Friday, October 18, 2024
HomeదైవంTholi Ekadasi: ప్రాముఖ్యం కలిగిన తొలి ఏకాదశి

Tholi Ekadasi: ప్రాముఖ్యం కలిగిన తొలి ఏకాదశి


వర్షాకాలం మొదలైంది అంటే, తెలుగు మాసాల ఆషాఢ మాసం వచ్చిందనే చెప్పాలి. ఆషాడ మాసాన్ని శూన్యమాసం గా పిలుస్తారు కానీ, నిజానికి ఈ మాసంలోని ఏకాదశితో పండుగలు మొదలవుతాయి. అందుకే దీనిని తొలి ఏకాదశి అని, శయన ఏకాదశి అని ,‘హరి బోధిని’, ‘పేలాల పండుగ’ అని ప్రాంతాన్నిబట్టి వివిధ పేర్లతో పిలుస్తారు.
హిందూ సాంప్రదాయంలో నిజానికి 24 ఏకాదశులు వస్తాయి. ఆషాడ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశిగా ఒక విశిష్టత స్థానాన్ని కల్పించారు. మొదటగా పేర్ల విషయం తీసుకుంటే, పాలకడలి పై శయన భంగిమలోనే చిత్రాల్లో మనం చూసే విష్ణుమూర్తి, ఈనాటి నుంచి నాలుగు నెలలపాటు శయనిస్తాడట. దీన్ని, అందుకే ‘హరి వాసరం’ అనడం కూడా కద్దు. ‘శయన ఏకాదశి’, ‘హరి బోధిని’ అని కూడా అంటారు. ఆ సమయంలో కొందరు ‘చాతుర్మాస్య వ్రతమని’ దీక్ష పాటిస్తారు. నాలుగు నెలలు, పాలు, పెరుగు, ఆకుకూరలు, ఎండు మిరపకాయలు చింతపండు వంటి వాటిని నిషేధిస్తారు. దీని వెనుక మన ఆరోగ్యానికి సంబంధించిన శాస్త్రీయ కారణం కూడా ఉంది. ఈ నాలుగు నెలల కాలంలో వర్షాలు వస్తాయి కాబట్టి, పాలు, పెరుగు వంటి శ్లేష్మాన్ని కలిగించే పదార్థాలను, ఎక్కువగా పురుగులు పట్టే ఆకుకూరలను నిషేధించారు.
ఈ మాసంలో, దాదాపుగా చాలా చిన్నచిన్న పండుగలు ఉన్నాయి. పౌర్ణమి రోజుని ‘గురుపౌర్ణమి‘ గా జరుపుతారు. ఈ మాసంలో చేసే పను లకు కూడా అన్ని మాసాల్లా గానే విశేష ఫలితం ఉంటుంది. ఉదాహ రణకు సముద్రస్నానాలు, దానాలు, జపాలు వంటివి.
తెలుగు మాసాల్లో ఆషాడ మాసం నాలుగవది. పూర్వాషాఢ పౌర్ణమి తిధితో ఆషాడమాసం ప్రారంభమవుతుంది. అంటే పౌర్ణమి తిథినాడు చంద్రుడు పూర్వ లేదా ఉత్తరాషాడ నక్షత్రాలకి దగ్గరగా వచ్చే మాసం. ఇంకో విధంగా చెప్పాలి అంటే విష్ణుమూర్తి శయనించడానికి సన్నద్ధ మయ్యే మాసం. అంతేకాదు ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయిపోయి సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలో కి పయనమయ్యే దక్షిణాయన పుణ్యకాలం మొదలైనట్లు.
గ్రామీణ ప్రాంతాల్లో ఈ మాసం చాలా ప్రత్యేకమైనది. అమ్మవారికి ‘బోనాలు’ సమర్పిస్తారు. ‘బోనాలు’ అంటే భోజనానికి వికృతి. తెలంగాణ ప్రాంతంలో మరీ ఎక్కువగా ఉంటుంది. మహంకాళి అమ్మవారికి తయా రుచేసిన భోజనాన్ని కుండల్లో పెట్టుకుని ఊరేగింపుగా వెళ్లి సమర్పించడ మే బోనాలు. అన్నం ,పెరుగు ,బెల్లం పసుపు ,వేపాకు దీనికి అవసరమై నవి. వర్షాకాలంలో విజృంభించే క్రిమికీటకాదులు నుండి తమని రక్షిం చమని వేడుకుంటూ చేసే ఉత్సవమే బోనాలు.
ఆషాఢ మాస సప్తమి ‘భానుసప్తమి’గా పిలువబడుతుంది. ఉత్తరం నుండి దక్షిణం వైపు కి మూడు నెలల ప్రయాణం కొనసాగి సరిగ్గా మధ్య కి చేరుకుంటాడు సూర్యుడు. ఆ రోజు పగలు ,రాత్రి కూడా సమానంగా ఉంటాయి. ఇది ఈ మాసంలోని మరొక ప్రత్యేకత. ఇలా నిషిద్ధ మాసంగా పిలువబడిన ఆషాడమాసంలో ఇలాంటి చిన్న చిన్నవి ఎన్నో ఉన్నాయి.
