Sunday, October 6, 2024
HomeదైవంRaksha Bandham: సనాతన ధర్మం, ఇతిహాసాల్లో రక్షా బంధనం

Raksha Bandham: సనాతన ధర్మం, ఇతిహాసాల్లో రక్షా బంధనం

రావణుడు, కృష్ణుడు, అలెగ్జాండర్.. వీరందరికీ రాఖీ పండుగతో అనుబంధం

సోదర సోదరీమణుల బంధానికి ప్రతీక రక్షాబంధన్. రాఖీ పౌర్ణమి రోజున సోదరి కట్టే రక్షలో అసాధారణ శక్తి ఉందని ప్రజల ప్రగాఢ విశ్వాసం. రక్తసంబంధీకులే కాకుండా ఆత్మీయుల అనుబంధానికి పరస్పర సహకారానికి చిహ్నంగా కూడా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు.
అక్కాచెల్లెళ్లు తమ అన్నా తమ్ముళ్లు మహోన్నత శిఖరాలకు ఎదగాలని సుఖసంతోషాలతో ఉండాలని దీవిస్తూ కట్టేది రాఖి. సాంప్రదాయం ప్రకారం ఆడపడుచులు ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రపరచుకొని కొత్త బట్టలు కట్టుకొని రాఖీలను పూజించి పుట్టింటికి వెళ్లి అపరాన్న సమయంలో అంటే మధ్యాహ్నం సమయంలోనే రాఖీలు కట్టాలని గర్గుడు అనే మహర్షి ఉద్బోధించారు. మనం చేసే ప్రతి పనికి కర్మసాక్షి సూర్యనారాయణుడు. మధ్యాహ్నవేళ సూర్యుని కిరణాల తేజస్సు రాఖీ లో ఇమిడి ఉండాలని సోదరుల నుదుటన తిలకం దిద్ది రక్ష కట్టి తీపి పదార్థాలను తినిపిస్తారు. నువ్వు నాకు రక్ష నేను నీకు రక్ష అంటూ ఎల్లలు ఎరగని ఉత్సాహంతో ఆప్యాయతలతో మీరు కలకాలం చల్లగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రతి సోదరి తన సోదరులకు రక్త సంబంధాన్ని రక్షాబంధన్ గా గుర్తుచేస్తుంది రాఖీ. తమ సోదరులు ఇచ్చే చీరలు, బహుమతులు స్వీకరిస్తుంది. మహిళలే రాఖీ కట్టడంలో ఆంతర్యం దాగి ఉంది.యుద్ధాల సమయంలో ఆ రక్ష నే పురుషుల ప్రాణాలను కాపాడుతుంది.స్తీలను మాత్రమే శక్తి స్వరూపిణిగా చూస్తుంది మన సాంప్రదాయం. ఆ శక్తి స్త్రీనే.
ఇరు వర్గాల మధ్య, జాతుల మధ్య,దేశాల మధ్య,ప్రాంతాల మధ్య ఐక్యత ను కుదుర్చడానికి మంచి వారది రక్షా బంధన్. దీన్నే జంద్యాల పౌర్ణమి అంటారు. విద్యార్థులకు వేద పాఠశాలలో చేర్పించి కొత్తగా జంధ్యాలు వేయించడం, పాత జంధ్యాలు మార్చడం ఈ పౌర్ణమినాడే చేస్తారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో రాధా కృష్ణుల విగ్రహాలను వూయలలో వేసి ఊపుతారు. దీన్నే జలన్ వేడుక అంటారు. మహారాష్ట్ర కేరళ లో సముద్రానికి పూజలు చేసే ఉత్సవం దీన్నే నరాలి పౌర్ణమి అంటారు. ఉత్తర భారత దేశంలో గోధుమ నారు వేసి గజరి వేడుక జరుపుకుంటారు. కర్ణాటక, మహారాష్ట్రలో నారికేళ పౌర్ణమి జరుపుకుంటారు. సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు వేరైనా దేశమంతా జరుపుకునేది రక్షాబంధనం.
దీనికి మూలం భారతంలోనే ఉంది.

