Thursday, September 19, 2024
HomeదైవంSankranthi-Muggulu: ముగ్గులేస్తే లక్ష్మీ దేవి వస్తుంది

Sankranthi-Muggulu: ముగ్గులేస్తే లక్ష్మీ దేవి వస్తుంది

పాజిటివ్ ఎనర్జీని మోసుకొచ్చేది ముగ్గులే

సంక్రాంతి పండుగంటే ముందు గుర్తుకు వచ్చేది ముగ్గులే.  ముగ్గుల్లేకుండా సంక్రాంతి పండుగను అస్సలు ఊహించలేం కదా.  ఈ మూడు రోజులు ఏ ముగ్గు వేయాలి? అందరికంటే మన ముగ్గే హైలైట్ గా ఉండాలనేది అందరి ఇళ్లలో ఆడవారి తాపత్రయం. సంక్రాంతి వచ్చిందంటే చాలు కొన్ని రోజుల ముందునుంచే ముగ్గుల ప్రాక్టీస్ మొదలుపెట్టేస్తారు.  ఏదో ఎగ్జామ్ కు కదా ప్రిపేర్ అయినట్టు ముగ్గుల ప్రాక్టీస్ తెగ చేసేస్తారు.  పేపర్లో రోజూ వచ్చే ముగ్గులను వేసేందుకు కుస్తీ పడుతుంటారు.  ఇదంతా కొన్ని రోజులపాటు సాగే తతంగం.

- Advertisement -

ఆడవారికి ప్రెస్టీజియస్ ఈ పోటీలు

సంక్రాంతి పండుగలో కోడిపందాలు జరిపినట్టే ముగ్గుల పోటీలు కూడా.  మీకు తెలుసు ఇది ఆడవారందరికీ ప్రెస్టీజియస్ పోటీలు కూడా.  గతేడాది ఫలానా వాళ్ల ముగ్గుకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది.. ఈసారి మన ముగ్గుకు రావాల్సిందే అని చాలామంది పట్టుపట్టి, ప్రాక్టీస్ చేసి, కళ్లు చెదిరేలాంటి ముగ్గులు వేస్తారు. ఇదంతా ఆర్ట్ లో భాగం.  64 కళల్లో ముగ్గులు కూడా ఓ కళేమరి.

దక్షిణాదిలోనే ఈ సంప్రదాయం..

కేవలం దక్షిణాది రాష్ట్రాల్లోనే ఈ ముగ్గుల సంస్కృతి ఉంది.  కాకపోతే ఒక్కోభాషలో ఒక్కో పేరుతో దీన్ని పిలుస్తారు. తెలుగులో ముగ్గులు అంటాం. కన్నడలో రంగోలి అంటారు. తమిళ్-మళయాళంలో కోలం అంటారు.  అందరూ వేసేది ముగ్గులే.  సంక్రాంతికి ఈ ముగ్గుల్లోనే పొంగలి వండటం తమిళ, మళయాళ సంప్రదాయం.

రోజుకో డిజైన్

మొదటి రోజు భోగి పండుగ. ఈరోజు ముఖ్యంగా వేసే ముగ్గులు అన్నీ భోగి కుండల ముగ్గులే ఉంటాయి.  ప్రధానంగా భోగి కుండలు, భోగి పళ్లు ఉండేలా ముగ్గుల డిజైన్స్ ఉంటాయి.  ఇక చెరకు గడలు, గాలిపటాలు అవన్నీ ఎలాగూ వేసి, ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలు పెట్టి పూజ చేస్తాం.  సంక్రాంతి రోజు పొంగలి కుండలు, మంటలు పెట్టినట్టు, పొంగలి పొంగిపోతున్నట్టు అంటే పాలపొంగు ముగ్గులు వేయటం సంప్రదాయం.  ఇవి రొటీన్ అనుకుంటే వేరే డిజైన్స్ ఏవంటే అవి వేసేవారున్నారు.  కొందరు హరిదాసులు, కోలాటాలు వంటివన్నీ ఈ ముగ్గుల్లో కనిపించేలా చక్కని రూపంలో ముగ్గులు పెడతారు.  పండుగ మూడవ రోజు అంటే కనుమ రోజు మరింత స్పెషల్ ముగ్గులు వేస్తారు.  రంగు రంగుల రథాలను వేస్తారు. ఇవి కొన్ని చుక్కలతో వేసేవైతే మరికొన్ని అలా వంకీలు వంకీలుగా అంటే మెలికలు తిప్పుకుంటూ వేస్తారు. వీటినే రథం ముగ్గు లేదా కనుమ ముగ్గులంటారు.  సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించినందుకు గుర్తుగా సూర్యుడి రథాన్ని ఇలా ముగ్గురూపంలో వేసి సూర్యనారాయణుడిని  పూజిస్తారన్నమాట. 