వర్షాలు మొదలవడంతో అసలే వ్యవసాయ ఆధారితమైన దేశం కనుక నాట్లు వేయాలి. తొలకరి జల్లులు పడినప్పుడు ఏరువాక చేసుకో వడం కూడా మనకు తెలిసిన విషయమే. ఈ కారణంగానే, కొత్తల్లుడు కొత్త కోడలు వాళ్ళ అత్త గారితో కలిసి ఒక ఇంట్లో ఉండకూడదు అనే ఆచారం పెట్టారు. మొలకలు వేసే సమయంలో యువకులు ఇంటి ధ్యాస పడితే పని సరిగా జరగదు. అందుకే కొత్త అల్లుడు అత్త గారి ఇంటికి వెళ్లకుండా ఉండాలని, కోడలు అత్తవారింట ఉంటే, పొరపాటున గర్భం ధరిస్తే ప్రసవ సమయం నిండు వేసవికాలం అవుతుందని ఇలాంటి ఆచారం మన పెద్దలు పెట్టారు. ఈ కాలంలో వచ్చే చర్మ వ్యాధుల నుంచి కాపాడడానికి గోరింటాకు పెట్టుకునే ఆచారం పెట్టారు.
తొలి ఏకాదశి నాడు ‘గోపద్మ వ్రతం‘ కూడా ఆచరిస్తారు. వ్రతం లేనివారు కనీసం గోవులను పూజిస్తారు. ఇక ఏకాదశి అన్నది అసలు ఎలా మొదలైంది అని తెలుసుకుందాం. కృతయుగంలో మురాసురుడు అనే ఒక రాక్షసుడు (సహజమేగా బ్రహ్మ, శివుడు అసురులకు అనాలో చితంగా వరాలు ఇచ్చేయడం. అంటే దానికి కారణం ఉంటుంది లెండి.) వరగర్వంతో విర్రవీగుతూ మునులను ,రుషులను హింసిస్తూ ఉన్నాడు. అతనితో శ్రీమహావిష్ణువు వెయ్యేళ్ళ పాటు యుద్ధం చేసినా అతని ఓటమి అన్నది జరగలేదు. కార్యకారణ సంబంధం ఉంటుంది కదా బహుశా అందుకోసమే విష్ణుమూర్తి అలసిపోయాడు ఏమో! లేకుంటే ఆయనకు చేత కాక పోవడం ఏమిటి. అలసిపోయిన విష్ణుమూర్తి సేదతీరుతుండగా, ఒక కన్యక ఉద్భవించి ఆ రాక్షసుణ్ణి , అంతమొందించింది అట. బ్రహ్మ వరం అలా ఉందేమో. ఆ కన్యకను ప్రశంసిస్తూ విష్ణువు వరం కోరుకో మని అన్నాడు. తాను ‘విష్ణుప్రియ‘ గా పూజింప బడడం అని కోరుకుంది ఆ కన్య. తధాస్తు అంటూ వరమిచ్చాడు .ఆ కన్యే ‘ఏకాదశి తిధి‘. ఇలా అందరి చేత పూజింపబడుతోంది.
ఏకాదశినాడు ఉపవాసం ఉండి, విష్ణు పారాయణ, అభిషేకాలు, భగవద్గీత పఠనం వంటి వాటిలో మునిగిపోయి ఉండాలి. రాత్రంతా జాగ రణ చేసి ద్వాదశి ఘడియల్లో, ఉపవాస విరమణ చేయాలి. కార్తీక పురా ణంలో అంబరీషుని కధ, దుర్వాస ముని కోపం, అంబరీషునికి ఆయన ఇచ్చిన శాపాన్ని విష్ణుమూర్తి తీసుకుని పది అవతారాలు ఎత్తడం ఈ కథంతా మనకు తెలిసినదే. ఏకాదశి పూజలు పితృదేవతలను కూడా తలచుకోవడం రివాజు. అందుకే దీనికి ‘పెద్దల పండుగ’ అని కూడా పేరు వచ్చింది.
ఏకాదశినాడు ఉపవాసం ఉన్నా, ‘పేల పిండి’ని తినడం అనేది ఆచారంగా ఏర్పరిచారు. దీని వెనుకా ఒక రహస్యం ఉంది. గ్రీష్మరుతువు లో వేసవి తాపానికి తట్టుకుని నిలిచిన వారు, వర్షాకాలంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు తగ్గడంవల్ల, శరీర సమతుల్యం కోసం.. పేలపిండి వేడిని కలగజేస్తుంది కాబట్టి, అదే ప్రసాదంగా నియమం పెట్టారు. పేలపిండి పితృదేవతలకు ఇష్టం అని మరో కారణం కూడా చెబుతారు. జొన్న పేలాల పిండిలో బెల్లం దంచి, ఇంటిలో తయారుచేసుకుంటారు ఆలయా ల్లో కూడా ఇలా తయారుచేసి నైవేద్యాన్ని పంచిపెడతారు.భవిష్యోత్తర పురాణంలో, ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఏకాదశి ప్రాశస్త్యాన్ని వివరించి నట్లుగా చెప్పబడింది. రుక్మాంగదుడు, ఏకాదశి వ్రత మాచరించి రంభ ను కూడా తిరస్కరించి సద్గతిని పొందాడని ఒక కథ బహుళ ప్రచారంలో ఉంది. ఏది ఏమైనా, ఏకాదశి ని చాలామంది మాంసాహారులు కూడా శాకాహారంతో మొదలుపెట్టి, నిష్టగా ఆచరిస్తారు. దీనికి ‘ఉత్థాన ఏకాదశి’ అని మరో పేరు కూడా ఉంది.

  • కామిడి సతీష్‌ రెడ్డి
    (నేడు తొలి ఏకాదశి పండుగ)
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News