Raksha Bandhan Tradition in Madhya Pradesh: అన్నా-చెల్లెళ్లు, అక్కా-తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే పండగ రక్షా బంధన్. తమ సోదరులు జీవితాంతం తమకు రక్షగా ఉండాలని ఈరోజున వారి చేతికి అక్కాచెల్లెళ్లు రాఖీ కడతారు. దీంతో అన్నదమ్ముల చేతికి అక్కాచెల్లెళ్లు కట్టే రాఖీలు కొత్తపుంతలు తొక్కుతున్నాయి. అయితే, దేశవ్యాప్తంగా పాటించే ఈ రక్షాబంధన్ సంప్రదాయం.. మధ్యప్రదేశ్‌లోని కొన్ని గ్రామాల్లో భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా మధ్యప్రదేశ్‌లోని ఛింద్వాడా జిల్లాలోని గోండు గిరిజన సమాజంలో ఈ సంప్రదాయం భిన్నమైన, అర్థవంతమైన రీతిలో ఆచరిస్తున్నారు. శతాబ్దాలుగా ఇక్కడి గోండు గిరిజన సమాజంలో రక్షాబంధన్‌ను సోదరులకు కాకుండా భర్తలకు, చెట్లకు రాఖీ కట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఇంద్రుడికి భార్య ఇంద్రాణి రాఖీ కట్టినట్లు పురాణాలు చెబుతున్నాయి. ‘పెళ్లంటే బాధ్యత. భార్యకు ఒక రక్షకుడిలా తోడుగా ఉంటానంటూ భర్త చేసే ప్రతిజ్ఞ’ అని గుర్తు చేస్తూ మహిళలు భర్తలకు రాఖీ కడుతుంటారు.
Also Read: https://teluguprabha.net/devotional-news/raksha-bandhan-2025/
భర్త రక్షిస్తాడని..
గోండు గిరిజనుల నమ్మకం ప్రకారం, భర్త జీవితాంతం తోడుగా నిలిచి రక్షణ ఇస్తాడని నమ్ముతారు. అందుకే ఈ పండగ రోజున మహిళలు తమ భర్తలకు రాఖీ కడతారు. ఇది వారి దాంపత్య బంధాన్ని బలోపేతం చేస్తుందని నమ్మకం. అదే సమయంలో, వారు పొలాల్లో పూజలు చేసి పంటలకు, అడవుల్లోని చెట్లకు కూడా రాఖీ కడతారు. తద్వారా ప్రకృతి పట్ల తమ కృతజ్ఞతను వ్యక్తం చేస్తారు.
Also Read: https://teluguprabha.net/devotional-news/varalakshmi-vratham-2025-puja-vidhanam-and-rules-explained/
సొంత హస్తకళా నైపుణ్యంతో దేవ్ రాఖీలు…
ఈ గిరిజనులు తమ సొంత హస్తకళా నైపుణ్యంతో ‘దేవ్ రాఖీ’లను తయారు చేస్తారు. పసుపు రంగు దారం, దూది, ఇతర సహజ వస్తువులతో ఈ రాఖీలను రూపొందిస్తారు. రక్షాబంధన్ రోజున మొదట పూజలు నిర్వహించి, ఈ రాఖీలను పవిత్రం చేస్తారు. ఆ తర్వాత, గ్రామస్తులు పొలాలకు వెళ్లి పంటలకు, అడవుల్లోని చెట్లకు రాఖీ కట్టి, సమృద్ధమైన పంట, పర్యావరణ సంరక్షణ కోసం ప్రార్థిస్తారు. ఈ విశిష్ట ఆచారం గోండు సమాజం యొక్క సాంస్కృతిక వైవిధ్యాన్ని, ప్రకృతి పట్ల గౌరవాన్ని ప్రపంచానికి చాటిచెబుతుంది.


