Tirumalagiri Venkateswara Swamy Temple : తిరుమల కొండపై కొలువైన ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడిని ఒక్కసారి దర్శిస్తే సమస్త పాపాలు పటాపంచలవుతాయని భక్తుల విశ్వాసం. అయితే, సాక్షాత్తూ అదే శ్రీనివాసుని దివ్యతేజస్సుతో, అచ్చం తిరుమలను తలపించేలా ప్రకృతి రమణీయత నడుమ స్వయంభువుగా వెలసిన మరో పరమ పవిత్ర క్షేత్రం మన సమీపంలోనే ఉందని మీకు తెలుసా? ముక్కోటి దేవతలు కొలిచే ఆ దేవదేవుడు భరద్వాజ మహర్షి కోసం ఇక్కడ కొండపై పాదఘట్టనతో కోనేరును ఎందుకు ఆవిర్భవింపజేశాడు? స్వామివారి వెనుకభాగంలో శిలా వల్మీకం (పుట్ట) ఉండటం వెనుక దాగి ఉన్న ఆధ్యాత్మిక రహస్యమేమిటి?
భరద్వాజ మహర్షి తపస్సు – స్వామివారి ఆవిర్భావం : ఎన్టీఆర్ జిల్లా (ఉమ్మడి కృష్ణా జిల్లా) జగ్గయ్యపేటకు కూతవేటు దూరంలో ఉన్న తిరుమలగిరి కొండపై శ్రీదేవి, భూదేవి సమేతంగా వేంకటేశ్వర స్వామి నిత్య పూజలందుకుంటున్నారు. స్థల పురాణం ప్రకారం.. త్రేతాయుగంలో భరద్వాజ మహర్షి దక్షిణ భారత యాత్ర చేస్తూ ఈ కొండపై ఘోర తపస్సు చేశారు. మహర్షి తపస్సుకు మెచ్చిన శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమవగా, ప్రజల కష్టాలను తీర్చేందుకు ఈ కొండపైనే శాశ్వతంగా కొలువై ఉండాలని, కొండపై నీటి వనరును కల్పించాలని మహర్షి వేడుకున్నారు. స్వామి తథాస్తు అనడంతో మరునాడు తెల్లవారుజామునే మహా తేజస్సుతో స్వామివారు ఇక్కడ స్వయంభువుగా వెలిశారు.
పాద ఘట్టన కోనేరు.. వాల్మీకోద్భవుడి విశిష్టత
స్వయంభూ వాల్మీకోద్భవుడు: గర్భాలయంలోని స్వామివారి శిలా రూపం వెనుక పెద్ద శిలా వల్మీకం (రాతి పుట్ట) కలిసి ఉండటంతో స్వామిని ‘వాల్మీకోద్భవుడు’గా కొలుస్తారు. గర్భగుడిలో అడుగుపెట్టగానే తిరుమల శ్రీవారిని దర్శించిన అనుభూతి కలుగుతుంది.
పాదముద్ర కోనేరు: స్వామివారి ఎడమ పాద ఘట్టనతో కొండ తూర్పు దిశలో ఏకశిలపై ఒక పవిత్ర కోనేరు ఏర్పడింది. ఈ నీటిని తీర్థంగా స్వీకరిస్తే రోగభయాలు తొలగుతాయని ప్రతీతి.
ఈ క్షేత్రానికి రక్షకులుగా కొండ పరిసరాల్లో నాలుగు దిక్కులా నాలుగు ఆంజనేయ స్వామి ఆలయాలు ఉండటం విశేషం. పక్కనే ఉన్న ‘మంగొల్లు’ గ్రామం పద్మావతి దేవి నివాసమైన మంగాపురంగా భక్తులు భావిస్తారు.
కల్యాణోత్సవం – దర్శన మార్గం : ఏటా చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు జరిగే కల్యాణ మహోత్సవానికి భక్తులు వేలాదిగా తరలివస్తారు. స్వామిని దర్శిస్తే అవివాహితులకు శీఘ్ర కల్యాణ యోగం పడుతుందని నమ్ముతారు. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై జగ్గయ్యపేట నుంచి 5 కి.మీ, చిల్లకల్లు నుంచి 7 కి.మీ, విజయవాడ నుంచి 75 కి.మీ. దూరంలో ఈ ఆలయం ఉంది. రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

