లోక కల్యాణం కోసం దేవస్థానం ఆలయ ప్రాంగణంలోని శ్రీసుబ్రహ్మణ్యస్వామి (కుమారస్వామి) వారికి విశేష పూజలను నిర్వహించారు. ప్రతి మంగళవారం, కృత్తికానక్షత్రం, షష్ఠి తిథి రోజులలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారికి ఈ విశేష అభిషేకం-పూజాదికాలు దేవస్థానం సేవగా (సర్కారి సేవగా) నిర్వహిస్తున్నారు. కుమారస్వామి వారికి పూజలు జరపడం వలన లోక కల్యాణమే కాకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగ, వ్యాపార, వ్యవహారాలలో ఆటుపోట్లు తొలగి ఆయా పనులు సక్రమంగా జరుగుతాయి. సుబ్రహ్మణ్య స్వామి. అనుగ్రహంతో శత్రు బాధలు, గ్రహ పీడలు, దృష్టి దోషాలు మొదలైనవి తొలగి పోతాయి. అలాగే సంతానం కోసం పూజించే వారికి తప్పక సంతాన భాగ్యం లభిస్తుంది. ఈ అభిషేకానికి ముందుగా దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, పాడి సమృద్ధిగా ఉండాలని, జనులకు ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని సుఖశాంతులతో ఉండాలంటూ అర్చకస్వాములు సంకల్పాన్ని పఠించారు.