Tirumala Brahmotsavams: తిరుమల శ్రీవారి ఆలయం శరదృతువు శోభను సంతరించుకుంది. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు వైభవంగా జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు మంగళవారం సాయంత్రం అంకురార్పణ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలకు అధికారికంగా ప్రారంభమైంది.
విష్వక్సేనుడి ఊరేగింపుతో..
బ్రహ్మోత్సవాలకు ముందు స్వామివారి తరపున సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారు ఆలయ మాడవీధుల్లో ఊరేగింపుగా వెళ్లారు. ఈ ఊరేగింపులో స్వామివారి వైభవాన్ని చాటేలా భక్తులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విష్వక్సేనులవారు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. లోపాలను సరిచేసుకుని, ఉత్సవాలను విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు.
అంకురార్పణతో వేడుకల ప్రారంభం..
ఆ తర్వాత ఆలయంలోని యాగశాలలో అంకురార్పణ ఘట్టం కన్నుల పండుగగా జరిగింది. ముందుగా భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి, పుట్టమట్టిలో తొమ్మిది రకాల ధాన్యాలను (నవధాన్యాలు) నాటారు. ధాన్యాలు మొలకెత్తడం ఉత్సవాలు నిర్విఘ్నంగా సాగడానికి శుభసూచకంగా భావిస్తారు. ఈ క్రతువును వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం వైదిక పెద్దలు నిర్వహించారు.
ఈ అంకురార్పణ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేసినట్లు తెలిపారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలను కళ్లుమిరిమిట్లు గొలిపే విద్యుద్దీపాలతో, పూల తోరణాలతో అలంకరించారు. లక్షలాది మంది భక్తులకు స్వామి దర్శనం కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాలు భక్తులందరికీ ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తాయని ఆకాంక్షించారు.


