Tirumala Temple Reels Ban: కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్ర పవిత్రతను కాపాడేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సంచలన నిర్ణయం తీసుకుంది. శ్రీవారి ఆలయం ముందు, మాడ వీధుల్లో సోషల్ మీడియా రీల్స్, వీడియోలు చిత్రీకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, కేసులు నమోదు చేసి జైలుకు పంపేంత వరకు వెనుకాడబోమని తీవ్రంగా హెచ్చరించింది. ఇటీవల కాలంలో కొందరు యువతీ యువకులు చేస్తున్న వెకిలి చేష్టలు, అసభ్యకర నృత్యాలు స్వామివారి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్న నేపథ్యంలో టీటీడీ ఈ కఠిన వైఖరి అవలంబించింది. ఇంతకీ టీటీడీ ఈ నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన పరిస్థితులేమిటి..? నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయి..?
నిఘా ముమ్మరం, కఠిన చర్యలకు ఆదేశం:
ఇటీవల కాలంలో, శ్రీవారి ఆలయ పరిసరాల్లో, ముఖ్యంగా మాడ వీధుల్లో కొందరు వ్యక్తులు సినిమా పాటలకు నృత్యాలు చేస్తూ, అసభ్యకర రీల్స్ చిత్రీకరించి వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్న ఉదంతాలు టీటీడీ దృష్టికి వచ్చాయి. ఇది ఆధ్యాత్మిక వాతావరణానికి భంగం కలిగించడమే కాకుండా, దేశవిదేశాల నుంచి తరలివచ్చే లక్షలాది మంది భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరుస్తోందని టీటీడీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ నేపథ్యంలో, తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యతను గుర్తుచేస్తూ, ఇకపై ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది.
టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ విభాగానికి ఈ మేరకు కఠిన ఆదేశాలు జారీ అయ్యాయి. ఆలయ పరిసరాల్లో నిరంతరం నిఘా ఉంచి, రీల్స్ లేదా వీడియోలు చిత్రీకరించే వారిని గుర్తించి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడమే కాకుండా, వారికి ఇతర చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని టీటీడీ హెచ్చరించింది. ఫొటోలు, వీడియోలపై ఎప్పటినుంచో ఉన్న నిషేధాన్ని ఇప్పుడు మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు.
ALSO READ: https://teluguprabha.net/devotional-news/debt-relief-spiritual-remedies-in-sravana-month-explained/
భక్తులకు టీటీడీ విజ్ఞప్తి:
తిరుమల ఒక పవిత్ర పుణ్యక్షేత్రమని, ఇక్కడికి వచ్చే భక్తులు ఆ భక్తిభావనకు, ఆధ్యాత్మిక వాతావరణానికి గౌరవం ఇవ్వాలని టీటీడీ కోరింది. ఆలయ నియమాలను పాటించి, క్షేత్ర పవిత్రతను కాపాడటంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేసింది. సోషల్ మీడియాలో లైకులు, వ్యూస్ కోసం చేసే పనులు భక్తుల విశ్వాసాలను దెబ్బతీస్తాయని, ఇలాంటి అనుచిత ప్రవర్తనకు పాల్పడవద్దని సూచించింది.


