Navaratrulu 2025 Day 1, Shailaputri Matha Pooja vidhanam: దేవీ నవరాత్రులు నేటి(సెప్టెంబరు 22) నుంచే మెుదలుకానున్నాయి. తొలి రోజు శైలపుత్రి అమ్మవారిని పూజిస్తారు. తల్లి ఎద్దు మీద కూర్చుని ఎడమ చేతిలో పుష్పం, కుడి చేతిలో త్రిశూలాన్ని ధరించి ఉంటుంది. ఈ అమ్మవారిని కరుణ, సహనం, ఆప్యాయతకు చిహ్నంగా భావిస్తారు. త్రిమూర్తులకు ఉన్న అన్ని శక్తులుఈ అమ్మవారికి ఉన్నాయని ప్రజల విశ్వాసం. పైగా శైలపుత్రి అమ్మవారు చంద్రగ్రహానికి అధిపతి. మీ జాతకంలో చంద్ర దోషం ఉంటే ఈ మాతను ఆరాధించడం వల్ల దాని నుండి విముక్తి పొందుతారు. తొలి రోజు పూజ చేసేటప్పుడు పసుపు రంగు దుస్తులు ధరించడం మంచిది. ఎందుకంటే ఇది ఆధాత్మిక మేలుకొలుపును సూచిస్తుంది. తొమ్మిది రోజుల వేడుకకు ఇది మంచి శుభారంభాన్ని ఇస్తుంది. పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం.
పూజా విధానం
ఈరోజున భక్తులు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం ఆచరించాలి. శుభ్రమైన బట్టలు ధరించి ఇంటిలోని పూజా మందిరాన్ని శుభ్రం చేయాలి. అనంతరం ఓ చెక్క పీఠంపై ఎరుపు రంగు వస్త్రాన్ని పరచి దుర్గాదేవి లేదా శైలపుత్ర అమ్మవారి విగ్రహం లేదా ప్రతిమను ప్రతిష్టించాలి. కలశ స్థాపన చేసి అమ్మవారి ముందు నెయ్యితో అఖండ జ్యోతిని వెలిగించాలి. షోడశ ఉపచారాలతో పూజ నిర్వహించాలి. అమ్మవారికి కుంకుమ, తెల్ల చందనం, పసుపు, అక్షతలు, తమలపాకులు, కొబ్బరి సహా మహిళలకు సంబంధించిన అలంకరణ వస్తువులను సమర్పించాలి. దీంతోపాటు తెల్లని పువ్వులు, తెల్లని స్వీట్లు కూడా పెట్టాలి.
Also Read: Festivals in October 2025 -అక్టోబరులో రాబోయే పండుగలు, వ్రతాలు ఏంటో తెలుసా?
ఈ మంత్రాలను పఠించండి..
ఆ తర్వాత శైలపుత్రి అమ్మవారి బీజ మంత్రాలను జపించాలి. అమ్మవారిని పూజించేటప్పుడు ‘ఓం దేవి శైలపుత్రయే నమ:’అనే మంత్రాన్ని పఠించాలి. దీంతోపాటు ‘యా దేవి సర్వభూతేషు శైలపుత్రయే రూపణే సంస్థిత.. నమస్తస్యే..నమస్తస్యే..నమస్తస్యే నమో నమ:’ అనే మంత్రాన్ని ఉచ్ఛారణ చేయాలి. పూజలో అమ్మవారికి పాలు, స్వచ్ఛమైన నెయ్యితో చేసిన పదార్థాలను నైవేద్యంగా పెట్టడం ఉత్తమం. దీని వల్ల ఆ దుర్గాదేవి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. ఆపై హారతి ఇవ్వాలి. సాయంత్రం కూడా ఇదే పద్దతిలో తల్లిని పూజించి హారతి ఇచ్చి అందరికీ ప్రసాదం పంచాలి.
Disclaimer: ఈ కథనంలో ఇచ్చిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము చెప్పలేం. ఈ వార్తను తెలుగు ప్రభ ధృవీకరించలేదు. దీనిని పాటించేముందు ఖచ్చితంగా నిపుణుల సలహా తీసుకోండి.


