Gorintaku At Ashada Masam: గోరింటాకు అనేది మహిళల అలంకారంలో ఒక ముఖ్యమైన భాగం. దీని ఎక్కువగా పెళ్లిళ్లు లేదా పండుగల సందర్భంగా పెట్టుకుంటారు. అతి ముఖ్యంగా ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం ఒక సంప్రదాయం. ఈ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం ఆనవాయితీ మాత్రమే కాదు దీని వెనుక అనేక ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు. ఆషాడ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు? దీని వెనుక ఉండే కారణాలు ఏంటో మనం ఇక్కడ తెలుసుకుందాం.
ఆషాడ మాసం అనేది తెలుగు నెలల్లో ఒకటి. ఈ మాసంతో వర్ష రుతువు ప్రారంభమవుతుంది. సాధారణంగా ఈ సీజన్‌లో దగ్గు, జ్వరం, జలుబు వంటి అనారోగ్యసమస్యలు తలెత్తుతాయి. గోరింటాకు పెట్టుకోవడం ఒక అలంకారం మాత్రమే కాదు ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. గోరింటాకులో శరీరాని చల్లబరిచే గుణాలు అధికంగా ఉంటాయి. దీని పెట్టుకోవడం వల్ల శరీరంలో ఉండే వేడి తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. గోరింటాకు ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. ఆరోగ్యనిపుణుల ప్రకారం మహిళలు గోరింటాకు పెట్టుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుతుందని చెబుతున్నారు. గోరింటాకులో బోలెడు ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే చర్మ సమస్యలను తగ్గించడంలో, ఫంగల్ ఇన్ఫెక్షన్‌లను తొలగించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా గోరింటాకు పిరీయడ్స్ సమయంలో వచ్చే సమస్యలను, గర్భాశయ దోషాలను తగ్గించడంలో గోరింటాకు సహాయపడుతుందని కొందరు భావిస్తారు.
ఆధ్యాత్మికంగా గోరింటాకు పెట్టుకోవడం గురించి:
మన హిందూవులు పసుపు, కుంకుమ, గోరింటాకును మహిళల సౌభాగ్యానికి ప్రతీకగా భావిస్తారు. ముఖ్యంగా ఆషాడ మాసంలో కొత్తగా పెళ్లైన మహిళలు పుట్టింటికి వస్తారు. ఈ సమయంలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల వారి భర్త ఆరోగ్యం, సౌభాగ్యం పెరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కొందరు గోరింటాకు ఎర్రగా పండితే అంత మంచి భర్త వస్తాడని ఒక నమ్మకం. గోరింటాకు పెట్టుకోవడం వల్ల మహిళలకు మానసిక ఆరోగ్యానికి మంచిదని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు. ఇది కేవలం సాంప్రదాయం మాత్రమే కాదు బంధుమిత్రులతో కలిసి ఆనందించే వేడుక కూడా.
ఆషాడ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం అనేది ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న సాంప్రదాయం. దీని వెనుకు శాస్త్రీయ, ఆధ్యాత్మిక నమ్మకాలు కూడా ఉన్నాయని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం చాలా మంచిది. మార్కెట్లో లభించే గోరింటాకు కంటే చెట్టు ఆకులతో తయారు చేసుకొని చేతులకు పెట్టుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.