Thursday, February 20, 2025
HomeదైవంSuryapeta: కేసారంకు దేవరపెట్టె తరలింపు

Suryapeta: కేసారంకు దేవరపెట్టె తరలింపు

చంద్ర పట్నం స్వామి వారి కల్యాణం

పెద్దగట్టు జాతరలో ప్రధాన ఘట్టం అయిన చంద్ర పట్నం మంగళవారంతో ముగిసింది. గత మూడు రోజుల క్రితం ప్రారంభమైన జాతరలో మంగళవారం చంద్రపట్నం వేసిన బైకాని వారు, లింగమంతులస్వామి, మాణిక్యమ్మల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ తంతుతో జాతరలో ప్రధాన ఘటం పూర్తి అయినట్లే స్వామివారి కల్యాణం, చంద్ర పట్నం, ఘటాన్ని తిలకించేందుకు యాదవ భక్తులు మంగళవారం ఉదయం నుంచే పెద్దగట్టుకు పోటెత్తారు. కల్యాణం అనంతరం భక్తుల దర్శనార్ధం దేవర పెట్టేను లింగ మంతుల స్వామి, చౌడమ్మ ఆలయాల మధ్యన ఉంచారు. బుధవారం దేవాలయ శాఖ ఆధ్వర్యంలో యాదవ కుల పెద్దలు నెలవారం కార్యక్రమం నిర్వహించనున్నారు.

- Advertisement -

ఘనంగా చంద్రపట్నం, స్వామి వారి కల్యాణం:

పెద్దగట్టు జాతరలో ప్రధాన అంశమైన చంద్రపట్నం కార్యక్రమం మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. యాదవ సాంప్రదాయ ప్రకారం గొల్ల హక్కుదారులు తమ అందుకే ఆశ్రితులైన బైకాని వారితో చంద్ర పట్నం వేయించారు. ముందుగా బైకాని వారు వాయిద్యాలు వాయిస్తూ కథాగానం చేస్తూ చంద్రపట్నం వేసే ప్రాంతాన్ని శుభ్రపర్చి మైశాచి పొగ వేశారు. ఆ ప్రాంతంలో దీర్ఘచతురస్రాకారంలో చందనం చల్లారు. ఈ చందనం, నగిష చెక్కల పలకలపై పసుపు, కుంకుమ, తెల్ల పిండి, పచ్చపిండిలను అద్ది పదహారు గదుల చంద్ర పట్నం పరిచారు. బైకాని వాయిద్యాల మధ్య చంద్ర పట్నం మీదికి దేవరపెట్టెను తెచ్చి చంద్రపట్నంపై రెండు పోలు ముంతలు పెట్టి, పోలుదారం చుట్టారు. వాటి ముందు రెండు మట్టి కంచుడులు పెట్టి నువ్వుల నూనె పోసి వత్తులు పెట్టి జ్యోతిలు వెలిగించారు. అనంతరం చంద్రపట్నం ముందు రుమాలు పరిచి బియ్యంతో బైరవ, పోతరాజులకు వేర్వేరుగా పోలువేశారు. బైరవ పోలుపై తొమ్మిది కుండులు పోతరాజుపై కూడ కుండలు పెట్టారు. ఆ సమయంలో మెంతబోయిన వారు చంద్ర పట్నం ముందు అవసరాలను ఎత్తారు. అనంతరం లింగ మంతుల స్వామి మాణిక్యమ్మ కల్యాణంను ఘనంగా నిర్వహించారు. కల్యాణానికి అవసరమైన దుస్తులు, వస్తువులు ఇతర పదార్థాలు మొన్న, మెంతబోయిన వారు సమకూర్చగా బైకానీ వారు పూజారులుగా వ్యవహరించారు. అనంతరం యాదవుల ఆచారం ప్రకారం గొల్ల కులం పుట్టుక, వృత్తాంతం లింగమంతుల స్వామి మాణిక్యమ్మ చరిత్రను కూడా తెలిసే ఆ బైకాని వారు పాటలు పాడారు. దీంతో చంద్రపట్నం, స్వామి వారి కల్యాణం ముగిసింది. అనంతరం మెంతబోయిన వారు డప్పు చప్పుళ్లు, బేరీ నృత్యాలతో ఊరేగింపుగా కేసారంకు వెళ్లారు.

కొనసాగుతున్న భక్తుల రాక

పెద్దగట్టు లింగా మాంతుల జాతర ప్రారంభమై మూడు రోజులవుతున్నా భక్తులు మాత్రం ప్రతి రోజు తిరుగుతూనే ఉన్నారు. ఉదయం వేళలో వస్తున్న భక్త జనం, సాయంత్రం వరకు ఆలయం కింది ప్రాంతాలు గట్టుపై ఆలయాలు ముందు నిండిపోతున్నారు. ఓ లింగ… ఓ లింగా.. నామస్మరణతో లింగమంతుల స్వామి చౌడమ్మలకు మొక్కులు చెల్లించుకునేందుకు పోటెత్తుతున్నారు. సూర్యాపేట పట్టణం నుండి అన్ని వైపులా వాహనాలు పెద్దగట్టుకు వస్తున్నాయి. ఒక పక్క బస్సులు, ట్రాక్టర్ లు, ప్రైవేటు వాహనాలు, సొంత వాహనాలతో భక్తులు పెద్దగట్టుకు చేరుకుంటున్నారు. గత రెండు రోజులుగా జాతరకు రాలేని భక్తులు మంగళవారం గంపల ప్రదక్షిణ చేయడం, బోనాలు సమర్పించడం, దేవతా మూర్తులకు జంతు బలి ఇచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులు హాజరైనా, సాయంత్రం తర్వాత సమీప పట్టణాలు, గ్రామాల్లోని భక్త జనం పెద్దగట్టుకు లైన్లు కడుతున్నారు. లింగమంతుల స్వామి చౌడమ్మలను ఎంచుకోవడం అటు నుండి ఎగ్జిబిషన్ వైపు వెళ్లడం కొనసాగుతుంది.

నేడు నెలవారం

పెద్దగట్టు జాతర నాలుగో రోజైన బుధవారం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నెలవారం కార్యక్రమం నిర్వహించనున్నారు. నెలవారీ కార్యక్రమం తర్వాతి రోజు దేవరపెట్టి, మకర తోరణాలు తరలింపుతో జాతర పరివర్తనం అవుతుంది. గత మూడు రోజులుగా జరుగుతున్న జాతరకు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు, ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల నుంచి భక్తులు రాక కొనసాగుతుండగా భక్తులు హాజరవుతున్నారు.

ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ కోలపల్లి నరసయ్య యాదవ్, ఈవో కుశలయ్య, మంతబైన, వర్ల వంశస్థులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News