శ్రీశైలంలో ఈ నెల 30న శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవస్థాన అనుబంధ దేవాలయమైన శ్రీ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో సీతారామచంద్ర స్వామివార్ల కల్యాణోత్సవం జరిపించనున్నారు.
ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ఉదయం నుండి సీతారాముల వారికి, ఆ తరువాత ఆంజనేయస్వామి వారికి విశేష పూజాదికాలు జరుపుతారు. తరువాత ఉదయం గం. 9.00 నుండి సీతారాముల కల్యాణోత్సవం ప్రారంభమవుతుంది. ఈ కల్యాణమహోత్సవంలో ముందుగా లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ సంకల్పం పఠిస్తారు. తరువాత కల్యాణోత్సవం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ చేస్తారు.
అనంతరం వృద్ధి, అభ్యుదయాలను కాంక్షిస్తూ పుణ్యావచనం, కంకణపూజ, కంకణధారణ, యజ్ఞోపవీతపూజ, యజ్ఞోపవీతధారణ, నూతన వస్త్ర సమర్పణ, వరపూజ, ప్రవర పఠన, గౌరీపూజ, మాంగల్య పూజ, శ్రీ సీతాదేవివారికి మాంగల్యధారణ, తలంబ్రాలు మొదలైన కార్యక్రమాలతో సంప్రదాయ బద్దంగా సీతారామ కల్యాణం జరిపుతారు.