రంగులు, ఉప్పు, ఇసుకతో నింపే ముగ్గులు

ఈ ముగ్గులకు మరింత అందం వచ్చేలా వీటిని రంగులతో నింపుతారు.  ఇలా నింపే క్రమంలో పువ్వులు కొందరు ప్రయోగిస్తారు.  చాలామటుకు కలర్స్, ముఖ్యంగా ఉప్పుమీద రంగులు వేసి కలిపి వాటితో ముగ్గు నింపుతారు.  అప్పుడు ఎండలో ముగ్గు క్రిస్టల్ లా వెరైటీగా మెరుస్తుంటే చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి.  అన్నట్టు.. చాలా షాపులవారు, మీ ముగ్గుతో మీరు సెల్ఫీ దిగితే బెస్ట్ గా ఉన్న రంగోలికి ప్రైజెస్ కూడా ఇస్తున్నాయి.   వాట్సప్ గ్రూప్స్ లేదా ఇంటర్నెట్ లో ఇవన్నీ కొన్నిరోజులపాటు ముగ్గులను పీక్స్ కు తీసుకెళ్తాయి. ఇక ఈరోజుల్లో ఏ ఇద్దరు ఆడవాళ్లు కలిసినా ముగ్గుల గురించే మెయిన్ డిస్కషన్ ఉంటుంది.  వాట్సప్ లో కూడా ముగ్గుల ఫోటోలు ఫార్వర్డ్ చేసుకుంటూ, వాటిని ప్రాక్టీస్ చేసేవారు చాలామంది మనమధ్య ఉన్నారు.  ముగ్గులంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు చెప్పండి. సిటీల్లో ముగ్గులు వేసే ఛాన్స్ దొరకటం కష్టమన్న మాట నిజమే కానీ ముగ్గులంటే అందరికీ ఇష్టమైనవే.

ముగ్గులే ఎందుకు వేయాలి?

ఇదంతా బాగానే ఉంది కానీ అసలు ముగ్గులు ఎందుకు వేస్తారు? అందునా సంక్రాంతి పండుగకు ముగ్గలకు ఉన్న లింక్ ఏంటనేగా మీ డౌట్.  లక్ష్మీదేవికి గుర్తుగా, లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవటానికి ముగ్గులు వేస్తారు.  లక్షణకరమైనది ముగ్గును భావిస్తారు.  అంటే శుభకరం అని అర్థం.  ఇంటి ముందు శుభ్రంగా క్లీన్ చేసి, ముగ్గులు వేస్తే ఆ ఇంట్లోకి లక్ష్మి దేవి వస్తుందని భావిస్తారు. అందుకే రోజూ ఇంటి ముందు ముగ్గులు వేస్తారు.  కానీ సంక్రాంతి ముగ్గులకు చాలా స్పెషాలిటీ ఉంది.  పేడనీళ్లు అంటే కల్లాపి చల్లి, అది కాస్త ఆరాక తెల్లగా ముగ్గు పిండి లేదా బియ్యం పిండితో పెట్టే ముగ్గు ఎంత అందంగా కనిపిస్తుందో.   అంతేకాదు ఈ ముగ్గులు దుష్టశక్తులను ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటాయని ప్రతీతి.  ముగ్గులో ఉన్న పాజిటివ్ ఎనర్జీ అంతా మంచి చేస్తుందని ప్రగాఢ విశ్వాసం మనకు అనాదిగా ఉంది. ముగ్గులు వేయటం కళమాత్రమే కాదు ఇందులో ఇంకో ఆంతర్యం కూడా ఉంది. రోజూ ముగ్గువేయటం ఓ ఆసనం లాంటిదికూడా.  ముగ్గు పూర్తయ్యేవరకు అలా ఒంగి, లేచి వేయటం ఆరోగ్యానికి ఒక చిన్నపాటి ఎక్సర్ సైజ్ వంటిది.  కాబట్టి పొద్దున్నే ఇంటిముందు ముగ్గు వేయటం ఓ యోగాసనంలో భాగమని పెద్దవారు చెబుతారు.

ముగ్గులు వేయటం రాదా డోన్ట్ వర్రీ

మీకు ముగ్గులు పెట్టడం రాదా? డోన్ట్ వర్రీ. ఇందులో సిగ్గు పడాల్సింది, భయపడాల్సింది ఏమీ లేదు.  అసలు ముగ్గులు వేయటం ఎలా అనే షార్ట్ టర్మ్ కోర్సు చేరమని నేను సజెషన్ ఇస్తానని భయపడుతున్నారా? అలాంటిదేం లేదండి.  సింపుల్, వెరీ వెరీ సింపుల్. మీకు రంగోలి ఎలా వేయాలో ఇంటర్నెట్ లో షార్ట్ కట్స్ చూపే వెబ్ సైట్స్ చాలా ఉన్నాయి.  వాటిని వీరు ఒక్కసారి చూస్తే వేసేయవచ్చు.  ఆర్ట్ ముగ్గులు, చుక్కల ముగ్గులు వేయటంలో ఈ బ్లాగర్స్, వ్లాగర్స్ మీకు చాలా ట్రిక్స్, టిప్స్ చెబుతారు.  పినింట్రెస్ట్ డాట్  కాం, కోలం డాట్ కాం వంటి వెబ్ సైట్స్, యుట్యూబ్ లో బోలెడన్ని చానెల్స్ లో మీకు ఈ రంగోలిల డిటైల్స్ ఉంటాయి.

