నెలల దోషాలు తొలగిపోతాయని నమ్మకం.
వసంతోత్సవం: శిశిర రుతువు ముగిసి, వసంత రుతువుకు అడుగులు పడే సంధి కాలమిది. చెట్లు చిగుర్చి, పూలు పూసే ఈ కాలంలోనే హోలీ పండుగ వస్తుంది. రంగులు చల్లుకోవడం అనేది కేవలం వేడుక మాత్రమే కాదు, వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా శరీరాన్ని సిద్ధం చేసే ప్రక్రియ కూడా.
లక్ష్మీ దేవి ఆవిర్భావం: పురాణాల ప్రకారం క్షీర సాగర మథనం జరిగినప్పుడు లక్ష్మీదేవి ఫాల్గుణ పౌర్ణమి నాడే ఆవిర్భవించిందని చెబుతారు. అందుకే ఈ రోజున మహాలక్ష్మిని పూజించడం వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుంది.
ఏం చేయాలి?
ఈ పవిత్రమైన మాసంలో గోదానం, వస్త్రదానం మరియు అన్నదానానికి విశేష ఫలితం ఉంటుంది. ఆమలకీ ఏకాదశి నాడు ఉసిరి చెట్టు కింద విష్ణువును పూజించడం వల్ల వెయ్యి గోదానాలు చేసిన పుణ్యం లభిస్తుంది. “ఓం నమో నారాయణాయ” లేదా “ఓం నమః శివాయ” అనే మంత్రాలను జపించడం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది.

