Makar Sankranti & Ekadashi Conjunction 2026: తెలుగు లోగిళ్లు ఎంతో వైభవంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. జనవరి 14న సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ పవిత్రమైన రోజున 23 ఏళ్ల తర్వాత ఒక అరుదైన ఆధ్యాత్మిక కలయిక జరగబోతోంది. అది ఏంటంటే మకర సంక్రాంతి, షట్టిల ఏకాదశి ఒకే రోజు రావడం. ఇలా చివరిసారిగా 2003లో సంభవించింది. పైగా ఇదే సమయంలో సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం వంటి శుభ యోగాలు కూడా ఏర్పడుతున్నాయి. దీంతో ఈ రోజుకు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మరింత రెట్టింపు అయ్యింది.
శుభ ఘడియలు ఇవే..
పుణ్యకాలం: మధ్యాహ్నం 3:04 నుండి సాయంత్రం 5:57 వరకు.
మహా పుణ్యకాలం: మధ్యాహ్నం 3:04 నుండి 3:28 వరకు.
స్నానాలు, దానాలకు ముహూర్తం: ఉదయం 9:03 నుండి 10:48 వరకు.
పూజా విధానం మరియు సంప్రదాయాలు
మకర సంక్రాంతి రోజున చేసే స్నానం, జపం మరియు దానాలకు అనంతమైన పుణ్యం లభిస్తుంది. బ్రాహ్మ ముహూర్తంలో నిద్రలేచి పవిత్ర నదులలో స్నానం చేయాలి. ఇంటి వద్దే స్నానం చేసేవారు నీటిలో నువ్వులను వేసుకోవడం శుభప్రదం.రాగి పాత్రలో నీటిని తీసుకుని ఎర్రటి పువ్వులు, నువ్వులు, అక్షతలు వేసి సూర్యభగవానుడికి అర్ఘ్యం వదలాలి. “ఓం సూర్యాయ నమః” అనే మంత్రాన్ని జపించాలి. ఈసారి ఏకాదశి కూడా కలిసి రావడంతో శ్రీమహావిష్ణువును భక్తితో కొలవాలి. పండ్లు మరియు నువ్వులతో చేసిన పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి.
Also Read: Holi 2026 – 2026లో హోలీ పండుగ ఎప్పుడంటే?
సంక్రాంతి మరియు షట్తిల ఏకాదశి కలయిక వల్ల ఈరోజు చేసే దానాలకు విశేష ఫలితం ఉంటుంది. ధాన్యాలు, వస్త్రాలు, నువ్వులు, బెల్లంతో చేసిన పదార్థాలు, పండ్లు, కూరగాయలు మరియు నెయ్యిని దానం చేయడం ఉత్తమం. అవసరంలో ఉన్నవారికి, పేదలకు మీ శక్తి మేరకు సహాయం చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుందని వేద పండితులు చెబుతున్నారు.
Also Read: Chaturthi 2026 -కొత్త ఏడాది తొలి చతుర్థి ఎంతో ప్రత్యేకం.. ఎందుకో తెలుసా?

