Significance of Kartika Mondays:కార్తీక మాసం వచ్చిందంటే భక్తులు ఉపవాస దీక్షలతో ఎంతో ఉత్సాహంగా ఆ పరమశివున్ని ఆరాధిస్తుంటారు. ఈ మాసం ప్రతి రోజు ప్రత్యేకమైనదే అయినా, సోమవారాలు మాత్రం శివభక్తులకు అత్యంత పవిత్రమైనవిగా పండితులు వివరిస్తారు. ఈ కాలంలో శివుడిని ఆరాధించడం ద్వారా పాపాలు తొలగిపోతాయని, ఆరోగ్యం, ఆనందం, శాంతి లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక మాసం మొదటి సోమవారంతోనే ఉపవాసం ప్రారంభించి, దాన్ని భక్తిశ్రద్ధలతో కొనసాగిస్తే శివకృప లభిస్తుందనే నమ్మకం చాలా మందిలో ఉంటుంది.
భక్తులు సాధారణంగా ఈ వ్రతాన్ని జీవితాంతం కొనసాగించే వారు ఉన్నా, కొందరు ఒక సంవత్సరం, మూడు సంవత్సరాలు, పన్నెండు సంవత్సరాలు లేదా పద్నాలుగు సంవత్సరాలు కొనసాగిస్తామని ఆనావాయితీగా పెట్టుకుంటారు. ఇది కేవలం వ్రతం మాత్రమే కాదు, ఒక ఆధ్యాత్మిక సాధనగా కూడా పండితులు చెబుతున్నారు. ఈ మాసంలో ఉపవాసం పాటించి, శివాలయ సందర్శన చేయడం శివుని కటాక్షం పొందడానికి మార్గంగా చెబుతుంటారు.
చంద్రుని శాప విముక్తి కథ
ఇలాంటి ఆచారాలకు పునాది అయిన కథల్లో చంద్రుని శాప విముక్తి కథ ముఖ్యమైనది. పురాణాల ప్రకారం, చంద్రుడు కార్తీక మాసంలోని శుక్ల పక్షం ఎనిమిదవ రోజున అవతరించాడు. ఆయన తన తేజస్సుతో యజ్ఞాలను నిర్వహించి ప్రసిద్ధి పొందాడు. దక్ష ప్రాజాపతికి 27 మంది కుమార్తెలు ఉండగా, వారందరినీ చంద్రునికి వివాహమాడించాడు. అయితే చంద్రుడు వారిలో రోహిణి అనే భార్యపైనే ఎక్కువ ప్రేమ చూపించాడు. మిగతా భార్యలు దీనితో బాధపడి తమ తండ్రి దక్షుడికి ఫిర్యాదు చేశారు.
రోజురోజుకూ నీ కాంతి తగ్గిపోతుంది..
దక్షుడు చంద్రుడిని పిలిచి, తన కుమార్తెలందరినీ సమానంగా గౌరవించాలని సూచించాడు. కానీ చంద్రుడు ఆ మాటను పట్టించుకోలేదు. కోపంతో ఉన్న దక్షుడు చంద్రుడిని “రోజురోజుకూ నీ కాంతి తగ్గిపోతుంది” అని శపించాడు. ఆ శాపం వెంటనే ఫలించింది. కాంతి కోల్పోతూ క్షీణిస్తున్న చంద్రుడు భయాందోళనకు గురయ్యాడు. తన పరిస్థితి మార్చుకోవడానికి బ్రహ్మదేవుడిని ఆశ్రయించాడు. బ్రహ్మదేవుడు చంద్రుడికి శివుడి శరణు వేడుకోమని సలహా ఇచ్చాడు.
కృష్ణ పక్షం, శుక్ల పక్షం…
చంద్రుడు ఆ మాట విని శివుడి ఆలయం చేరి ప్రార్థనలు ప్రారంభించాడు. ప్రతి సోమవారం ఉపవాసం ఉండి, భక్తితో శివుని ఆరాధించాడు. చంద్రుని నిబద్ధతను చూసి శివుడు సంతోషించి, ఆయనను తన జడలో స్థానం కల్పించాడు. దీని వల్ల చంద్రుని శాపం పూర్తిగా తొలగిపోకపోయినా, కొంతమేర తగ్గింది. ఆ తరువాత చంద్రుడు నెలలో 15 రోజులు వృద్ధి చెందుతూ, 15 రోజులు క్షీణించే స్వభావం పొందాడు. అందువల్లే కృష్ణ పక్షం, శుక్ల పక్షం అనే రెండు దశలు ఏర్పడ్డాయని చెబుతారు.
కార్తీక సోమవారాల ఆరాధనకు…
ఇదే కథ కార్తీక సోమవారాల ఆరాధనకు మూలకారణంగా మారింది. చంద్రుడు శివునికి చేసిన భక్తి, ఆయన పొందిన వరప్రసాదం వల్ల ఈ మాసంలోని సోమవారాలు శివుని కృప పొందడానికి ముఖ్యమైన రోజులు అయ్యాయి. చంద్రుడు శివుడిని ప్రార్థిస్తూ, “ప్రభూ, ఈ మాసంలో సోమవారం ఉపవాసం ఉండి నిన్ను ఆరాధించే వారికి శుభఫలితాలు ప్రసాదించు” అని కోరాడని పురాణాలు చెబుతున్నాయి. శివుడు ఆ వరం ఇచ్చి, భక్తులందరికీ ఆ శుభఫలితాలు లభించేలా వరమిచ్చాడు.
దీపం వెలిగించి, బిల్వదళాలు…
ఈ కారణంగానే భక్తులు కార్తీక మాసంలోని ప్రతి సోమవారం ఉపవాసం చేస్తారు. ఉదయం స్నానం చేసి, దీపం వెలిగించి, బిల్వదళాలు సమర్పిస్తూ శివుడి నామస్మరణ చేస్తారు. కొంతమంది రోజంతా ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉంటారు. శారీరకంగా బలహీనంగా ఉన్నవారు మాత్రం పాలు, పండ్లు మాత్రమే తీసుకుంటారు. సాయంత్రం శివాలయ దర్శనం చేసి, ఆ తరువాత భోజనం చేయడం అనుకూలంగా భావిస్తారు.
శరీరం, మనస్సు రెండూ శుద్ధి …
ఈ వ్రతం ఆచరించడం ద్వారా శరీరం, మనస్సు రెండూ శుద్ధి చెందుతాయని నమ్మకం ఉంది. ఉపవాసం శరీరానికి విశ్రాంతి ఇస్తే, శివుని ఆరాధన మనసుకు ప్రశాంతత ఇస్తుంది. ముఖ్యంగా మానసిక ఒత్తిడులు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ఈ వ్రతం ఆధ్యాత్మిక శాంతిని ప్రసాదిస్తుంది. అదేవిధంగా, జీవితంలో చేసిన పాపాలు క్షమించబడతాయని విశ్వాసం ఉంది.


