Meditation: “ఈ సృష్టిలో కొన్నింటికి ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. వేణుమాధవుడి మురళీ గానానికి గోవులు గోపాలుడి చుట్టూ చేరతాయి. పచ్చని కొమ్మలు కోకిల పాటలు వినడానికి క్షణకాలమైనా చెవులు రిక్కించి ఉంటాయి. ఇవన్నీ శ్రవణానందంతో జరిగే ధ్యానాత్మక ప్రక్రియలు. భరతఖండం గడ్డమీద కొంతమంది శ్రవణం చేస్తూ మోక్షప్రాప్తి పొందినవారూ ఉన్నారు.
ధ్యానంలో వినిపించే ప్రణవ నాదానికి ఆకాశంలోని కాస్మిక్ శక్తులు జమగూడి బ్రహ్మరంధ్రం ద్వారా సాధకుడిలోకి ప్రవేశిస్తాయి.
మానవ శరీరంలోని రుగ్మతల్ని తరిమి కొడతాయి. మట్టిపెడ్డల కింద విత్తనం తపస్సు చేస్తుంది. వాన దేవుడి కరుణ వల్ల అది మొలకై మొలుస్తుంది.ఎదుగుతున్న దశలో మొక్కకు అప్పుడ ప్పుడు చారెడు నీళ్లు పోసిన మనిషికి అది జన్మంతా ఋణపడి ఉంటుంది. బదులుగా దాని బతుకు పొడుగునా చాకిరీ చేస్తుంది. పూజకు పూలిస్తుంది. వ్యాధుల నివారణకు ఔషధమై నిలుస్తుంది. ప్రాణ వాయువు అందిస్తూ జీవితాలు నిలబెడుతుంది. మనిషైనా, మానైనా ధ్యానం వల్లే ఉన్నత స్థాయికి ఎదిగేది. ఇంటి ముందు తులసి, తోటలో పూల మొక్కలు, పెరటిలో మరెన్నో చెట్లు…
ఇలా అనాదిగా మనిషికి, చెట్టుతో విడదీయలేని బంధం! ”
అనాదిగా మనిషికి చెట్టుతో విడదీయరాని బంధం
మట్టిపెడ్డల కింద విత్తనం తపస్సు చేస్తుంది. వాన దేవుడి కరుణ వల్ల అది మొలకై మొలుస్తుంది. ఎదుగుతున్న దశలో మొక్కకు అప్పుడప్పుడు చెంబెడు నీళ్లు పోసిన మనిషికి అది జన్మంతా ఋణపడి ఉంటుంది. బదులుగా దాని బతుకు పొడుగునా చాకిరీ చేస్తుంది. పూజకు పూలిస్తుంది. వ్యాధుల నివారణకు ఔషధమై నిలుస్తుంది. ప్రాణవాయువు అందిస్తూ జీవితాలు నిలబెడుతుంది. ఎండాకాలంలో నీడ ఇస్తుంది. వానల కాలంలో వర్షాలు కురిపిస్తుంది. చెట్టు నిండా పండ్లతో ఆకలి తీరుస్తోంది. కొమ్మలు ఆరబెట్టి కిటికీలు, దర్వాజాలతో ఇల్లై నిలబడుతుంది. పొయ్యిలోకి కట్టెలనిస్తుంది. అంతిమంగా బూడిదై గిన్నెల అంట్లు తోముతుంది. మానవాళికి ఇంతగా సేవలందించే చెట్టు మాత్రం లాభ నష్టాల బేరీజు వేసుకోదు. కారణం, దానికి ఆలోచించే శక్తి లేదు. కనుక అదీ దాని మంచికే అనుకోండి! ఎందుకంటే, ఎలాంటి యోచన లేని చోట ధ్యానం బాగా కుదురుతుంది. అందువల్లే ” చెట్లు ఎల్లప్పుడూ ధ్యానంలో ఉంటాయి” అనేవారు ప్రఖ్యాత తత్వవేత్త ఓషో. మనిషైనా, మానైనా ధ్యానం వల్లే ఉన్నత స్థాయికి ఎదిగేది. ఇంటి ముందు తులసి, తోటలో పూల మొక్కలు, పెరటిలో మరెన్నో చెట్లు… ఇలా మనిషికి, చెట్టుతో విడదీయలేని బంధం ఉంటుంది.
