Ramareddy Kalabhairava Temple History : చీకటి ముసిరిన వేళ… అలసిన బాటసారులు సేదతీరుతున్న నిశ్శబ్ద సమయం. అకస్మాత్తుగా పెళపెళమంటూ భారీ శబ్దం.. ఎడ్లబండి ఇరుసు విరిగి రథం నిలిచిపోయింది. చూస్తుండగానే అద్భుతం… బండిపై ఉన్న ఎనిమిదడుగుల రుద్ర విగ్రహం నేలపై స్వయంభువుగా అచలంగా నిలిచింది. ఆ విచిత్ర ఘటనే నేడు కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో వేలాది మంది భక్తులకు కొంగుబంగారంగా మారిన దివ్యధామం. ఇంతకీ కాశీ నుంచి బయలుదేరిన ఆ మహారూపం ఇక్కడే ఎందుకు ఆగిపోయింది? ఆ దిగంబర భైరవుడి ఆవిర్భావం వెనుక దాగున్న శతాబ్దాల చారిత్రక రహస్యాలేమిటి?
ఎడ్లబండి ఆగిన చోటే దివ్యమందిరం : స్థల పురాణం ప్రకారం, సుమారు 16వ శతాబ్దంలో కాశీ క్షేత్రం నుంచి భైరవ విగ్రహాన్ని తరలిస్తుండగా, రామారెడ్డి శివారుకు చేరుకోగానే రాత్రివేళ ఎడ్లబండి విరిగిపోయింది. స్వామి ఇక్కడే కొలువుదీరాలని సంకల్పించాడన్న భావనతో భక్తులు అక్కడే పూజలు ప్రారంభించారు. సుమారు ఎనిమిది అడుగుల ఎత్తు, వెనుక శునక వాహనంతో గంభీరంగా దర్శనమిచ్చే దిగంబర కాలభైరవుని మూలవిరాట్టు భక్తులకు సాక్షాత్కరిస్తుంది.
చారిత్రక నేపథ్యం – శిల్పకళా వైభవం : శాసన పరిశోధకులు, చరిత్రకారుల విశ్లేషణ ప్రకారం ఈ శిల్పం 13వ శతాబ్దపు కాకతీయుల కళారీతిని ప్రతిబింబిస్తోంది. పూర్వం అనావృష్టి ఏర్పడినప్పుడు స్వామి విగ్రహానికి ఆవుపేడ పూసేవారని, భైరవుడు వర్షం కురిపించి తనను తాను ప్రక్షాళన చేసుకుంటాడన్నది నాటి జానపద విశ్వాసం. 1974లో దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చిన ఈ ఆలయం, 2001లో భక్తుల సహకారంతో రేకుల షెడ్డు నుంచి భవ్య మందిరంగా రూపుదిద్దుకుంది. ఆలయ ప్రాంగణంలో శనీశ్వర స్వామి ఉపాలయం కూడా ఉంది.
ఉత్సవాలు – భక్తుల నమ్మకం : మార్గశిర శుద్ధ అష్టమి (కాలభైరవ జయంతి), కార్తిక మాసంలో ఇక్కడ విశేష పూజలు నిర్వహిస్తారు. కాలానికి, మృత్యువుకు అధిపతి అయిన భైరవుని దర్శిస్తే గ్రహదోషాలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు పటాపంచలవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

