కర్నూలు జిల్లాలో ప్రసిద్ధి చెందిన ఉరుకుంద గ్రామంలో వెలసిన ఈరన్న స్వామి (నరసింహ స్వామి) ఆలయంలో బుధవారం అమావాస్య సందర్భంగా భక్తజనం పోటెత్తారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుండి వేలాదిగా భక్తులు తరలి రావడంతో ఉరుకుంద క్షేత్రం భక్తజనంతో నిండిపోయింది.
తుంగభద్ర దిగువ కాలువలో పుణ్యస్నానాలు చేసిన భక్తులు, పిండి వంటలతో స్వామికి నైవేద్యాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రత్యేక, అతి శీఘ్ర క్యూలైన్లు అన్నీ కూడా భక్తులతో నిండిపోయాయి. దీంతో స్వామి దర్శనానికి మూడు గంటలకు పైగా సమయం పట్టింది. అమావాస్యను పురస్కరించుకొని స్వామికి ఆలయ అర్చకులు అభిషేకము, ఆకు పూజ, మహా మంగళారతి వంటి పూజలను శాస్త్రబద్ధంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ పాలకమండలి చైర్మన్ నాగరాజు గౌడ్, ఆలయ ఈవో వాణి, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. భక్తుల కోసం ఆంధ్ర-కర్ణాటక ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్ సర్వీసులను ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్సై నరేంద్ర కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తుని ఏర్పాటు చేశారు.