Teachers Day 2025:మన సంస్కృతిలో గురువుకి ఎంతో ప్రత్యేక స్థానం ఉన్న విషయం తెలిసిందే. శిష్యులలోని అజ్ఞానాన్ని తొలగించి, వారికి జ్ఞానాన్ని అందించేవారే నిజమైన గురువులు. ఈ ఆలోచన ప్రాచీనకాలం నుంచే కొనసాగుతోంది. హిందూ పురాణాలలో అనేక మంది మహర్షులు, ఆచార్యులు తమ బోధనలతో సమాజానికి వెలుగుని అందించారు. వారి ఉపదేశాలు కేవలం వారి శిష్యులకే కాకుండా, సమస్త ప్రపంచానికి దారి చూపాయి. ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ 5న జరుపుకునే ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మన పురాణాల్లో ప్రస్తావించిన ఆది గురువులను స్మరించడం ద్వారా వారికి గౌరవం అర్పించడం ఒక ప్రత్యేకత.
ద్రోణాచార్యుడు
మొదటగా చెప్పుకోవలసిన గురువు ద్రోణాచార్యుడు. మహాభారతంలో ఆయన పాత్ర ఎంతో ముఖ్యమైనది. పాండవులు, కౌరవులు ఆయుధ విద్యలో నైపుణ్యం సంపాదించడం వెనుక కారణం ద్రోణాచార్యుడే. ఆయన శిక్షణలో అర్జునుడు అసామాన్యుడైన విలుకాడిగా ఎదిగాడు. అర్జునుడిపై ఆయనకున్న ఆప్యాయత, క్రమశిక్షణ ఇప్పటికీ ప్రస్తావిస్తారు. గురు-శిష్య బంధానికి ద్రోణాచార్యుడు ఒక ప్రధాన ఉదాహరణగా నిలిచారు.
విశ్వామిత్రుడు
రామాయణంలో విశ్వామిత్ర మహర్షి పాత్ర కూడా విశేషంగా ఉంటుంది. ఆయన మార్గదర్శకత్వంలోనే శ్రీరాముడు, లక్ష్మణుడు అస్త్రశాస్త్రాలలో నైపుణ్యం సాధించారు. తన యాగాన్ని రక్షించేందుకు వారిని అడవికి తీసుకెళ్లి తాటకి వంటి రాక్షసులను సంహరింపజేశారు. అలాగే అహల్య శాప విమోచనం కూడా విశ్వామిత్రుని సన్నిధిలోనే జరిగింది. గాయత్రీ మంత్రాన్ని అందించి విశ్వానికి ఆధ్యాత్మిక దారి చూపిన ఋషిగా విశ్వామిత్రుడు ప్రత్యేక గుర్తింపు పొందారు.
వేద వ్యాస మహర్షి
వేద వ్యాస మహర్షి పేరు ప్రస్తావన రాగానే మనకు మహాభారతం గుర్తుకు వస్తుంది. ఆయన వేదాలను విభజించి, వాటిని అందరికీ చేరువ చేసిన మహర్షి. మహాభారతం రచన ఆయనకే చెందుతుంది. పాండవులు, కౌరవులు ఇద్దరికీ తాతగా ఉన్న వేద వ్యాసుడు ఇతిహాసంలో కీలక ఘట్టాలను ముందుకు నడిపించారు. కవిగా, తత్వవేత్తగా ఆయన చేసిన కృషి అనితరసాధ్యం. ఆయన బోధనల్లో ఉన్న జ్ఞానం నేటికీ సమాజానికి మార్గదర్శకంగా ఉంది.
వశిష్ఠ మహర్షి
వశిష్ఠ మహర్షి హిందూ సంప్రదాయంలో సప్త ఋషులలో ఒకరిగా గౌరవించబడతారు. సూర్యవంశ రాజులకు కులగురువైన ఆయన దశరథ మహారాజు మరియు శ్రీరామునికి కూడా ఉపాధ్యాయుడిగా నిలిచారు. రాముడు తన జీవితంలో ధర్మం, రాజనీతి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వశిష్ఠుని వద్ద నేర్చుకున్నాడు. రాముడి వనవాస సమయంలో రాజ కుటుంబానికి మార్గనిర్దేశం చేసినవాడు వశిష్ఠుడే. ఆయన చెప్పిన బోధనలు యోగ వశిష్ఠం పేరుతో ప్రసిద్ధి చెందాయి. ఈ గ్రంథంలో మానవ జీవితానికి సంబంధించిన తత్వజ్ఞానం, మోక్ష మార్గం గురించి విపులంగా వివరించబడింది.
వాల్మీకి
వాల్మీకి మహర్షి పేరు రాగానే మనసుకు వచ్చే పదం రామాయణం. ప్రపంచానికి రాముడి గాథను పరిచయం చేసినవారు వాల్మీకి. రామాయణం కేవలం ఒక ఇతిహాసం మాత్రమే కాదు, అది ధర్మం, నీతి, మానవ విలువలపై ఒక ప్రామాణిక గ్రంథం. ఇప్పటికీ సమాజంలో రామాయణంలోని బోధనలు ప్రాసంగికంగా ఉన్నాయి. వాల్మీకి మహర్షి లవ, కుశులకు విద్యాబోధన చేసి వారిని సమర్థులుగా తీర్చిదిద్దారు. ఆయన కృషి వల్లే రామకథ తరతరాలకు అందింది.
బృహస్పతి
దేవతలకు ఆచార్యుడిగా నిలిచిన బృహస్పతి జ్ఞానానికి ప్రతీక. ఋగ్వేదంలో కూడా ఆయన ప్రస్తావన కనిపిస్తుంది. దేవతలకు సరైన మార్గనిర్దేశనం చేసి, రాక్షసులతో జరిగిన యుద్ధాల్లో వారికి విజయాన్ని సాధించిపెట్టారు. నవగ్రహాల్లో గురు గ్రహానికి అధిపతి బృహస్పతే. జ్యోతిష్యంలో ఈ గ్రహం జ్ఞానం, అదృష్టం, ఐశ్వర్యానికి సూచికగా భావించబడుతుంది. బృహస్పతి జీవితం సత్యం, ధర్మం, మార్గదర్శకతకు నిలువెత్తు నిదర్శనం.
Also Read: https://teluguprabha.net/devotional-news/rare-lunar-eclipse-on-september-7-brightest-in-decade/


