HomeదైవంShiva Keshava: శివ కేశవులు ఒక్కరే!

Shiva Keshava: శివ కేశవులు ఒక్కరే!

Shiva Keshava: “శివ కేశవులలో రూప భేదమే కానీ స్వరూప భేదం లేదు. తత్వభేదం అసలే లేదు. శివ భక్తులైనా విష్ణుభక్తులైనా ఈ సత్యాన్ని తప్పక గ్రహించాలి. అలా గ్రహించినప్పుడే వారు ఆధ్యాత్మికంగా అభివృద్ధిని సాధించగలరు. విష్ణుభక్తులు ప్రాణప్రదంగా విశ్వసించే విష్ణు పురాణము శివకేశవులు ఒకరేనని, అలాగే శివ భక్తులు ప్రగాఢంగా విశ్వసించే స్కందోపనిషత్తు శివకేశవులు అభేదులని తెలుపుతున్నాయి. అద్భుతమైన అభేద దర్శనాన్ని ఉపనిషత్తులు ఏక శ్రుతితో నిర్విరామంగా ప్రబోధిస్తూ ఉన్నాయి.

- Advertisement -

కానీ కొందరు విజ్ఞులైన వారు బావిలోని కప్పల్లాగా బేధ లోచనములను తగిలించుకొని కొందరు శివకేశవుల మధ్యన భేదాలు సృష్టించే విధంగా మాట్లాడటం వల్ల సనాతన హిందూ ధర్మం లో ఎన్నో దురదృష్టకరమైన సంఘటనలు జరిగాయి. జరుగుతున్నాయి. జగద్గురువులైన మధ్వాచార్యులు, రామానుజాచార్యులు, శంకరాచార్యులు వీరంతా శివకేశవుల మధ్యన బేధం లేదని తమ రచనల ద్వారా తెలియజేశారు. కానీ సంకుచితులైన కొందరు ప్రజలను తప్పుదోవ పట్టించడం వల్ల ఉపద్రవాలు కలుగుతున్నాయి. జ్ఞాన కల్మషాన్ని ప్రచారం చేసి, అమాయకులైన భక్తులను మాయాకూపంలోకి దించడం మరీ శోచనీయం! ఏకం సత్ విప్రాః బహుదావదంతి అని పెద్దలు ఏనాడో చెప్పారు. వివిధ రూపాలలో పిలిచినా “భగవంతుడు ఒక్కడే!” అని వేదమాత ఘోషిస్తుంది. గమ్యము నిరాకారము. మార్గము సాకారము. ఈ విషయాలను గమనించి ఆధ్యాత్మిక సాధకులు ప్రవర్తించాలని శాస్త్రాలు చెబుతున్నాయి.”

గమ్యము నిరాకారము మార్గము సాకారము
భగవంతుడు ప్రేమ సాగరుడు. భక్తుడు ప్రేమమయుడు. భక్తి ప్రేమ స్వరూపము. ప్రేమకు ద్వేషాలు తెలియవు. భేదాలు అర్థం కావు. ప్రేమరూపమైన భక్తిలో ద్వంద్వాలకు తావేలేదు. ద్వైత భావనలో సాధన సాగడం తప్పు కాదు. ద్వేష భావాలతో హృదయాలను సంకుచితం చేసుకోవడమే పెద్ద దోషం. ఈ అజ్ఞాన కల్మషాన్ని ప్రచారం చేసి అమాయకులను మాయా కూపంలోకి దించడం మరీ శోచనీయం! పండితులు ఏకం సత్ విప్రాః బహుదా వదంతి అని ఏనాడో అన్నారు. వివిధ నామాలతో పిలిచినా ఉన్న సద్రూప చైతన్యం ఒక్కటేనని వేదమాత ఘోషిస్తున్నది. గమ్యము నిరాకారము. మార్గము సాకారము. మార్గములో చరించినప్పుడే గమ్యాన్ని చేరగలము. కాని గమ్యము చేరే శుభ సమయంలో మార్గాన్ని విస్మరించక తప్పదు. సాకారము అశాశ్వతమైనది. నిరాకారము శాశ్వతమైనది. ఒకే వ్యక్తి వేరువేరు దుస్తులతో శోభించునట్లుగా, ఒకే పరమాత్మ భక్తుల సాధన సౌలభ్యం కోసం అనేక రూపాలలో గోచరిస్తూ అనుగ్రహిస్తూ ఉంటాడు. అంతమాత్రాన నామరూపాలను వాటేసుకొని బంధాలను అందాలుగా వర్ణించుకోవడం ఆంతర్యంలోని అజ్ఞానానికి ప్రతిరూపమే అవుతుంది.

