Vastu Vs Kitchen: మన ఇళ్ల నిర్మాణంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఇల్లు నిర్మించేటప్పుడు గదుల ఏర్పాటు, తలుపులు, కిటికీలు, వంటగది, పడకగది అన్నీ వాస్తు నియమాల ప్రకారమే చూసుకుంటారు. ఈ నియమాలలో వంటగది స్థానం, దాని రూపకల్పన, వాడే రంగులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా వంటగదిలో ఉపయోగించే స్లాబ్ రంగు విషయంలో వాస్తు నిపుణులు కొన్ని ప్రత్యేక సూచనలు చెబుతున్నారు.
వంటగదిలో నల్లటి స్లాబ్..
వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలో నల్లటి స్లాబ్ ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. నలుపు రంగు ప్రతికూల శక్తులను ఆకర్షించే స్వభావం కలిగినదని నమ్మకం ఉంది. జ్యోతిష్య శాస్త్రంలో కూడా నలుపు రంగు శని, రాహువులతో సంబంధం ఉన్నదని చెబుతారు. అందువల్ల వంటగదిలో నల్లటి స్లాబ్ అమర్చడం వలన కుటుంబ సభ్యులపై అనవసర ఒత్తిడి పెరుగుతుందని, మానసిక శాంతి తగ్గిపోతుందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రతికూల శక్తిని..
అగ్ని తత్త్వం ఆధారంగా వంట చేస్తారు. ఆహారం తయారయ్యే ప్రదేశంలో ప్రకాశవంతమైన రంగులు సానుకూల శక్తిని పెంచుతాయని, నల్లటి రంగు మాత్రం చీకటి, తమస్సు, ప్రతికూల శక్తిని సూచిస్తుందని విశ్వాసం ఉంది. ఈ కారణంగా వంటగదిలో నల్లటి రంగు వాడకం అనుకూలం కాదని నిపుణులు చెబుతున్నారు.
ఆర్థిక ఇబ్బందులు..
ఇళ్లలో వంటగది స్లాబ్ నల్లరంగులో ఉన్నప్పుడు కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు రావడం, తరచూ గొడవలు జరగడం, ఆరోగ్య సమస్యలు ఎదురుకావడం వంటి పరిణామాలు జరిగే అవకాశం ఎక్కువని వాస్తు నిపుణులు వివరిస్తున్నారు. వంటగది అనేది ఆహారం తయారయ్యే ప్రదేశం కాబట్టి, ఇక్కడి వాతావరణం సానుకూలంగా ఉండటం చాలా ముఖ్యం.
పసుపు లేదా ఆకుపచ్చ రంగు..
అందువల్ల వంటగది స్లాబ్ అమర్చేటప్పుడు క్రీమ్, పసుపు లేదా ఆకుపచ్చ రంగులను ఎంచుకోవాలని సూచిస్తారు. ఈ రంగులు శుభప్రదమైనవిగా పరిగణించబడతాయి. క్రీమ్ రంగు ప్రశాంతతను, పసుపు రంగు సానుకూల శక్తిని, ఆకుపచ్చ రంగు సమతౌల్యాన్ని ఇస్తుందని నమ్మకం ఉంది. ఈ రంగులు వంటగదికి ప్రకాశాన్ని, సానుకూల శక్తిని తెస్తాయని భావిస్తారు.
Also Read: https://teluguprabha.net/devotional-news/evening-time-items-not-to-give-according-to-scriptures/
కానీ ఇప్పటికే నల్లటి స్లాబ్ వాడుతున్న ఇళ్లలో వాస్తు దోషాలను తగ్గించుకోవడానికి కొన్ని పరిష్కారాలు సూచించబడ్డాయి. వంటగదిలో రుద్రాక్షను ఉంచడం లేదా వాస్తు యంత్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ప్రతికూల శక్తి తగ్గుతుందని చెబుతారు. ఈ పద్ధతులు వంటగదిలో ఏర్పడే ప్రతికూలతలను తగ్గించి, కుటుంబంలో శాంతి, సమృద్ధి కలిగిస్తాయని నమ్మకం ఉంది.


