శ్రీశైలం సమీపంలోని ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకునేందుకు భక్తులు పోటెత్తుతుంటారు. కానీ అమ్మవారి దర్శనానికి వెళ్లేందుకు ఫారెస్ట్ శాఖ ఇచ్చే టికెట్లు తీసుకోవటంతో పాటు ఎన్నో రూల్స్ పాటించాలనే విషయం మీకు తెలుసా?
చాలా జాగ్రత్తగా, భక్తి శ్రద్ధలతో చేయాల్సిన ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనంలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా నల్లమల అడవుల్లో తప్పిపోతారు. ఇందుకు తాజా ఉదాహరణే భక్తులకు కనువిప్పుగా మారాలి.
దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన శ్రీ ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయ సందర్శనార్థమై వెళ్లిన భక్తులు బుధవారం ఉదయం శ్రీశైలం అటవి ప్రాంతంలో తప్పిపోయారు. బాపట్ల జిల్లా నిజాంపట్నానికి చెందిన 15 మంది భక్తులు అటవి ప్రాంతంలో దారి తప్పిపోయారు. ఇష్టకామేశ్వరి అమ్మవారిని దర్శించేందుకు కాలినడకన వెళ్లిన భక్తులు ఉదయం 11 గంటల సమయంలో తప్పిపోయి సాయంత్రం 4 గంటలకు 100కు కాల్ చేశారు. సురక్షితంగా తీసుకొని వచ్చేందుకు ప్రకాశం జిల్లా అటవీ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రేంజర్ ఆరిఫ్ ఖాన్ ఆధ్వర్యంలో సిబ్బంది దట్టమైన నల్లమల అటవి ప్రాంతంలోకి చేరుకొని వారిని సురక్షితంగా శ్రీశైలం చేరేలా ప్రయత్నాలు చేశారు.
పిల్లలు, పెద్దవాళ్లతో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు మరింత జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖ పదేపదే హెచ్చరిస్తోంది.