Nagula Chavithi 2025: నాగులను దేవతగా కొలిచే పండుగ నాగుల చవితి. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఫెస్టివల్ ను చాలా వైభవంగా చూస్తారు. ముఖ్యంగా దీనిని పెళ్లైన మహిళలు తమ పిల్లల దీర్ఘాయుష్షు మరియు శ్రేయస్సు కోసం జరుపుతారు. ప్రతి ఏటా కార్తీక మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథి నాడు ఈ వేడుకను జరుపుకోవడం అనవాయితీ. కర్ణాటకలో కూడా ఈ పండుగను చేసుకుంటారు. ఈ సంవత్సరం నాగుల చవితి ఇవాళ అంటే అక్టోబర్ 25న వచ్చింది.
నాగుల చవితి పూజా ముహూర్తం
కార్తీక శుక్ల పక్ష చతుర్థి తిథి ప్రారంభం – అక్టోబర్ 25, 2025 – తెల్లవారుజామున 01:19 గంటలకు
చవితి తిథి ముగింపు – అక్టోబర్ 26, 2025 – తెల్లవారుజామున 03:48 గంటలకు
నాగుల చవితి పూజ ముహూర్తం – ఉదయం 10:58 గంటల నుండి మధ్యాహ్నం 01:12 గంటల వరకు
నాగుల చవితి ప్రాముఖ్యత
పురాణాల్లో పాములు గురించి ప్రముఖంగా ప్రస్తావించబడింది. విష్ణుమూర్తి శేషనాగుపై విశ్రాంతి తీసుకుంటాడని, శివుడి మెడలో వాసుకీ అనే సర్పం ఉంటుందని, నాగ మాత మానస దేవి శివుడి కుమార్తె అని, తక్షకుడు అనే నాగు పరీక్షిత్తు అనే పాండవ రాజును కాటు వేసిందని.. ఇలా రకరకాల కథనాలు అందుబాటులో ఉన్నాయి. హిందూ మతంలో సర్పాన్ని ఆధ్యాత్మిక శక్తి, పరివర్తన, రక్షణ, జ్ఞానానికి ప్రతీకగా భావిస్తారు. ఈరోజున వివాహిత స్త్రీలు కఠిన ఉపవాసం ఉంటూ తమ పిల్లల కోసం వేడుకుంటారు. ఈరోజున రాహు కేతులను కూడా పూజిస్తారు. శీతాకాలంలో పాములు ఎలుకలను తిని పంటలను రక్షిస్తాయి, అందుకే రైతులు నాగుల చవితిని జరుపుకుంటారు. నాగులను ఆరాధించడం వల్ల రాహు యెుక్క దుష్ర్పభావాలు తొలగిపోతాయి. అంతేకాకుండా పితృదోషం నుండి బయటపడతారు. కాలసర్ప దోషం నుండి కూడా విముక్తి లభిస్తుంది.
Also Read: Mangal Gochar 2025 – నాగుల చవితి తర్వాత సొంత రాశిలోకి కుజుడు.. ఈ 3 రాశులకు గోల్డెన్ డేస్ మెుదలు..
నాగుల చవితి పూజా విధానం
ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజామునే లేచి పవిత్ర స్నానమాచరించండి. పూజ గదిని శుభ్రం చేసి చెక్క పీటను ఏర్పాటు చేయండి. దానిపై నాగ దేవత చిత్ర పటాన్ని ఉంచండి. నెయ్యితో అఖండ దీపాన్ని వెలిగించింది. నువ్వులతో చేసిన చిమ్మిడిని నైవేద్యంగా పెట్టండి. పువ్వులు, పాలు, పసుపు, కుంకుమ, అరటి పండ్లు మెుదలైనవి నాగదేవతకు సమర్పించండి. ఇంట్లో ముందుగా పూజ చేసిన తర్వాత మీ దగ్గరలో ఉన్న పుట్ట దగ్గరకు వెళ్లి, దానిని శుభ్రం చేసి బొట్టు పెట్టండి. తర్వాత ఆ పుట్ట కొలుగులో గుడ్లు, చిమ్మిడి వేసి తర్వాత పాలు పోయండి. దీపారాధన చేసి సాంబ్రాణి పొగ వేయండి. నాగేంద్రుడికి పూజలు చేసి చివరగా బాణసంచా కాల్చి పూజను ముగించండి.


