Dead Body Vs Spiritual:హిందూ సంప్రదాయాల్లో ఒక వ్యక్తి మరణించిన తర్వాత నిర్వహించే ప్రతి ఆచారం వెనుక లోతైన అర్థం దాగి ఉందని పండితులు చెబుతున్నారు. మరణాన్ని అంతం కాదు, ఆత్మకు కొత్త ప్రయాణం ఆరంభమని హిందూ ధర్మం వివరిస్తుంది. అందుకే శవాన్ని సంస్కరించే ప్రతి దశ ఆత్మ శాంతి కోసం ఒక భాగంగా భావించబడుతుంది. ఈ క్రమంలో మృతదేహానికి కాళ్లు కట్టే ఆచారం కూడా శతాబ్దాలుగా కొనసాగుతోంది.
ఆత్మ శరీర బంధం…
మరణం సంభవించిన వెంటనే ఆత్మ శరీర బంధం నుంచి విడిపోతుందని శాస్త్రాలు చెప్పినా, శరీరం, కుటుంబంపై ఉండే మమకారం వెంటనే తొలగిపోదని నమ్మకం ఉంది. ఆ మమకారం వల్ల ఆత్మ తిరిగి శరీరంలోకి ప్రవేశించాలనే ప్రయత్నం చేస్తుందనే అభిప్రాయం ఉంది. ఈ పరిస్థితిని నివారించేందుకు మృతదేహానికి కాళ్లు కడతారు. కాళ్ల బొటనవేళ్లను కలిపి కట్టడం వల్ల శరీరంలోని మూలాధార చక్రం గట్టిపడుతుంది. ఈ చర్యతో ఆత్మకు శరీరంతో ఉన్న అనుబంధం తగ్గి, మోక్షం వైపు ప్రయాణం ప్రారంభించేందుకు సులభతరం అవుతుందని నమ్ముతారు.
కాళ్లు కట్టే ఆచారం…
మూలాధార చక్రం మన ప్రాణశక్తికి మూలం అని పండితులు చెబుతారు. కాళ్లు కట్టే ఆచారంతో ఈ చక్రం స్థిరంగా ఉండటమే కాకుండా, ఆత్మకు భౌతిక శరీరంపై ఉండే బంధం పూర్తిగా తొలగిపోతుంది. దీని ఫలితంగా ఆత్మ యమలోకానికి నిర్బంధం లేకుండా చేరుకుంటుందనే విశ్వాసం ఉంది. ఈ విధంగా చూసినప్పుడు కాళ్లు కట్టడం కేవలం ఆచారంగా కాకుండా, ఆత్మ విముక్తికి దారి చూపే ప్రక్రియగా భావించబడుతుంది.
కాళ్ల బొటనవేళ్లను…
శాస్త్రీయ కోణంలో కూడా ఈ ఆచారం ఒక అవసరంగా ఉంది. మరణం తర్వాత మనిషి శరీరంలోని కండరాలు క్రమంగా బలహీనమై సడలిపోతాయి. ముఖ్యంగా కాళ్లు వదులుగా మారి పక్కకు పడే అవకాశం ఉంటుంది. మృతదేహాన్ని తరలించే సమయంలో ఈ పరిస్థితి ఇబ్బందికరంగా మారవచ్చు. అందుకే కాళ్ల బొటనవేళ్లను కట్టడం ద్వారా శవం ఒకే స్థితిలో ఉంచుతుంది. అంత్యక్రియల ఏర్పాట్లు కూడా ఈ విధానం వల్ల సులభతరం అవుతాయి.
ఇంకా ఒక విశ్వాసం ప్రకారం, చనిపోయిన వ్యక్తి దేహం మీద చెడు శక్తులు ప్రభావం చూపకుండా ఉండటానికీ కాళ్లు కట్టడం చేస్తారని కొందరు భావిస్తారు. శరీరం స్తబ్ధంగా, ఒకే స్థితిలో ఉండటం వలన ఎటువంటి బయటి ప్రభావం కలగదని నమ్మకం ఉంది.


