శ్రీశైలం, (తెలుగుప్రభ): శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ ఆలయ ప్రాంగణంలోని నందీశ్వరస్వామి (శనగల బసవన్న స్వామి) వారికి మంగళవారం విశేష పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రతి మంగళవారం, త్రయోదశి పర్వదినాల్లో దేవస్థానం సర్కారీ సేవగా ఈ విశేష కైంకర్యాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రదోషకాలమైన సాయంసంధ్యా సమయంలో జరిగే ఈ పూజల్లో భాగంగా తొలుత దేశం శాంతిసౌభాగ్యాలతో వర్ధిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు కలగాలని అర్చకస్వాములు, వేదపండితులు సంకల్పం చేశారు.
అనంతరం మహాగణపతి పూజ నిర్వహించి, నందీశ్వరస్వామికి పంచామృతాలు, వివిధ ఫలోదకాలు, హరిద్రోదకం, కుంకుమోదకం, గంధోదకం, భస్మోదకం, రుద్రాక్షోదకం, బిల్వోదకం, పుష్పోదకం, సువర్ణోదకంతో పాటు మల్లికాగుండంలోని పవిత్ర జలంతో విశేష అభిషేకాలు జరిపించారు. అనంతరం అన్నాభిషేకం నిర్వహించి, వృషభసూక్తం తదితర వేదమంత్రాల నడుమ స్వామివారికి నూతన వస్త్రాలు సమర్పించి విశేష పుష్పార్చనలు చేశారు.
ప్రత్యేకంగా నానబెట్టిన శనగలను నందీశ్వరస్వామికి సమర్పించి చివరగా నివేదన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పూజల ద్వారా దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు సంభవించకుండా, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని లోకక్షేమాన్ని కాంక్షిస్తూ ప్రార్థనలు చేశారు.