ముగ్గుకు షార్ట్ కట్స్ కూడా..

రంగోలికి ఇంకో షార్ట్ కట్ ఉందండి.  రెడీ మేడ్ ముగ్గులు. మీ బడ్జెట్ కు తగ్గట్టు రకరకాల ముగ్గుల సెట్స్ మార్కెట్లో ఉన్నాయి.  వాటిని మీరు సింపుల్ గా పరిస్తే చాలు.  ఇక వీటి చుట్టూ పూల రేకులు, కలర్స్ అద్దటం అవన్నీ మీ ఓపికను బట్టి చేసుకోవచ్చు.  ఒక్కసారి ఈ సెట్స్ కొంటేచాలు ఇక మీరు ఎన్నిసార్లైనా వీటిని ఏ  పండక్కైనా వాడుకోవచ్చు.  పైగా ఈ ఆక్రిలిక్ ప్లేట్స్ ను మీరు శుభ్రంగా కడగచ్చు కూడా.  వీటిని చమ్కీలు, మిర్రర్, కుందన్స్, పూసలు, ముత్యాలు వంటి రకరకాల వాటితో డిజైన్ చేస్తారు కాబట్టి.. ఈ డిజైన్స్ కళ్లు చెదిరేలా ఉంటాయి. ఇక స్టిక్కర్స్ రంగోలి ఎలాగూ అందరికీ తెలిసినదే.  జస్ట్ అలా స్టిక్ చేస్తే చాలు బార్డర్స్, ముగ్గులు అన్నీ మీకు కావాల్సిన సైజుల్లో దొరుకుతున్నాయి.  లేదంటే ఓ పెయింటర్ తో ఒక్కసారి మీకు నచ్చిన ముగ్గులను, మీకు కావాల్సిన కలర్స్ ఛాయిస్ తో ముగ్గులు పెట్టిస్తే సరి. నీళ్లతో కడిగినా ఈ రంగులు చెక్కుచెదరవు.  సో.. మీ ఇంట్లో, వరండాలో, పార్కింగ్ లో ఎక్కడైనా సరే ఇలా ఆయిల్ పెయింట్ తో రంగోలి వేయించుకుంటే సరిపోతుంది.

మన ఫీలింగ్స్ చెప్పే ముగ్గులు

అన్నట్టు.. ముగ్గులు మన సంబరాన్ని, సంతోషాన్ని కూడా చెబుతాయి.  అదేంటి ముగ్గులు మాట్లాడతాయా అంటారా? అవును మాట్లాడతాయి.  మనం దీపావళికి పెట్టే ముగ్గులు, సంక్రాంతికి పెట్టే ముగ్గులు, దసరాకు పెట్టే ముగ్గులు, రథసప్తమికి పెట్టే ముగ్గులు, న్యూ ఇయర్ కు పెట్టే ముగ్గులు, గృహప్రవేశం, పెళ్లిళ్లకు పెట్టే ముగ్గులు..ఇలా సందర్భాన్నిబట్టి మనకు రంగవల్లికలు ఉంటాయనే విషయం మనందరికీ తెలుసుకదా.  ఆడవారి మనసు ఆనందంగా, సంతోషంగా ఉన్నప్పుడు పెద్ద-మంచి ముగ్గులు ఎంత అందంగా వేస్తారో కదా. మన మనసులు, మన అకేషన్స్ కూడా చెప్పేవి ముగ్గులు.  ఇక సంక్రాంతి పండగంటేనే ముగ్గుల పండుగ.  ముగ్గుల్లోనే పండుగ సందడి అంతా వివరిస్తారన్నమాట. ఈ మూడు రోజుల ముగ్గుల స్పెషాలిటీ.  భోగి, సంక్రాంతి, కనుమ పండుగల్లో మనం పాటించే ఆచార వ్యవహారాలన్నీ ముగ్గుల ద్వారా చూపటం భలే విచిత్రంగా ఉంటుంది కదూ.  గంగిరెద్దులు, భోగిపళ్లు, హరిదాసులు, గోపికలు, చెరకుగడలు, పాలపొంగులు, పొంగలి, ధాన్యపు రాసులు, రైతులు, ఎడ్లబండ్లు, ఎడ్లు ఇలా ఒక్కటేమిటి.. సంక్రాంతి వాతావరణం అంతా ఒక్క ముగ్గు రూపంలో కనిపించేస్తుంది.

అన్నట్టు మీరెప్పుడైనా ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారా? ఈసారి తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. మీ ముత్యాల ముగ్గుకు ఫస్ట్ ప్రైజ్ వచ్చేలా మీ క్రియేటివిటీ అంతా చూపండి.  సంక్రాంతి లక్ష్మికి ఆహ్వానం పలికేది ఈ ముగ్గుతోనే కనుక.. సంక్రాంతి సందడి..మీ ముగ్గుతో స్టార్ట్ చేయండి.   

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News