ధనం ప్రతి ఒక్కరికీ అత్యంత అవసరం. జీవితంలో అభివృద్ధి కావాలంటే ఆర్థికంగా నిలదొక్కుకోవడం తప్పనిసరి. ధనం లేకపోతే పేదరికం, కుటుంబ భారాలు, జీవితానికి గందరగోళం తప్పవు. అందుకే చాలామంది భగవంతుని ఆరాధిస్తూ ధనసంపద కోరి పూజలు చేస్తుంటారు. అయితే ఆ ప్రార్థనలు దేవునికి చేరుతున్నాయా లేదా అన్న సందేహం మాత్రం తరచూ కలుగుతుంది. అయితే దేవుడు మన ప్రార్థనల్ని వింటున్నాడో లేదో తెలియక చాలామంది సందిగ్ధంలో ఉంటారు. కానీ కొన్ని ప్రత్యేక సంకేతాలు మీ ప్రార్థనలు సఫలమవుతున్నాన్నాయని తెలుసుకోవచ్చు అంటున్నారు పండితులు. ఇవి కనిపిస్తే భగవంతుడు మీ కోరికలను వింటున్నాడని అర్థమంట.
పవిత్ర సంకేతాలు: మీ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, మీరు పూజ చేస్తున్న సమయంలో లోపల మంచి నమ్మకం, ఆశ, ఆనందం కలుగుతున్నట్లయితే.. అది దేవుని అనుగ్రహానికి సంకేతం. భవిష్యత్తులో మార్పు మొదలవబోతోందని ఇది సూచిస్తుందంట. ఇక పూజ చేస్తున్నప్పుడు ఏ కారణం లేకుండా ఒక్కసారిగా భావోద్వేగంతో ఏడవడం మొదలైతే.. అదే పవిత్ర సంకేతం. బయటకి కన్నీళ్లు వస్తున్నా, లోపల అనిర్వచనీయమైన తృప్తి కలుగుతుంది. ఇదే భక్తి తీవ్రతకు చిహ్నం. దీంతో మీ కోరికలు త్వరలోనే నెరవేరతాయని దీని అర్థం.
పూజ సమయంలో మీ చేతుల్లోకి లేదా ఒడిలోకి ఏదైనా పుష్పం పడితే, మీరు కోరుకున్న కోరికలో ఒకటి నెరవేరబోతోందన్న అద్భుత సంకేతంగా భావించాలి. ఇది భగవంతుని సమాధానంగా పరిగణించబడుతుంది. ఇక మీరు పూజించే దేవుడిని కలలలో చూడటం, ఆయన ఆశీర్వదిస్తున్నట్లు అనిపించడం ఎంతో శుభ సూచకం. ఇది భగవంతుని అనుమతి లభించిందన్న సంకేతంగా భావించవచ్చు. పూజలకు సానుకూల స్పందన వచ్చినట్లు తెలుస్తుంది.
మీ పూర్వీకులు మీ కలల్లో సంతోషంగా కనిపించడం లేదా ఆశీర్వదించడమూ గొప్ప సంకేతమే. పూజ వల్ల కేవలం భగవంతుడు మాత్రమే కాక, మీ వంశపారంపర్య పితృదేవతలు కూడా సంతోషిస్తున్నారని భావించాలి. దీని అర్థం మీ జీవిత మార్గంలో శుభఫలితాలు దగ్గరగా ఉన్నాయన్నమాట. ఇక ఈ సంకేతాలను గమనించే సామర్థ్యం ప్రతి ఒక్కరికీ ఉండదు. మనస్సు శాంతిగా ఉన్నప్పుడు, భక్తితో కూడిన ప్రార్థనలు చేసినప్పుడు మాత్రమే ఇవి కనిపిస్తాయి. అందుకే ప్రతిరోజూ భగవంతుని ధ్యానించడం, పూజ చేయడం ద్వారా లోపల చైతన్యం పెంపొందించుకోవాలి.
గమనిక: ఈ కథనంలో ఇచ్చిన సమాచారం జ్యోతిష్య శాస్త్రం, ఆచారాలు, పంచాంగాలు, గ్రంథాల ఆధారంగా రాసినది. ఈ విషయాలను తెలుగు ప్రభ ధృవీకరించడం లేదు. పాఠకులు తమ నమ్మకాల మేరకు విచక్షణతో ఆచరించగలరు.)