- Advertisement -

శ్రీకృష్ణుని మేనత్త కొడుకు శిశుపాలుడు వంద తప్పులు చేసిన తర్వాత శ్రీకృష్ణుడు పట్టరాని కోపంతో తన విష్ణు చక్రాన్ని శిశుపాలుని పై ప్రయోగించి తలను నరికి వేస్తాడు ఆ సమయంలో శ్రీకృష్ణుని వేలికి గాయమవుతుంది. పరివారమంతా అటు ఇటు వెతుకుతుండగా అప్పుడు ద్రౌపతి తన పట్టుచీరను చింపి శ్రీకృష్ణుని వేలికి రక్ష కడుతుంది. నాకు రక్ష కట్టావు కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీకు కష్టం వస్తే ఎల్లవేళలా నిన్ను నేను కాపాడుతానని మాట ఇచ్చాడు శ్రీకృష్ణుడు. దుర్యోధనుని దుష్కృత్యాలకు అడ్డుకట్ట వేసి ద్రౌపతి వస్త్రాపహరణ సమయంలో అంతులేని వస్త్రాలను ప్రసాదించి తన దైవికమైన చెల్లెలు ద్రౌపతికి రక్షణగా నిలిచాడు శ్రీకృష్ణుడు.

అలెగ్జాండర్-రాఖీ పండుగ
ఈ సంఘటనే రక్షాబంధన్ పండుగకు ఆధారమైంది. ఇదేకాక దేవదానవ యుధ్ధంలో భయపడి అమరావతిలో తలదాచుకున్నాడు ఇంద్రుడు‌. ఇంద్రుని భార్య శచీదేవి శివపార్వతులను లక్ష్మీనారాయణు లను పూజించి ఆ రక్ష తెచ్చి ఇంద్రుని చేతికి కట్టింది. ఇంద్రుడు యుద్ధంలో గెలిచి త్రిలోకాధిపత్యాన్ని పొందాడు. అప్పటినుండి అందరికీ రక్ష పైన ఇంకా ఎక్కువగా నమ్మకం ఏర్పడింది. గ్రీకు రాజు అలెగ్జాండర్ పురుషోత్తముని పై దండెత్తగా తన ధైర్య సాహసాలను గుర్తించిన అలగ్జాండర్ భార్య రుక్సానా తన భర్త క్షేమం కోరి పురుషోత్తముని శరణు వేడి రాఖీ కడుతుంది. రుక్సానాను సోదరీగా భావించిన పురుషోత్తముడు అలెగ్జాండర్ ఓడిపోయిన అతన్ని చంపకుండా వదిలేశాడు.
పూర్వకాలంలో వివిధ రకాలైన యుద్ధాలు ఎక్కువగా జరుగుతుండేవి. అందుకే స్త్రీ లు వీరులైన యోధులను గుర్తించి వారికి రక్ష కట్టి వారు చూపే సోదర భావంతో రక్షణ పొందేవారు. శ్రీరామునికి శాంత శ్రీకృష్ణునికి సుభద్ర దైవిక చెల్లెలు ద్రౌపతి ఇలా పురాణాల్లో మనకు కనిపిస్తారు. శివపార్వతులు రాధాకృష్ణులు లక్ష్మీనారాయణలు భార్యాభర్తల ప్రేమకు, ప్రేయసి ప్రియుల బంధానికి ఎంత విలువ ఇచ్చారో మన ఋషులు అంతే గొప్పదనాన్ని అన్నాచెల్లెల అనుబంధానికి కూడా ఆపాదించారు.అన్నా చెల్లెల అపురూప బంధానికి ప్రత్యేకంగా నిలిచిన రక్షాబంధన్ ను దేశవ్యాప్తంగా ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఏమైనా పొరపొచ్చాలు ఉన్నట్లయితే ఈ పండుగ ద్వారా అన్ని తేటతెల్లమైపోతాయి. అందరి మధ్య సఖ్యత ఏర్పడడానికి ఐక్యతకు మంచి వేడుక ఈ రక్షాబంధన్.
కొమ్మాల సంధ్య
తెలుగు ఉపన్యాసకులు
సమ్మక్క సారక్క తాడ్వాయి
ములుగు జిల్లా
9908763172

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News