Sunday, July 7, 2024
HomeదైవంPitru Paksha: పితృ పక్షాల్లో పిండ ప్రదానం చేయాలి

Pitru Paksha: పితృ పక్షాల్లో పిండ ప్రదానం చేయాలి

పితృయజ్ఞం చేసిన వారసునికి నిండు మనసుతో పితృదేవతలు ఆశీర్వదిస్తారు

మహాభారతంలో కర్ణుడు గురించి అందరికీ తెలుసు. దాన కర్ణుడు అడిగిన వారికి లేదనుకుండా దాన ధర్మాలు చేశాడని. అందుకే దాన కర్ణుడు అని పేరు వచ్చిందని తెలుసు. మహాభారతంలో కర్ణుడు తనువును చాలించిన తరువాత తిరిగి భూలోకానికి వచ్చి, ఇక్కడ అన్నదానం చేసి గడిపి మళ్ళా స్వర్గానికి వెళ్ళాడు. ఈ పదిహేను రోజులకే ‘మహాలయ పక్షం’ అని పేరు. ప్రతీ సంవత్సరం భాద్రపద మాసంలోని, శుక్లపక్షంలో పదిహేను రోజులు దేవ పదము. కృష్ణ పక్షంలోని పదిహేను రోజులు పితృ పదము. ఇదే మహాలయ పక్షము. మహాలయం అంటే..మహాన్‌ అలయః, మహాన్‌ లయః..మహల్‌ అలం యాతీతివా అంటే పితృదేవతలకు గొప్ప ఆలయము. పితృదేవతల యందు మనస్సు లీనమగుట. పుత్రులిచ్చి తర్పణాదులకు పితృదేవతలు సంతృప్తిని పొందుట అని అర్ధాలు వస్తాయి. ఇక అమావాస్య అంటే..అమా ‘దానితోపాటు’, వాస్య అంటే ‘వహించటం’. దీనర్థం ఏమిటంటే..చంద్రుడు సూర్యుడిలో చేరి సూర్యుడితో పాటు కలిసి ఉండే రోజు..అందుకే ‘అమావాస్య’ అన్నారు.. పితృదేవతలు దేహధారణ చేసి ఈ లోకంలోకి రావాలి. అలా రావాలంటే వారికి అన్నాన్ని అందించాలి. అది రక్తం పంచుకుపుట్టిన కొడుకులే అందించాలి. అప్పుడే వారికి పితృరుణం తీరుతుంది. అలా రుణం తీరడాన్నే మోక్షం అంటారు. ఏ కారణం చేతనైనా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి పెట్టకపోతే.. ఆ తద్దినం పెట్టని దోషం ‘మహాలయం’ నిర్వహించడం వల్ల పోతుంది. మహాలయ పక్షాలు పదిహేను రోజులూ పితృదేవతలు ‘మా వారసుడు పితృయజ్ఞం చేయకపోతాడా? మా ఆకలి తీర్చకపోతాడా? అనే ఆశతో వారి సంతానం ముఖ్యంగా కుమారుల ఇంటిని ఆవహించి ఉంటారు. పితృయజ్ఞం చేసిన వారసునికి నిండు మనసుతో పితృదేవతలు ఆశీర్వదిస్తారు. సకల ఐశ్వర్యాలతో, పిల్లాపాపలతో కలకాలం సంతోషంగా ఉండాలని దీవిస్తారు. అలాగే పితృయజ్ఞం చేయని వారసుని వంశం..నిర్వంశం కావాలని శపించి కోపంగా వెళ్ళిపోతారు. సంతానం కలగకపోవడమే నిర్వంశం కావడం అంటే. అందుకే తప్పకుండా మహాలయ పక్షాలు పెట్టి తీరాలని పండితులు చెబుతారు.
దాన కర్ణుడు మరణానంతరం స్వర్గం ప్రాప్తించింది. ఆయన స్వర్గ లోకానికి పయనమవుతుండగా మార్గ మధ్యలో ఆకలి, దాహం వేశాయి. ఈ సమయంలో ఒక పండ్ల వృక్షం కనిపించింది. పండు కోసుకుని తిందామని నోటి దగ్గర పెట్టుకోగా అది కాస్తా బంగారు ముద్దగా మారింది. ఏ చెట్టు పండు తిందామన్నా ఇదే అనుభవం. ఇక లాభం లేదు..కనీసం దప్పిక తీర్చుకోవాలని సెలయేటి వద్దకు వెళ్ళి దోసిళ్ళతో నీటిని తీసుకుని నోటి వద్ద పెట్టుకునే సరికి.. బంగారపు నీరుగా మారిపోయింది. స్వర్గ లోకానికి వెళ్ళినా అదే పరిస్థితి. తనకెందుకు ఇలా జరుగుతోంది. చేసిన తప్పేమిటని కర్ణుడు పరిపరి విధాల మదనపడ్డాడు. అప్పుడు అశరీరవాణి కర్ణుడితో ఇలా చెప్పింది.. ’కర్ణా..నీవు దానశీలివే. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే ఆ దానాలన్నీ స్వర్ణం, రజితం, నగదు రూపేణా చేశావు. కానీ ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. ఫలితంగానే నీకీ దుస్థితి’..పరిస్థితి అర్ధం చేసుకున్న కర్ణుడు తన తండ్రి సూర్య భగవానుని వద్దకు వెళ్ళి ప్రాధేయపడగా..ఆయన కోరిక మేరకు ఇంద్రుడు కర్ణునికి చక్కని అవకాశమిచ్చాడు. తక్షణమే భూలోకానికి వెళ్ళి మాతా పితరులకు తర్పణాలు వదిలి, అన్నదానం చేసి రమ్మన్నాడు. అదిగో ఆ విధంగా కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమి రోజున భూ లోకానికి వచ్చాడు. అక్కడ పేదలు, బంధుమిత్రులు అందరికీ అన్న సంతర్పణ చేశాడు. తిరిగి అమావాస్య రోజున స్వర్గానికి వెళ్ళాడు. పితృతర్పణలు, అన్న సంతర్పణలు చేయగానే కర్ణుడి కడుపు నిండిపోయింది. కర్ణుడు మరణించిన తరువాత తిరిగి భూ లోకానికి వచ్చి..భూ లోకంలో అన్నదానం చేసి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షం రోజులకే మహాలయ పక్షమని పేరు. ఈ పక్షం రోజులలో ఆఖరి రోజునే మహాలయ అమావాస్యగా పిలుస్తారు.

  • ఆళవందార్‌ వేణు మాధవ్‌
    8686051752
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News