రుద్రవరం మండల పరిధిలోని నల్లవాగుపల్లె గ్రామంలో మంగళవారం పల్లకిలో కొలువుదీరిన ఉత్సవమూర్తులకు భక్తులు ఘనంగా పూజలు నిర్వహించారు. పారువేట ఉత్సవాలలో భాగంగా గ్రామానికి చేరుకున్న శ్రీ జ్వాలా నరసింహస్వామి శ్రీ ప్రహల్లాద వరద స్వామి ఉత్సవ మూర్తుల పారువేట పల్లకి గ్రామంలోని ఆయా తెలుపులపై కొలువుదీరగా తెలుపుల యజమానులు భక్తులు పూలమాలలు కొబ్బరికాయ పూజా సామాగ్రి సమర్పించుకోగా ప్రధానార్చకుడు కళ్యాణ్ స్వామి పూలమాలలతో స్వామి వారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఉత్సవ మూర్తుల పారువేట పల్లకి సందర్శన సందర్భంగా గ్రామంలో తిరుణాల వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఏఎస్ఐ బాలన్న పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. రుద్రవరం మండలంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పారువేట మహోత్సవం మంగళవారంతో మొదటి విడత ముగిసింది. మళ్లీ మండలంలో ఫిబ్రవరి 15వ తేదీ గురువారం రాత్రి మందలూరు గ్రామం నుండి రెండో విడత పారువేట మహోత్సవం ప్రారంభమవుతుంది.