రాష్ట్ర దేవదాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్. కరికాల్ వళవన్ స్థానిక భ్రమరాంబా అతిథిగృహంలోని సమావేశమందిరంలో క్షేత్రానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ సంబంధి అంశాలను సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్షేత్రాన్ని సందర్శించే భక్తుల సౌకర్యాల కల్పనకుగాను అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలన్నారు. రోజురోజుకు పెరుగుతున్న భక్తులరద్దీ కనుగుణంగా ఆయా ఏర్పాట్ల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు..
ముఖ్యంగా ఈ సమీక్షా సమావేశంలో దేవస్థానం ముఖద్వారం నుంచి శ్రీశైలం వరకు రహదారి విస్తరణకు చేయవలసిన స్థలసేకరణ విషయాన్ని గురించి చర్చించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగాను మరియు క్షేత్ర సుందరీకరణకు పచ్చదనాన్ని మరింతగా
పెంపొందించాలన్నారు. క్షేత్ర పరిధిలో విరివిగా మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టాలన్నారు.
సమావేశానికి ముందు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దేవస్థానం గో సంరక్షణశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గో సంరక్షణకు దేవస్థానం తీసుకుంటున్న చర్యలను కార్యనిర్వహణాధికారి వారు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వారికి వివరించారు. తరువాత వారు గో సంరక్షణశాలలో విభూతి తయారీని శీలించారు. అనంతరం గోసంరక్షణశాలలో కదంబం మొక్కను నాటారు.
కాగా మాస్టర్ ప్లాన్ సమీక్షా సమావేశంలో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు వి. రామకృష్ణ, మురళీధర్ రెడ్డి, ఇంచార్జి డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు చంద్రశేఖరశాస్త్రి, పి.వి.సుబ్బారెడ్డి, హార్టికల్చరిస్ట్ అధికారి లోకేష్. సహాయ స్థపతి ఐ.ఎన్. వి. జవహర్, సంబంధిత అసిస్టెంట్ ఇంజనీర్లు పాల్గొన్నారు. అదేవిధంగా సంరక్షణశాల పరిశీలనలో ఇంజనీరింగ్ అధికారులతో పాటు గో సంరక్షణ విభాగపు పర్యవేక్షకులు బి. శ్రీనివాస్, గోశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.