2025 Tholi Ekadashi Pooja: హిందువులకు తొలి ఏకాదశి ఎంతో ప్రత్యేకం. ఆషాఢంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశినే తొలి ఏకాదశిని లేదా దేవశయని ఏకాదశని అంటారు. ఈరోజు నుండే లోకరక్షకుడైన శ్రీమహావిష్ణువు నాలుగు నెలలపాటు యోగనిద్రలోకి వెళతారు. ఈ కాలాన్నే చాతుర్మాసం అంటారు. ఈ రోజే తొలి ఏకాదశి. ఇవాళ విష్ణుమూర్తిని పూజించడం వల్ల మీరు అన్ని పాపాల నుండి విముక్తి పొందుతారు. ఈ తొలి ఏకాదశి పూజా విధానం, ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.
పూజ ఎలా చేయాలి?
ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజామున నిద్రలేచి తల స్నానం చేయాలి. శ్రీహరికి ఇష్టమైన పసుపు రంగు వస్త్రాలు ధరించి.. పూజ గదిని తులసీ పసుపు నీళ్లతో శుభ్రం చేయాలి. అనంతరం లక్ష్మీనారాయణుల పటాన్ని లేదా విగ్రహాలను నీటిగా తుడిచి, కుంకుమ లేదా పసుపు బొట్లతో అలంకరించాలి. ఆ తర్వాత ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలి. ప్రమిదలో మూడు ఒత్తులను ఉంచి.. అందులో నెయ్యి వేసి దీపం వెలిగించాలి. ఆ తర్వాత ”ఓం నమోః నారాయణాయ లేదా ఓం నమోః భగవతే వాసుదేవాయ” పారాయణం చేయండి. పండ్లు, స్వీట్లును విష్ణుమూర్తికి నైవేద్యంగా పెట్టండి. ధూప దీప నైవేద్యాలను సమర్పించిన తర్వాత హారతి ఇవ్వండి. రాత్రంతా శ్రీహరిని ధ్యానిస్తూ..కథలు వింటూ జాగరణ చేయండి.
పాటించాల్సిన నియమాలు ఇవే..
గర్భిణీ స్త్రీలు, పిల్లలు, వృద్ధులు, రోగులు, ఆరోగ్యం సహకరించని వారు ఉపవాసం చేయడం మానుకోండి. ఈరోజున మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండండి. మంచం మీద కూర్చోవడం లేదా పడుకోవడం వంటివి చేయకండి. చింతపండు, ఉలవలు, మినుములు, వెల్లుల్లి, ఉసిరి వంటివి తినకండి.
ఉపవాసాన్ని ఇలా విరమించండి..
ఏకాదశి తర్వాత రోజు ద్వాదశి. ఈ పవిత్రమైన రోజున ఉదయం విష్ణుమూర్తిని ఆరాధించాలి. క్యాలెండర్ చూసుకుని ఆ రోజు ఉపవాసం విరమించండి. అదే సమయంలో బ్రాహ్మణుడికి భోజనం పెట్టి లేదా మీకు తోచిన విధంగా దానం చేయండి. తులసీ నీళ్లను త్రాగడం లేదా బియ్యంతో చేసిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఉపవాస దీక్షను విరమించవచ్చు. ఈ శుభదినాన దగ్గర్లోని విష్ణుమూర్తి ఆలయాలను సందర్శించి పూజలు చేయడం వల్ల మీరు అన్ని పాపాల నుండి విముక్తి పొంది మోక్షం కలుగుతుంది.