జగత్తులో బ్రహ్మానందం కన్న మించింది లేదు
ఏడాదిపాటు చేసిన సేవలకు పులకించిన ప్రకృతి వసంత ఋతువులో చెట్టును సన్మానిస్తుంది. అప్పుడు చెట్లన్నీ వసంతోత్సవం జరుపుకొంటాయి. చెట్టులాగే మానవ జన్మలో ధ్యానం పిండ దశలోనే మొదలవుతుంది. తల్లి గర్భంలో శిశువు అవయవాలు ధ్యాన మహత్తు వల్లే పరిపూర్ణంగా రూపుదిద్దుకుంటాయి. తొమ్మిది నెలల కాలంలో కడుపులోపల బిడ్డ కళ్లు తెరవదు. అది ప్రకృతి నియమం. కావాల్సిన సరకులన్నీ ఇంటిలోనే బాగా ఉన్నప్పుడు ఎవరైనా బయటకు వెళతారా ? లేదు. కదా! జగత్తులో బ్రహ్మానందం కన్నా మించింది ఏదీ లేదు.
ప్రణవ నాద శ్రవణంతో సాధకునిలో కాస్మిక్ శక్తుల జాగృతం
సృష్టిలో కొన్నింటికి ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. వేణు మాధవుడి మురళీ గానా నికి గోవులు గోపాలుడి చుట్టూ చేరతాయి. పచ్చని కొమ్మలు, కోకిల పాటలు వినడానికి క్షణకాలమైనా చెవులు రిక్కించి ఉంటాయి. ఇవన్నీ శ్రవణానందంతో జరిగే ధ్యానాత్మక ప్రక్రియలు. భరత ఖండం గడ్డ మీద కొంత మంది శ్రవణం చేస్తూ మోక్ష ప్రాప్తి పొందినవారూ ఉన్నారు. ధ్యానంలో వినిపించే ప్రణవ నాదానికి ఆకాశంలోని కాస్మిక్ శక్తులు జమగూడి బ్రహ్మరంధ్రం ద్వారా సాధకుడిలోకి ప్రవేశిస్తాయి. మానవ శరీరంలోని రుగ్మతల్ని తరిమి కొడతాయి. వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి.
సంగీత ప్రక్రియలలో వ్యాధుల నుండి ఉపశమనం కల్పిస్తున్న స్వామీజీలు, గాయకులు
అందుకే దత్త పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి తమ నాదచికిత్స ప్రక్రియలతో ఎందరికో ఎన్నో వ్యాధుల నుండి ఉపశమనం గావించారు. సుందర చైతన్య ఆశ్రమ అధిపతులు, జ్ఞానబ్రహ్మ శ్రీ శ్రీ శ్రీ సుందర చైతన్యానంద స్వామి వారు తమ జ్ఞాన యజ్ఞాల్లో సంగీత గాన వాహిని లో భక్తులను అలరిస్తూ నిరంతరం వారిలో ఆధ్యాత్మికజ్ఞానచైతన్యాన్ని కలిగిస్తూ ముక్తి పథాన నడిపించవచ్చని ఋజువు చేస్తున్నారు. సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసులు శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ‘సంగీత ప్రక్రియలతో చికిత్సలూ చేయవచ్చు’ అనేవారు.
ధ్యానంతో ప్రశాంతత, జీవితాశయం సాధ్యం
ఏకకాలంలో అనేక పనులను తక్కువ సమయంలోనే చేసి ఎక్కువ ఆస్తులు కూడబెట్టాలన్న అత్యాశ. మనిషి కి అంత మంచిది కాదు. పరుగుల పందెం లాంటి జీవితం ప్రాకృతిక మైన ప్రామాణికం కాదు. అది సహజ జీవన విధానా నికి పూర్తిగా భిన్నమైంది. దానివల్ల అనేక అనర్థాలు సంభవిస్తాయి. సంభవిస్తు న్నాయి కూడా. జీవన పయనంలో ఆతృతగా పరుగెత్తడం వల్ల కలిగే ఆయాసం తో ఆగిపోవడం తప్పదు. తద్వారా పూర్తిచేయాల్సిన కార్యాలన్నీ అర్ధాంతరంగా నిలిచి పోతాయి. జీవితాశయం నెరవేరదు. చివరికి మిగిలేది నిరాశ నిస్పృహలు. ఫలశూన్యం. అందుకే ధ్యానాత్మక జీవితం సర్వోన్నతం అంటున్నాయి మన శాస్త్రాలు.
“సాహిత్య కళా విభూషణ్” చౌడూరి నరసింహారావు
ప్రవచన కర్త, ఆధ్యాత్మిక విశ్లేషకులు

