తిరుమల తిరుపతి దేవస్థానంలో గత నాలుగేళ్ళలో టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు కల్పించిన వివిధ సేవలు, పలు అభివృద్ధి పనులపై విశ్రాంత సిపిఆర్ఓ టు సియం డా.విజయకుమార్ రచించిన భక్తుల సేవే..స్వామి సేవ అనే పుస్తకాన్ని మంగళవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర దేవాదాయశాఖ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్ధ్యం కొన్నేళ్ళుగా అనేక సేవా కార్యక్రమాలను చేపట్టడం జరుగుతోందని తెలిపారు.
దానిలో భాగంగా గత నాలుగేళ్ళ కాలంలో పూర్వపు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డి,ఇఓ ధర్మారెడ్డిల ఆధ్వర్యంలో అనేక సౌకర్యాలను కల్పించడం జరుగుతోందని తెలిపారు. భక్తుల సేవే భగవంతుని సేవగా భావించి ఇటీవల కాలంలో టిటిడిలో పెద్దఎత్తున భక్తులకు సౌకర్యాలు కల్పించడం జరుగుతోందని పేర్కొన్నారు. ముఖ్యంగా విద్యుత్ బస్సులు ఏర్పాటు చేయడం, టిటిడిలో ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించడం, పవిత్ర ఉద్యానవనాలు, శ్రీవారి కోసం పుష్ప తోట, గోసంరక్షణ శాలల అభివృద్ధి, గోఆధారిత ఉత్పత్తులతో శ్రీవారికి నైవేధ్యం, రికార్డు సమయంలో ఘాట్ రోడ్డు పునర్మిర్మాణం, మరిన్ని అన్నప్రసాద కేంద్రాలు ఏర్పాటు వంటి అనేక రకాల సేవలను అందించడం ద్వారా దేశ విదేశాల నుండి వచ్చే శ్రీవారి భక్తుల మన్ననలు పొందడం జరుగుతోందన్నారు. అటువంటి ప్రపంచ ప్రసిధ్ద పుణ్య క్షేత్రంపై రచించిన ఈపుస్తకాన్నిఆవిష్కరించడం రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రిగా తనకు చాలా సంతోషంగా ఉందని కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత డా.విజయకుమార్ మాట్లాడుతూ గత నాలుగేళ్ళ కాలంలో టిటిడి ట్రస్ట్ బోర్డు అధ్యక్షునిగా వైవి సుబ్బారెడ్డి భక్తుల సౌకర్యార్ధం అనేక సదుపాయాలను కల్పించాలని పేర్కొన్నారు. తాను గతంలో శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ సిఇఓగా కూడా పనిచేయడంతో టిటిడిలో జరుగుతున్న అనేక సేవా కార్యక్రమాలను ప్రజల ముందుకు తీసుకువెళ్ళాలనే ప్రయత్నంలో భాగంగానే ఈ పుస్తకాన్ని తెలుగు, ఆంగ్ల భాషల్లో రచించడం జరిగిందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో పుస్తక రచనలో తోడ్పాటును అందించిన మీడియా ప్రతినిధులు జి.నాగరాజు, కె. జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.