శివ కేశవ భేదాలు
అద్భుతమైన అభేద దర్శనాన్ని ఉపనిషత్తులు ఏక శ్రుతితో నిర్విరామంగా ప్రబోధిస్తూ ఉంటే, నూతిలోని కప్పల్లాగా భేద సులోచనలను తగిలించుకొని కొందరు గతంలో, ప్రస్తుతం లో కూడా శివకేశవ భేదాలను సమాజంలో తీవ్రంగా ప్రచారం చేశారు. చేస్తున్నారు. సనాతన హైందవ సంస్కృతి వైభవంలో ఇదొక దురదృష్టకరమైన సంఘటన అని చెప్పక తప్పడంలేదు. కానీ ఈ దుస్థితిని హిందూ సమాజం అధిగమించింది అనుకునే లోపే మరల ఈ మధ్య విజ్ఞులైన వారే ఈ విభేదాలను అమాయకులకు నూరిపోస్తున్నారు. ఈ నేపథ్యంలో శివకేశవ భేదాలు అనే శైశవ క్రీడలకు శాశ్వతంగా తెరదించవలసిన అగత్యం ఏర్పడింది. కొందరు అమాయక భక్తులను అనుయాయులుగా చేసుకొని నేడు కూడా శివకేశవ భేదాలు సమాజంలో సృష్టించి, దివ్యంగా ప్రకాశించే హిందుత్వాన్ని అంధత్వం వైపు నడిపించే ప్రయత్నంలో కొందరు సాగుతున్నారు. ఇది దురదృష్టకరమైన పరిణామం.

రూప భేదమే కాని స్వరూప భేదము లేని శివ కేశవులు
శివకేశవులలో రూప భేదమే గాని స్వరూప భేదము లేదు. తత్వ భేదము లేదు. శివ భక్తులైనా విష్ణుభక్తులైనా ఈ సత్యాన్ని గ్రహించినప్పుడే ఆధ్యాత్మికంగా అభివృద్ధిని సాధించగలం. సనాతన హైందవ సంస్కృతి పరిఢవిల్లగలదు. విష్ణుభక్తులు ప్రాణప్రదంగా విశ్వసించే విష్ణు పురాణం ఇలా అంటుంది. శంకరుని ద్వేషించు నా భక్తుడు నన్ను ద్వేషించే శివ భక్తుడు వీరిద్దరూ సూర్యచంద్రులు ఉన్నంతవరకు నరకాన్ని వదలరు. అని విష్ణుదేవుడే స్వయంగా పలికాడు.

ఇక శివ భక్తులు ప్రగాఢంగా విశ్వసించే ‘స్కందోపనిషత్తు’ ఈ విధంగా చెబుతుంది. శివుడు విష్ణు స్వరూపుడు. విష్ణువు శివస్వరూపుడు. శివుని హృదయం విష్ణువు. విష్ణువు హృదయం శివుడు. మనకు నిర్మలమైన హృదయం ఉంటే శాస్త్రాలు బోధించే ఈ నిత్య సత్యాలు అవగతం అవుతాయి. ఆంతర్యములోని భ్రమలు మాత్రమే భేదాలను సృష్టిస్తాయి. భేద దృష్టి, విషమ దృష్టి. ప్రమాదకర దృష్టి. అభేద దృష్టి అమృత దృష్టి. ప్రమోదకరమైన దృష్టి. జ్ఞానమయ దృష్టి. సృష్టిని బ్రహ్మమయంగా దర్శింపజేసే దృష్టి అవుతుంది.

సూర్యుడిలా సమదర్శన యోగులై ప్రకాశించాలి
సూర్యుడు జ్ఞానప్రదాత. వెలుగును ప్రసాదించే దాత. ఆదిత్యుని చక్కగా అవలోకిస్తే మనకు ఒక సత్యం బోధపడుతుంది. సమస్థితి ఆంతర్యంలో వెలుగుతుంది. ఉదయ అస్తమయాలలో ఒకే రంగుతో ప్రకాశించే సూర్యుడు సమస్థితిని ప్రసారం చేస్తున్నాడు. ఆపదలలో సంపదలలో ఒకే విధంగా చరిస్తూ మహాత్ములు తమ ప్రవర్తన ద్వారా సమత్వాన్ని ఆవిష్కరిస్తున్నారు. సాధకులమైన మనము కూడా శివకేశవ భేదాలను విస్మరించి ఏకత్వాన్ని స్మరించి సమదర్శన యోగులై చరిస్తే హైందవ ధర్మం దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది.

కాలమనే నాణానికి కృష్ణాష్టమి, శివరాత్రి బొమ్మా బోరుసు లాంటివి
అందుకేనేమో శివరాత్రి పోయిన ఆరు నెలలకు కృష్ణాష్టమి వస్తే, కృష్ణాష్టమి పోయిన ఆరు నెలలకు శివరాత్రి వస్తుంది. ఒకే సంవత్సరంలో కాలమనే నాణానికి బొమ్మా, బోరుసుల వలె ఈ రెండు పర్వదినాలు గోచరిస్తూ, నాణ్యమైన అద్వైత తత్వాన్ని ప్రసాదిస్తున్నాయి. అందుకే భ్రమల నుండి బయటపడి నామరూపాలను దాటి పోదాం! నామరూపాలకు అతీతమైన పరబ్రహ్మమును స్మరించి తరిద్దాం! శివకేశవ భేదం శాస్త్ర సమ్మతం కాదు. సత్య సమ్మతం కాదు మహర్షుల మార్గం అసలే కాదు. శివకేశవులలోని ఏకత్వాన్ని స్మరిద్దాం! దర్శిద్దాం! సనాతన హైందవ ధర్మ ప్రతిష్టను పరిరక్షిద్దాం! అభేద దర్శనంతో జీవితాన్ని అమృతమయంగా మార్చుకుందాం! శుభమస్తు!

“సాహిత్య కళా విభూషణ్” చౌడూరి నరసింహారావు
ప్రవచన కర్త, ఆధ్యాత్మిక విశ్లేషకులు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News