Saturday, November 15, 2025
HomeదైవంTulasi Kalyanam: కైశిక ద్వాదశి అంటే ఏమిటి..తులసి కళ్యాణం ఎందుకు చేస్తారు?

Tulasi Kalyanam: కైశిక ద్వాదశి అంటే ఏమిటి..తులసి కళ్యాణం ఎందుకు చేస్తారు?

Significance of Kaisika Dwadashi:హిందూ సంప్రదాయంలో కార్తీకమాసం అత్యంత పవిత్రమైన నెలగా భావిస్తారు. ఈ నెలలో జరిగే ప్రతి పర్వదినానికీ ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. అలాంటి ముఖ్యమైన రోజుల్లో కైశిక ద్వాదశి ఒకటి. ఈ రోజున శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొంటారని, ఈ రోజును క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుక ద్వాదశి అని కూడా పిలుస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి.

- Advertisement -

కైశిక ద్వాదశి అర్థం

ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో యోగనిద్రలోకి వెళ్ళి, ఆ తరువాత మేల్కొనే రోజుని కైశిక ద్వాదశిగా పిలుస్తారు. ఈ రోజు ఆయనకు ఎంతో ప్రీతికరమైనదని పురాణాలు పేర్కొంటాయి. వరాహ పురాణం ప్రకారం శ్రీ వరాహ స్వామి భూదేవికి చెప్పిన కైశిక పురాణ కథ ఈ రోజున వినడం, చదవడం పుణ్యప్రదమని నమ్మకం.

Also Read: https://teluguprabha.net/devotional-news/karthika-masam-significance-and-river-bath-benefits-explained/

తేదీ, పూజ సమయాలు

ఈ సంవత్సరం నవంబర్ 2వ తేదీ ఆదివారం కార్తీక శుద్ధ ద్వాదశి కావడంతో ఆ రోజున కైశిక ద్వాదశిని జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు పూజకు శుభ సమయమని, సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు తులసి కళ్యాణం చేయడం అత్యంత శ్రేయస్కరమని చెబుతున్నారు.

తులసి మొక్క పవిత్రత

హిందూ సంప్రదాయంలో ప్రతి ఇంట్లో తులసి మొక్కను పూజించడం ఒక ముఖ్యమైన ఆచారం. తులసి మొక్కను దేవతా స్వరూపంగా భావిస్తారు. ప్రతి రోజు సంధ్య సమయానికి తులసి చెట్టు వద్ద దీపం పెట్టే ఇల్లు సంపద, శాంతి, ఆరోగ్యం కలిగిస్తుందని పెద్దలు చెబుతారు. భగవంతునికి సమర్పించే నైవేద్యంలో తులసి దళం ఉంచడం ఆ ప్రసాదానికి పవిత్రతని ఇస్తుంది.

తులసి పవిత్రత వెనుక కారణం

శాస్త్ర వచనాల ప్రకారం తులసి కాండంలో దేవతలు, దాని అగ్రభాగంలో వేదాలు, మూలంలో సర్వతీర్థాలు స్థితి చెంది ఉంటాయని చెబుతారు. అందుకే తులసిని పూజించడం అత్యంత పుణ్యప్రదమని భావిస్తారు. తులసి మొక్క ముందు దీపం వెలిగిస్తూ “యన్మూలే సర్వ తీర్థాని యన్మధ్యే సర్వ దేవతా యదగ్రే సర్వ వేదాశ్చ తులసీం త్వాం నమామ్యహం” అని స్మరించడం ఆచారం.

తులసి కళ్యాణం వెనుక పురాణం

స్కంద పురాణం ప్రకారం కాలనేమి కుమార్తె బృంద మహా పతివ్రతురాలు. ఆమె రాక్షసరాజు జలంధరుని వివాహం చేసుకుంది. జలంధరుని ప్రాణాలు బృంద పాతివ్రత్యం మీద ఆధారపడి ఉండేవి. బృంద తన పాతివ్రత్యాన్ని కోల్పోతే జలంధరుడు మరణిస్తాడని వరం ఉండేది.

జలంధరుడు తన శక్తిని దుర్వినియోగం చేస్తూ లోకాలను వేధించసాగాడు. చివరకు దేవతలు శ్రీ మహావిష్ణువును ఆశ్రయించారు. అప్పుడు విష్ణువు జలంధరుని రూపం తీసుకుని బృంద పాతివ్రత్యాన్ని భంగం కలిగిస్తాడు. ఆ క్షణంలోనే జలంధరుడు పరమశివుని చేతిలో హతుడవుతాడు. బృంద కూడా భర్త మరణంతో చితాగ్నిలో కలుస్తుంది.

తులసి జన్మకథ

విష్ణువు చేసిన ఈ చర్యతో బృందపై ఆయనకు సానుభూతి కలుగుతుంది. ఆమె చితాభస్మంలో గౌరీ, లక్ష్మీ, ధాత్రి దేవతలు ఇచ్చిన మూడు గింజలను కలపగా మూడు పవిత్రమైన మొక్కలు పుట్టాయి. గౌరీ ఇచ్చిన గింజతో తులసి మొక్క, లక్ష్మి ఇచ్చిన గింజతో ఉసిరి చెట్టు, ధాత్రి ఇచ్చిన గింజతో మాలతి పుష్పం పుట్టాయి. ఈ సంఘటన కార్తీక శుద్ధ ద్వాదశి నాడు జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఆ రోజును కైశిక ద్వాదశిగా పిలుస్తారు.

తులసి కళ్యాణ సంప్రదాయం

ఈ రోజున తులసిని లక్ష్మి స్వరూపంగా, ఉసిరి చెట్టును శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావించి వీరి వివాహాన్ని జరపడం ఆనవాయితీగా మారింది. ఈ పూజను జరిపించడం వల్ల ఇంటిలో సౌభాగ్యం, ఆరోగ్యం, సిరిసంపదలు వృద్ధి చెందుతాయని విశ్వాసం.

తులసి కళ్యాణం చేసే విధానం

తులసి మొక్క పక్కన ఉసిరికాయ చెట్టు లేదా కొమ్మను ఏర్పాటు చేయాలి. పసుపు, కుంకుమతో, దీపదూపాలతో రెండు మొక్కలను పూజించాలి. తరువాత పసుపు తాడు కట్టి, పాయసం లేదా ఇతర నైవేద్యంతో పూజ పూర్తి చేయాలి. పూజ అనంతరం ఒక ముత్తైదువుకు భోజనం పెట్టి, చీర రవికె మరియు తాంబూలం ఇవ్వడం శుభప్రదమని భావిస్తారు.

Also Read:https://teluguprabha.net/devotional-news/karthika-pournami-2025-puja-timings-rituals-and-significance/

తులసి కళ్యాణం ప్రాముఖ్యత

పురాణాలు చెబుతున్న ప్రకారం, ఈ పూజను జరిపిన లేదా చూచిన అవివాహితులు త్వరగా వివాహం చేసుకుంటారని విశ్వాసం ఉంది. వివాహితులు కూడా ఈ పూజ చేయడం వల్ల దాంపత్య సుఖం, సౌఖ్యం, సంపదలు పెరుగుతాయని నమ్మకం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad