Holy Mother Sri Sarada Devi: మనందరికీ ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస తెలిసే ఉంటారు. కానీ ఆయన భార్య శారదా దేవి గురించి ఎవరికీ తెలీదు. రామకృష్ణులకూ, ఆయన శిష్యులకూ సేవ చేయటంలోనే ఆమె తన జీవితమంతా గడిపారు. ప్రపంచానికి ప్రేమ సందేశాన్ని ఇచ్చిన దివ్య జనని శ్రీ శారదా మాత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నిష్కళంక శీలానికి నిదర్శనం
వంగ (పశ్చిమ బెంగాల్) రాష్ట్రంలోని బాంకురా జిల్లాలో జయరాంబాటి అనే కుగ్రామంలో 1853 డిసెంబర్ 22వ తేదీన జన్మించారు శారదమ్మ. తల్లిదండ్రులు పేద వారైనప్పటికీ భక్తినిష్టాతత్పరులు. శారదా దేవికి తన 6వ ఏటనే శ్రీరామ కృష్ణునితో పెండ్లి జరిగింది. కొన్నాళ్ల తర్వాత శారదాదేవి భర్తతో గడపడానికి దక్షిణేశ్వరానికి కొత్తగా వచ్చిన రోజున రామకృష్ణుడామెను ఇలా ప్రశ్నిస్తాడు.. “నన్ను ఈ సంసార కూపంలోకి దింపడానికి వచ్చావా?” “లేదు లేదు, మీరెన్నుకున్న పారమార్థిక మార్గంలో మీకు సహకరించడానికి వచ్చాను” అన్న ఆమె మాటలు ఒట్టి నీటి మూటలు కావు. అవి ఆమె నిష్కళంక శీలానికి నిదర్శనం.
జగన్మాతగా షోడశ పూజ
1872 జూన్ 5వ తేదీన రామకృష్ణ పరమహంస.. శారదాదేవిని జగన్మాతగా భావించి షోడశపూజ చేశారు. ఈ విధంగా సర్వజీవుల యందు ఆమెలో గల మాతృభావాన్ని జాగృతం చేశారు. శ్రీరామకృష్టుల పారమార్థిక సంపదకంతటికీ వారసురాలైనప్పటికీ శ్రీ శారదాదేవి తన జీవితంలో కఠోర సాధనలనెన్నిటినో ఆచరించింది.
మానవత్వానికి ప్రతీక
శారదా దేవిది నిరాడంబర జీవితము, నిస్వార్థ, మాతృవాత్సల్యం, కరుణ సాటి లేవిని. నిశ్శబ్ద ప్రార్థన, భక్తితత్పరతయే ఆమె జీవితం. భక్తి, కర్మ, యోగాల పరిపూర్ణ సమ్మేళనమే ఆమె జీవితము. శ్రీ శారదామాత సత్సంకల్పంతో శ్రీరామకృష్ణ మిషన్ మఠంగా ఏర్పడింది. రామకృష్ణ పరమహంస మహాసమాధి చెందిన ఆమె 34 సంవత్సరాల జీవించారు . ఆ కాలంలో ఆమె తన వద్దకు వచ్చిన అట్టడుగు వర్గాలను చేరదీసేది. తనే స్వయంగా వడ్డించి వారి విస్తర్లను తీసేవారు. మానవత్వానికి ప్రతీకగా నిలిచే శారదామాత 1920 జూలై 20న కలకత్తాలో మహా సమాధి పొందారు
శారదా మాత సందేశాలు
నాయనా, ఓరిమి వహించడం సద్గుణం. దీనికి సమానమైనది వేరేమీ లేదు. తృప్తిని మించిన సంపద లేదు. కష్టాలను సహనంతో ఎదుర్కొనడం కంటే మించిన సద్గుణము లేదు. కోరికలే వద్దని భగవంతుని ప్రార్థించాలి. ఎందుకంటే మన దుఃఖానికి కోరికలే మూల కారణము. మోక్షానికి అవరోధములు. సర్వము మనస్సుపై ఆధారపడి యున్నది. పరిశుద్ధమైన మనస్సు ఉంటే అన్నీ సాధించినట్లే.
Also Read: Sankranti 2026 -23 ఏళ్ల తర్వాత సంక్రాంతి రోజే ఏకాదశి.. పుణ్యఫలం కోసం ఏం చేయాలంటే?
సాధకునికి గురు కృప
తగిన సమయంలోనే మనస్సే నీకు గురువవుతుంది. మనశ్శాంతి కావాలంటే పరుల దోషాలు ఎంచవద్దు. దాని బదులు నీలోని దోషాలు చూసుకో! సరిచేసుకో! దుఃఖం కూడా భగవంతుని వరప్రసాదమే. ఇతరుల విషయాలలో కుతూహలం కనబరచకు. భగవంతుణ్ణి, భగవద్భక్తులను ధనికులు ధనంతో సేవించాలి. పేదలు భగవన్నామ స్మరణ రూపంలో ఆయనను అర్చించాలి. ఎంత చిన్న పనైనా గౌరవ భావంతో చేయాలి. ఎంత చిన్న వస్తువునైనా తృణీకరించే భావంతో చూడరాదు. భగవంతుడు నీ నుండి కోరేది నిజాయితీ, నమ్మకము, ప్రేమ. అంతేకానీ ముఖస్తుతి కాదు.
వివేకానంద ఏమన్నారంటే..
“తండ్రి కృపకంటే తల్లి కృప నాకు కోటి రెట్లు మాన్యమైనది. శారదామాత అనుగ్రహం, ఆశీస్సులు నాకు వరప్రసాదాలు”-స్వామి వివేకానంద
“ఆదర్శ హిందూ స్త్రీత్వాన్ని గురించిన శ్రీరామకృష్ణుని చివరి మాట శ్రీ శారదా దేవియే“- సోదరి నివేదిత

