Black Beads- Mangalsutra:భారతీయ సాంప్రదాయంలో పెళ్లైన స్త్రీలు ధరించే మంగళసూత్రం, కాలి మెట్టెలు, నల్లపూసలు వంటి ఆభరణాలకు విశేష ప్రాధాన్యం ఉందన్న సంగతి తెలిసిందే. ఇవి కేవలం అలంకరణ వస్తువులు కాదు, ఆధ్యాత్మికంగా, శాస్త్రీయంగా కూడా చాలా అర్థాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా నల్లపూసలు అనేవి స్త్రీల దాంపత్య జీవితానికి, ఆరోగ్యానికి, ఆత్మీయ శాంతికి చిహ్నంగా పండితులు చెబుతున్నారు. ఈ చిన్న నల్లపూసల వెనుక ఉన్న సాంప్రదాయ అర్థం తెలుసుకుంటే కచ్చితంగా ఆశ్చర్యపోతారు.
ప్రాచీన కాలం నుండి హిందూ స్త్రీలు వివాహం తర్వాత నల్లపూసలతో కూడిన మంగళసూత్రం ధరించడం ఆనవాయితీ పరగణిస్తారు.హిందూ గ్రంథాల ప్రకారం నల్ల రంగు చెడు దృష్టిని దూరం చేస్తుంది. అందుకే మంగళసూత్రంలో నల్లపూసలు జోడిస్తారు. ఈ పూసలు దృష్టిదోషాలు, దుష్ట శక్తులను దూరం చేసి స్త్రీ చుట్టూ రక్షణ వలయం సృష్టిస్తాయి అని పురాణాలు వివరిస్తున్నాయి.
Also Read:https://teluguprabha.net/devotional-news/lucky-zodiac-signs-in-karthika-masam/
గుండెకు సమీపంగా …
భార్య మెడలో నల్లపూసలు ఉండటం వలన భర్తకు ఎలాంటి అనర్థం,ఆపదలు సంభవించవని పెద్దలు చెబుతారు. ఆభరణం కేవలం అందం కోసం కాకుండా రక్షణ కవచంగా పనిచేస్తుందని పండితులు,పెద్దలు చెబుతుంటారు. చాలామంది మహిళలు నల్లపూసలు గల మంగళసూత్రాన్ని మెడకు దగ్గరగా ధరించటమే ఈ కారణం. శాస్త్రం ప్రకారం ఈ పూసలు గుండెకు సమీపంగా ఉండటం వలన సానుకూల శక్తులు శరీరమంతా వ్యాపిస్తాయి.
శివుడి ప్రతీకగా…
మరో వైపు, నల్లపూసలలో బంగారం, నల్ల పూసల కలయికకు ప్రత్యేక ఆధ్యాత్మిక అర్థం ఉంది. బంగారం దేవీ శక్తికి సంకేతం కాగా, నల్ల రంగు శివుడి ప్రతీకగా భావిస్తారు. ఈ రెండింటి సమ్మేళనం శివశక్తుల ఏకత్వాన్ని సూచిస్తుంది. వివాహ సమయంలో వధూవరులు నీలలోహిత గౌరీదేవిని పూజించడం కూడా ఈ శివశక్తుల కలయికకు సూచిక. ఈ పూజతో దంపతుల దాంపత్య జీవితం శాంతియుతంగా ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి.
నల్ల మట్టి లేదా సహజ పదార్థాలతో..
నల్లపూసలు ధరించడం వల్ల కేవలం ఆధ్యాత్మిక లాభాలే కాదు, శరీరానికి కూడా కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. పూర్వం ఈ పూసలను నల్ల మట్టి లేదా సహజ పదార్థాలతో తయారు చేసేవారు. అవి శరీరానికి శీతల ప్రభావం కలిగించి గుండె, రక్త ప్రసరణ వ్యవస్థలకు మేలు చేస్తాయని పెద్దలు చెబుతారు. ఈ పూసలు ఛాతీ వద్ద ఉండటం వలన శరీర వేడి తగ్గి గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. స్త్రీల నాడీవ్యవస్థపై ఇవి సానుకూల ప్రభావం చూపుతాయని నమ్మకం ఉంది.
ప్రశాంతత, స్థిరత్వం..
ఇంకా ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, నల్లపూసలు ధరించడం వలన స్త్రీల మనస్తత్వంలో ప్రశాంతత, స్థిరత్వం పెరుగుతుంది. నాడీ వ్యవస్థ సమతుల్యం కావడం వలన స్త్రీలు మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. దీని వలన ఆమె దాంపత్య జీవితం మరింత సంతోషంగా ఉంటుంది.
అలాగే కొందరు పండితులు చెబుతున్న దాని ప్రకారం నల్లపూసలు ధరించడం వలన జాతకంలోని దోషాలు, ముఖ్యంగా సర్పదోషం లేదా గృహదోషం వంటి సమస్యలు తగ్గుతాయి. ఇది స్త్రీ జీవితంలో ఉన్న ప్రతికూల శక్తులను తొలగించడంలో సహాయపడుతుంది అని అంటారు. నల్లపూసలు ధరించడం అంటే కేవలం ఆచారం మాత్రమే కాదు, ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక సాధన కూడా అని వారు వివరిస్తారు.
మానసిక ప్రశాంతతకు..
ఇక వైద్య పరంగా చూస్తే, నల్ల రంగు మానసిక ప్రశాంతతకు సూచిక. ఈ రంగు ఒత్తిడిని తగ్గించి, నాడులలో శాంతిని కలిగిస్తుందని శాస్త్రీయంగా నిర్ధారించారు. అందుకే పూర్వకాలం నుంచి నల్లపూసలు దరిద్రదోషం, దృష్టిదోషం, అనారోగ్య సమస్యల నుంచి రక్షణగా పెద్దలు చెబుతుంటారు.
మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే, ఈ పూసలు స్త్రీకి తన దాంపత్య బంధాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తాయి. ప్రతి సారి మంగళసూత్రాన్ని చూసినప్పుడు, తన భర్తకు, తన కుటుంబానికి ఉన్న బంధం గుర్తుకువస్తుంది. ఆ భావన స్త్రీ మనసులో భక్తిని, కృతజ్ఞతను పెంచుతుంది. ఇదే దాంపత్య జీవితం సాఫల్యానికి పునాది అని పండితులు భావిస్తారు.


