Sunday, July 7, 2024
HomeదైవంSangameswara Temple in Waters: కృష్ణమ్మ వడిలోకి సంగమేశ్వరుడు

Sangameswara Temple in Waters: కృష్ణమ్మ వడిలోకి సంగమేశ్వరుడు

8 నెలల తరువాత స్వామి దర్శనం

ప్రసిద్ధ శైవక్షేత్రాల్లో ఒకటైన సంగమేశ్వర ఆలయం జలదివాసమైనది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నది నుంచి శ్రీశైలం జలాశయానికి వరద నీరు భారీగా చేరడంతో ఆదివారం ఆలయం నీట మునిగింది. కృష్ణా నదికి వరద ప్రవాహం పోటెత్తడంతో సంగమేశ్వర ఆలయ గర్భాలయంలోని వేపదారు శివలింగాన్ని కృష్ణా జలాలు తాకాయి. దీంతో ఆలయ పూజారి తెలకపల్లి రఘురామ శర్మ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. కృష్ణా నదికి చీర సారె సమర్పించి, మంగళ హారతి ఇచ్చారు. గర్భాలయంలోని వేపదారు శివలింగానికి సప్తనదీ జలాలతో వేద పండితులు తెలకపల్లి రఘరామ శర్మ ఈ సంవత్సరం చివరి పూజలు నిర్వహించారు.

- Advertisement -

ప్రవాహం ఇలాగే కొనసాగితే మరో మూడు రోజుల్లో గుడి పూర్తిగా కృష్ణమ్మ ఒడిలోకి చేరుతుందని భావిస్తున్నారు. అదే జరిగితే మళ్లీ స్వామివారి దర్శనం కోసం ఎనిమిది నెలలు ఆగాల్సిందే. కృష్ణా వరద నీటిలో మునిగిన సంగమ తీరం సంద్రాన్ని తలపిస్తోంది, సంగమేశ్వరుడు గంగమ్మ ఒడిలోకి జారుకుంటున్న అపురూప దృశ్యం కనువిందు చేస్తోంది. ప్రపంచంలో ఏడు నదులు ఒకేచోట కలిసే ఏకైక ప్రదేశం సంగమేశ్వరం. ఈ నదులన్నీ కలసి జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తి పీఠం అయిన శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తాకుతూ చివరికి సముద్రంలో కలుస్తాయి

. గత ఏడాది కూడా జులైలోనే సంగమేశ్వరుడి గుడి గర్భాలయంలోకి నీరు ప్రవేశించింది. ఈ ఆలయంలో వేపలింగాన్ని భీముడు ప్రతిష్టించాడని పురాణాలు చెబుతున్నాయి. వేపదారు శివలింగం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. సంగమ తీరంలో గంటగంటకూ వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో ఆలయం నీట మునిగిన దృశ్యాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News