Mythological Story Of Durgadevi Vahanam: నేడే విజయదశమి లేదా దసరా. ఈ పండుగను చేసేందుకు దేశం మెుత్తం సిద్ధమైంది. ప్రతి ఇంట దుర్గమ్మ కొలువుదీరింది. నవరాత్రుల తొమ్మిది రోజుల అమ్మవారిని నిష్టగా కొలిచిన భక్తులు ఈరోజు మరింత భక్తశ్రద్ధలతో ఆ దుర్గామాతను ఆరాధించనున్నారు. దుర్గామాతను ధైర్యం, బలం మరియు రక్షణకు ప్రతీకగా భావిస్తారు. ఈ పండుగ చేసుకున్నవారికి ఆ తల్లి ఎల్లప్పుడూ సుఖసంతోషాలు, అష్టఐశ్వర్యాలు ఇస్తుందని భక్తుల నమ్మకం. హిందూ మతంలోని ప్రతి దేవత లేదా దేవుడికి ఒక వాహనం ఉంటుంది. అలాగే దుర్గాదేవి వాహనం సింహం అని మనందరికీ తెలుసు. అయితే ఆమె వాహనంగా సింహం ఎందుకు ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
పురాణ కథ
పురాణాల ప్రకారం, అసురుల రాజైన రంభుడుకు, మహిషం(గేదె)కు జన్మించిన కుమారుడు మహిషాసురుడు. అందుకే ఇతడి దేహం సగం ఎద్దు, సగం మనిషి రూపంలో ఉంటుంది. మహిషాసురుడు బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసి మానవులు, దేవతల చేత మరణం లేకుండా వరం పొందుతాడు. ఆ తర్వాత స్వర్గంపై దండెత్తి దేవతలను తరిమికొడతాడు. దీంతో దేవతలందరూ కలిసి వారి శక్తులన్నింటినీ క్రోడీకరించి దుర్గమ్మను సృష్టిస్తారు. ఆమెకు ప్రతి దేవత లేదా దేవుడు తమ శక్తులను, ఆయుధాలను ఇస్తారు. వీటితోపాటు మాతా పార్వతీ తండ్రి అయిన హిమవంతుడు దుర్గాదేవి యుద్ధంలోకి వెళ్లడానికి తన శక్తివంతమైన సింహాన్ని ఇస్తాడు. సింహాన్ని తన వాహనంగా చేసుకుని యుద్ధ భూమికి వెళ్లిన ఆ తల్లి తొమ్మిది రాత్రులు మహిషాసురుడితో పోరాడి అతడిని పదో రోజున సంహరిస్తుంది. అందుకే ఆ అమ్మవారికి మహిషాసుర మర్ధిని అనే పేరు వచ్చింది.
మరొక పౌరాణిక కథనం
మరో ప్రసిద్ధ పురాణం ప్రకారం, శివుడిని చేరుకోవడానికి పార్వతీదేవి ఒకనాడు ధ్యానం చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఆ తల్లి శరీరం నల్లగా మారుతుంది. దీంతో మహాదేవుడు ఆమెను సరదాగా కాళి అని పిలుస్తాడు. అది ఆమెను కలవరపాటుకు గురిచేస్తోంది. దీంతో ఎలాగైనా తన పూర్వ శరీరాన్ని పొందాలని మళ్లీ తపస్సు ప్రారంభిస్తోంది. అదే సమయంలో ఆకలితో ఉన్న సింహం ఆమెను తినాలని వస్తుంది. కానీ ప్రకాశవంతమైన మరియు నిర్మలమైన ఆమె రూపాన్ని చూసి సింహం అక్కడే కూర్చుని ఉండి పోతుంది. పార్వతీ మాత తన తపస్సు ముగించి కళ్లు తెరిచినప్పుడు సింహం కళ్లెదుటే కనిపిస్తోంది. దీంతో ఆ తల్లి సింహాన్ని తన దైవిక వాహనంగా చేయాలని శివుడిని వేడుకుంటుంది. దీంతో ఆయన సరే అంటూ వరమిస్తాడు. అప్పటి నుండి పార్వతీ మాతే దుర్గాదేవిగా సింహాంపై స్వారీ చేస్తూ కనిపిస్తూ ఉంటుంది. సింహం బలం, పట్టుదల మరియు ధైర్యాన్ని సూచిస్తుంది. అందుకే ఆ మాతను ‘సింహవాహిని‘ అని కూడా పిలుస్తారు.


