ఎమ్మిగనూరు పట్టణంలోని వెంకటసాయి దేవాలయంలోని ప్రదానాలయంలో పురోహితులు గురుస్వామి భవాని శంకర్ అధ్వర్యంలో మాఘమాసంలో శివాభిషేకం వేడుకలు వైభవంగా నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని లింగేశ్వరుడికి ప్రత్యేక పూజా కార్యక్రమం ప్రతి రోజు సుమారు గంటన్నర పాటు నిర్వహిస్తున్నారు. లింగేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేశారు. అభిషేక ప్రియుడైన పరమశివున్ని విభూతి, గంధంతో, ప్రత్యేక పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్ర మాలను శివమాల భక్తుల నడుమ నిర్వహించారు.
అభిషేక ప్రియుడికి చెంబుడు నీళ్లు..
పరమశివుడు అభిషేక ప్రియుడని, ఓ పండు సమర్పించినా, ఓ చెంబుడు నీళ్ళతో అభిషేకించినా అనుగ్రహించే బోళాశంకరుడన్నారు. పాలాభిషేకం, పెరుగు, గంధం, నెయ్యి, తేనే వంటి పంచామృతంతో అభిషేకించడం ద్వారా ఆష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని శివపార్వతులకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. శివస్వాముల భక్తి గీతాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం ఆశ్రమం పూజా కార్యక్రమానికి భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.