సర్వదర్శనానికి వచ్చే భక్తులకు కేవలం 2 నుంచి 3 గంటల్లోగా దర్శన భాగ్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని టీటీడీ నిర్ణయించింది. శ్రీవాణి ట్రస్టు రద్దు చేయాలని నిర్ణయించారు. అయితే ఆ పథకం మాత్రం కొనసాగుతుంది. ఇక్కడ పని చేస్తున్న అన్యమత ఉద్యోగులను ప్రభుత్వానికి అప్పగించనుంది. ఈ మేరకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన సోమవారం జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం వివరాలను బీఆర్ నాయుడు మీడియాకు వెల్లడించారు.
శ్రీనివాస సేతు పైవంతెనకు గరుడ వారధిగా నామకరణం చేయాలని నిర్ణయించాం. తిరుమల డంపింగ్ యార్డులోని చెత్తను 3 నెలల్లో తొలగిస్తాం. తిరుమలలో రాజకీయాలు మాట్లాడకుండా చర్యలు తీసుకుంటాం. ప్రైవేటు బ్యాంకుల్లో నగదును ప్రభుత్వ బ్యాంకుల్లోకి బదలాయిస్తాం. శారదా పీఠం లీజును రద్దు చేసి స్థలాన్ని స్వాధీనం చేసుకుంటాం. నూతనంగా నిర్మిస్తున్న ముంతాజ్ హోటల్ అనుమతులు రద్దు చేస్తున్నాం. తిరుపతి ప్రజలకు ప్రతి నెల మొదటి మంగళవారం దర్శనానికి అవకాశం కల్పిస్తామని ఛైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు. ప్రైవేట్ బ్యాంకులో ఉన్న డిపాజిట్లను తిరిగి ప్రభుత్వ బ్యాంకులోకి మళ్లిస్తాం. అలిపిరి వద్ద టూరిజం శాఖకు కేటాయించిన 20 ఎకరాల స్థలంలో నిర్మించ తలపెట్టిన ముంతాజ్ హోటల్‌ని నిలిపి వేసి ఆ స్థలాన్ని టీటీడీకి అప్పగించాలని ప్రభుత్వాన్ని కోరతాం. స్థానికులకు గతంలో లాగానే మొదటి మంగళవారం దర్శనం కల్పించే విధానాన్ని పునరుద్దరణ చేస్తాం. అన్నప్రసాదంలో భక్తులకు అందించే మెనూలో అదనంగా కొన్ని పదార్థాలు చేరుస్తాం. లడ్డు ప్రసాదంలో వినియోగించే పదార్థాల నాణ్యత పెంపునకు నిపుణులు కమిటీ ఏర్పాటు చేస్తాం. బ్రహ్మోత్సవం బహుమానంగా ఉద్యోగులకు రూ.15,400 అందిస్తాం. టూరిజం శాఖకు కేటాయించే టిక్కెట్ల విధానాన్ని రద్దు చేశామని ఛైర్మన్ బీ ఆర్ నాయుడు వివరించారు.