మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు ఉదయం నుంచే ఆలయాలకు భారులు తీరారు. సూరారం ఉమామహేశ్వర ఆలయంలో పెద్దలు, పిల్లా పాపలతో కలసి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శివుణ్ణి దర్శించుకుని, గణపతి పూజ, శివాభిషేకం, పంచామృత, అభిషేకాలు,అర్చనలు నిర్వహించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. నిరాకారుడు, నీలకంఠుడు అయిన ఆ పరమేశ్వరుని కొలవడం ద్వారా మానసిక ప్రశాంతత లభించడమే కాకుండా కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.
ఆలయ ధర్మకర్త ముద్దాపురం మధన్ గౌడ్ మాట్లాడుతూ ఈ ఆలయానికి కొండ మీద పెద్ద గుండి ఉండేదని, 200 సం.క్రితం ఈ గుండుకి పిడుగు పడి పెద్ద సొరంగం ఏర్పడింది. ఆ సొరంగ మార్గం మీద ఏక శిలా విగ్రహం ఏర్పాటు చేశారన్నారు. శివుడు, ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందన్నారు. సొరంగ మార్గం ద్వారా వెళ్లి భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారన్నారు.
ఎక్కడాలేని విధంగా అనగా అన్ని ఆలయాలలో శివరాత్రి రోజే కళ్యాణం జరిగితే, సూరారం ఉమామహేశ్వర స్వామి ఆలయంలో మాత్రం శివరాత్రికి రెండు రోజుల ముందు వార్షికోత్సవం జరుగుతుందని, రెండు రోజుల ముందే ఉమామహేశ్వర్ల కళ్యాణం జరుగుతుందన్నారు. ఈ కళ్యాణానికి హంపి పీఠాధిపతులు వస్తారన్నారు. భక్తులకు సౌకర్యార్థం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారన్నారు.
శనివారం రోజున ఉపవాస దీక్ష విరమించిన భక్తులకు అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు. శివరాత్రి రోజున జాగారం చేసే భక్తులకు ఎన్నో సాంసృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈ మహాశివరాత్రి రోజున ఆలయంలో భక్తులకు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పర్యవేక్షించారు సూరారం పోలీస్ సిబ్బంది. జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.